సూర్యుడిపై అన్వేషణ.. మనిషి పంపుతున్న తొలి స్పేస్‌క్రాఫ్ట్‌కు కౌంట్‌డౌన్

- July 23, 2018 , by Maagulf
సూర్యుడిపై అన్వేషణ.. మనిషి పంపుతున్న తొలి స్పేస్‌క్రాఫ్ట్‌కు కౌంట్‌డౌన్

హూస్టన్: సౌర కుటుంబంలోని అన్ని గ్రహాల స్థితిగతులను మనిషి ఇప్పటికే అధ్యయనం చేశాడు. ఇక ఇప్పుడు సూర్యుడిపై అన్వేషణకు సమయం దగ్గరపడింది. సూర్యుడిపైకి మనిషి పంపనున్న తొలి స్పేస్‌క్రాఫ్ట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆగస్ట్ 6లోపు ఈ స్పేస్‌క్రాఫ్ట్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. మొదట జులై 31కి పంపాలని అనుకున్నా.. ఇప్పుడు కాస్త అటూ ఇటూగా ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను లాంచ్ చేయడానికి అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా సిద్ధమవుతున్నది. కారు సైజులో ఉండే ఈ స్పేస్‌క్రాఫ్ట్ సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లనుంది.

దీనికి పార్కర్ సోలార్ ప్రోబ్ అని పేరు పెట్టారు. సూర్యుడి వాతావరణం నుంచి వస్తున్న అయస్కాంత శక్తి భూమితోపాటు సౌరకుటుంబంలోని ఇతర గ్రహాల వాతావరణాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. దీని వెనుక కారణాన్ని అన్వేషించే ప్రయత్నాన్ని సోలార్ పార్కర్ ప్రోబ్ చేపట్టనుంది. సూర్యుడి నుంచి శక్తి అణువులు ఒక్కోసారి కాంతి వేగంలో సగం స్పీడుతో దూసుకువస్తుంటాయి. ఇవి భూఅయస్కాంత క్షేత్రానికి బయట ఉండే శాటిలైట్ల ఎలక్ట్రానిక్స్‌పై ప్రభావం చూపిస్తాయి. అయితే సోలార్ ప్రోబ్‌కు అన్నింటి కంటే ఎక్కువగా సూర్యుడి వేడే పెద్ద అవరోధంగా మారే అవకాశాలు ఉన్నాయి.

దీనికోసం ప్రత్యేకంగా థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను రూపొందించి ఈ స్పేస్‌క్రాఫ్‌ట్‌కు రక్షణకవచంలా అమర్చారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాకెట్లలో ఒకటైన డెల్టా ఫోర్ హెవీ ద్వారా ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను లాంచ్ చేయనున్నారు. మార్స్‌పైకి వెళ్లడానికి కావాల్సిన ఇంధనం కంటే 55 రెట్లు ఎక్కువ ఇంధనం సూర్యుడి దగ్గరకు వెళ్లడానికి అవసరమవుతుంది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ సూర్యుడి ఉపరితలానికి 59 లక్షల కిలోమీటర్ల దగ్గరి వరకు వెళ్లనుంది.

ఈ మిషన్‌తో సూర్యుడి గురించి విప్లవాత్మకమైన విషయాలు బయటపడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సూర్యుడిలో జరిగే మార్పులు సౌరకుటుంబంపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో ఈ మిషన్‌ను నాసా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ గరిష్ఠంగా గంటలకు 430000 మైళ్ల వేగంతో ప్రయాణించనుంది. ఈ వేగం ఎంతంటే..

అమెరికాలోని వాషింగ్టన్ నుంచి జపాన్‌లోని టోక్యోకు నిమిషంలోపే వెళ్లొచ్చని నాసా చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com