మీరు శబరిమల కొండకు వెళ్తున్నారా!..అయితే..!

- July 23, 2018 , by Maagulf
మీరు శబరిమల కొండకు వెళ్తున్నారా!..అయితే..!

మీరు శబరిమల కొండకు వెళ్తున్నారా! గతంలో మాదిరిగా ప్లాస్టిక్ బ్యాగ్‌లు, ప్లాస్టిక్ ఉత్పత్తులను ఇరుముడిలో తీసుకెళ్తున్నారా! అయితే.. తస్మాత్ జాగ్రత్త. ప్లాస్టిక్ ఉత్పత్తులు తీసుకెళ్తే.. మీయాత్రకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. శబరి కొండను పర్యావరణ హిత యాత్రా స్థలంగా మార్చేందుకు కేరళ హైకోర్టు నిబంధనలను కఠిన తరం చేసింది. ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని ఆదేశాలు జారీ చేసింది.

కోట్లలో వచ్చే భక్తులు.. మోసుకొచ్చే బాటిళ్లు, కవర్లతో.... శబరిగిరి మొత్తం ప్లాస్టిక్ మయంగా మారిపోయింది. ఎన్ని రీసైక్లింగ్ ప్లాంట్లు పెట్టినా... ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. దీంతో తీవ్రమైన పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. చివరికి పంబా నది ప్రవాహానికి సైతం ఈ ప్లాస్టిక్‌ అడ్డంకిగా మారడంతో.. కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలలో ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

వచ్చే సీజన్ నుంచి శబరిమల కొండపై ప్లాస్టిక్ వస్తువులు కనిపించకూడదని అధికారులను ఆదేశించింది. శబరిమలకు వచ్చే యాత్రికులు ఉపయోగించే ప్లాస్టిక్ కారణంగా పర్యావరణ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయన్న నివేదికను దృష్టిలో పెట్టుకుని కొండను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. శబరిమల కొండ సహా పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ పొట్లాలు, నీళ్ల సీసాల అమ్మకాలపై రెండేళ్ల కిందట కేరళ హైకోర్టు నిషేధం విధించగా.. తాజాగా పూర్తి స్థాయి నిషేధాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

శబరిమల ఆలయ ప్రధాన పూజారి సూచన మేరకు సహజంగా భూమిలో కలిసిపోయే ఉత్పత్తులను మాత్రమే ఇరుముడిలో తీసుకురావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా బయోడీగ్రేడబుల్‌ వస్తువులను వాడాలని సూచించింది. భక్తులు ఏయే వస్తువులు తెచ్చుకోవాలన్నది.. ఆలయ పూజార్లు వివరించాలని తెలిపింది. శబరిమల ప్రత్యేక కమిషనర్‌ రూపొందించిన నివేదికను పరిశీలించిన హైకోర్టు పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు పరచాల్సిందిగా అధికారులను ఆదేశించింది. భక్తుల సౌకర్యార్థం ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సమాచారం ఇవ్వాల్సిందిగా న్యాయస్థానం సూచించింది.

ఇటీవలి కాలంలో శబరిమలలో ప్లాస్టిక్‌ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన పర్యావరణ ప్రేమికులు... కేరళ హైకోర్టును ఆశ్రయించారు. అన్ని వర్గాల వాదనలు పరిశీలించిన హైకోర్టు... హరిహరక్షేత్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com