పాక్ ఎన్నికలు: ఓడిపోయిన మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ

- July 26, 2018 , by Maagulf
పాక్ ఎన్నికలు: ఓడిపోయిన మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. ముల్తాన్‌లోని షుజాబాద్ నియోజకవర్గంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) అభ్యర్థి మొహమ్మద్ ఇబ్రహీంపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరపున పోటీ చేసిన గిలానీ ఓటమిపాలయ్యారు.

షుజాబాద్‌లో 2002లో గిలానీ మేనల్లుడు ముర్తాజా గిలానీ గెలుపొందారు. కాగా, ఆయన 2015లో హజ్ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో యూసుఫ్ గిలానీ ఆ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ, విజయం సాధించలేకపోయారు. గిలానీ 2008 నుంచి 2012 వరకు పాకిస్థాన్ ప్రధానిగా పనిచేశారు.

కాగా, పాకిస్థాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ ముందంజలో ఉంది. మొత్తం 272 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. 113 స్థానాల్లో పీటీఐ ముందంజలో ఉంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చెందిన పీఎంఎల్ఎన్ పార్టీ 67 స్థానాల్లో ముందంజలో ఉండగా, బిలావల్ భుట్టో నేతృత్వంలోని పీపీపీ 41స్థానాల్లో ముందంజలో ఉంది.

ఇది ఇలా ఉండగా, ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, జమాత్ ఉద్ దవా(జేయూడీ) అధినేత హఫీజ్ సయీద్‌ను పాకిస్థాన్ ఓటర్లు తిరస్కరించారు. ఆయన పార్టీలో అభ్యర్థులు దాదాపుగా వెనుకంజలో ఉన్నారు. అంతేగాక, గతంలో ఉగ్రవాదంతో సంబంధం ఉన్న అభ్యర్థులెవరూ ముందంజలో లేకపోవడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com