తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు

- July 26, 2018 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు

వ్యాస మహర్షి జన్మతిథిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ శుద్ధ పౌర్ణమికి ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సద్గురు సాయిబాబా ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. సాయినామ స్మరణతో మార్మోగుతున్నాయి. సాయి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు.

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి పర్వదిన వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. విద్యుత్‌దీప కాంతులతో సాయి ఆలయం దేదీప్యమానంగా కాంతులీనుతోంది. ఉదయం నుంచే బాబా ఆలయానికి చేరుకుంటున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గురపౌర్ణమిని పురస్కరించుకుని సాయికి బంగారు కిరీటాన్ని అలంకరించారు. ఉదయం ఏకాహం నుంచి ప్రారంభమైన వేడుకలు తేజాహారతి అనంతరం ముగియనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అటు ఎల్‌బీనగర్, పంజాగుట్ట, కూకట్‌పల్లి సాయిబాబా ఆలయాల్లో గురుపూర్ణిమ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునుంచే సాయిని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. జనం రద్దీతో క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. కుషాయిగూడ సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి వేడుకలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో సాయిని దర్శించుకుంటున్నారు.

యాదగిరిగుట్ట సద్గురు శ్రీ షిర్డీ సాయినాథుని ఆలయంలో గురుపూర్ణిమ సంబరాలు వైభవంగావోపేతంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో పలువురు ప్రముఖులు సాయిబాబాకు పూజలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com