కేరళ వరదలపై షాకింగ్ కామెంట్స్... లులూలో ఉద్యోగం ఊడింది...

- August 20, 2018 , by Maagulf
కేరళ వరదలపై షాకింగ్ కామెంట్స్... లులూలో ఉద్యోగం ఊడింది...

మస్కట్:ప్రకృతి విలయతాండవంతో అల్లాడుతున్న కేరళపై ప్రపంచదేశాలు కరిగినీరవుతున్నా... సొంతగడ్డ కష్టాలపై ఇతడి గుండెమాత్రం కరగలేదు. తోచిన సాయం చేయకపోగా కేరళలో జరుగుతున్న సహాయక చర్యలపై  అతడు సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్లు పెట్టాడు. దీంతో నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి సాగనంపింది. వివరాల్లోకి వెళితే...
 
కేరళకు చెందిన రాహుల్ చెరు పాలయట్టు అనే యువకుడు మస్కట్‌లోని లులూ హైపర్ మార్కెట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. కేరళ వరద బాధితుల కోసం ఎక్కడైనా శానిటరీ నాప్‌కిన్లు అవసరమైతే చెప్పాలంటూ ఎవరో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ ‘‘ఎవరికైనా కండోమ్‌లు కూడా కావాలంటే చెప్పండి..’’ అని కామెంట్ రాశాడు. కనీసం మానవత్వం లేకుండా అతడు చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమన్నారు. దీంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ఒమన్‌లోని అతడి కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ వెల్లడించారు.
 
‘‘భారత్‌లోని కేరళలో ప్రస్తుత వరద పరిస్థితులపై సోషల్ మీడియాలో నువ్వు చేసిన వ్యాఖ్యలు దారుణంగా, అవమానకరంగా ఉన్నాయి. నిన్ను ఇప్పుడే విధుల నుంచి తొలగిస్తున్నాం. నీ బాధ్యతలను రిపోర్టింగ్ అధికారికి అప్పగించి, ఫైనల్ సెటిల్‌మెంట్ కోసం వెంటనే అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌ను వెళ్లు..’’ అని హెచ్‌ఆర్ మేనేజర్ అతడిని ఆదేశించారు. కాగా తనను ఉద్యోగం నుంచి తొలగించేముందు రాహుల్ ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడాడు.. ‘‘కేరళ వాసులందరికీ క్షమాపణ చెబుతున్నాను. నేను మాట్లాడింది తప్పే. దయచేసి నన్ను క్షమించండి. నేను ఆ కామెంట్ పెట్టిన తర్వాత  స్నేహితులు కూడా ఫేస్‌బుక్‌లో నన్ను తిడుతున్నారు...’’ అని పేర్కొన్నాడు. తాను తాగిన మైకంలోనే ఆ కామెంట్ పెట్టానని చెప్పుకొచ్చాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com