తెలంగాణలో కొత్త జోన్‌లు ఇవే..

- August 30, 2018 , by Maagulf
తెలంగాణలో కొత్త జోన్‌లు ఇవే..

తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలిపింది. 7 జోన్లు, 2 మల్టీ జోన్లకు పచ్చజెండా ఊపింది. ఈమేరకు రాష్ట్రపతి సంతకంతో కూడిన గెజిట్ నోటిఫికేషన్‌ విడుదలైంది. కొత్త జోనల్‌ వ్యవస్థకు ఆమోదముద్ర పడిన నేపథ్యంలో.. తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఊపందుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన జోన్ల విషయానికి వస్తే.. 

జోన్‌1 కాళేశ్వరం జోన్. భూపాలపల్లి జయశంకర్ జిల్లా, ఆసిఫాబాద్-కొమ్రం భీమ్ జిల్లా, రామగుండం పోలీస్ కమిషనరేట్‌ ప్రాంతం దీనికిందకు వస్తుంది.

జోన్‌2కు బాసర పేరు పెట్టారు. దీని పరిధిలో.. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌ ప్రాంతాలు వస్తాయి.

జోన్‌3 విషయానికి వస్తే.. దీనికి రాజన్న జోన్‌గా నామకరణం చేశారు. కరీంనగర్‌, సిద్ధిపేట్ పోలీస్‌ కమిషనరేట్‌ ప్రాంతాలు, కామారెడ్డి, మెదక్, సిరిసిల్లా రాజన్న జిల్లాలు ఉన్నాయి.

జోన్‌4కు.. భద్రాద్రి పేరు పెట్టారు. దీని పరిధిలో వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషరేట్‌లు, మహబూబాబాద్, కొత్తగూడెం-భద్రాద్రి జిల్లాలు ఉన్నాయి. ఈ నాలుగు జోన్లు మల్టీజోన్‌-1లో చేర్చారు.

ఐదో జోన్‌కు… యాదాద్రిగా నామకరణం చేశారు. ఇందులో సూర్యాపేట్, నల్గొండ జిల్లాలు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ ప్రాంతం ఉన్నాయి.

ఆరో జోన్‌కు… చార్మినార్ పేరు పెట్టారు. హైదరాబాద్, సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్ ప్రాంతాలతో పాటు సంగారెడ్డి జిల్లాను ఇందులో చేర్చారు.

చివరది జోగులాంబ జోన్. ఇందులో మహబూబ్‌ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, వికారాబాద్‌, గద్వాల్-జోగులాంబ జిల్లాలు ఉన్నాయి. ఈ మూడు జోన్లు మల్టీజోన్‌2లో చేర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com