తెలంగాణ అసెంబ్లీ రద్దుకు కేసీఆర్ కేబినెట్ తీర్మానం
- September 06, 2018
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలకు తెరపడింది. తెలంగాణ తొట్టతొలి అసెంబ్లీని రద్దు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
కొద్ది సేపటి కిందట మంత్రివర్గ సమావేశం నిర్వహించిన కేసీఆర్ అందులోనే అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఏకవాక్య తీర్మానం ద్వారా శాసనసభ రద్దుకు సిఫార్సు చేసినట్లు సమాచారం.
మంత్రి వర్గ సమావేశం అయిన వెంటనే కేసీఆర్ గవర్నర్ నరసింహన్ను కలిసి అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని ఆయనకు అందజేశారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కొంతకాలంగా పలు వార్తలు వచ్చాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో ప్రగతి నివేదన సభ పేరిట ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ముందస్తుపై నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని చెప్పారు.
గురువారం ఉదయం ఆరున్నర గంటలకే ఈ నిర్ణయం వెలువడుతుందని చాలా మంది భావించారు.
అసెంబ్లీ రద్దు నేపథ్యంలో బుధవారం కేసీఆర్ అటు అధికారులు.. ఇటు పార్టీ నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపారు. బుధవారం సాయంత్రం గవర్నర్ను కలుస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన కలవలేదు.
తెలంగాణ శాసనసభలో మొత్తం సీట్లు 119. ఇందులో తెలంగాణ రాష్ర్ట సమితికి 90 సీట్లు, కాంగ్రెస్కు 13 సీట్లు ఉన్నాయి. ఎంఐఎంకు 7 సీట్లు, బీజేపీకి 5 సీట్లు, టీడీపీకి 3 సీట్లు, సీపీఐకి ఒకటి ఉన్నాయి.
ప్రగతి నివేదనలోనే సూచన
ఇటీవల జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ తెలంగాణలో 465 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ బిడ్డలే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని, వారి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చామని చెప్పారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తున్నామని తెలిపారు.
దిల్లీకి బానిసలు కాకుండా ఆత్మగౌరవంతో బతకాలని, తమిళ ప్రజలను స్ఫూర్తిగా తీసుకొని ఆత్మభిమానం, స్వయం అధికారంతో మనల్ని మనమే పాలించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే టికెట్లు కావాలన్నా దిల్లీలో పార్టీ పెద్దలవైపు చూడాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పథకాలు ప్రవేశపెడతామనేది ముఖ్యమంత్రి హోదాలో చెప్పడం సరికాదని అన్నారు.
''పార్టీ పథకాలు ఏంటో మేనిఫెస్టోలో పెడతాం. ఆ విధంగానే ఎన్నికల ప్రచారానికి వెళ్తాం'' అని తెలిపారు.
తర్వాత ఏంటి?
తెలంగాణ ప్రస్తుత శాసనసభ పదవీ కాలం 2014 జూన్ 9వ తేదీ నుంచి మొదలయింది. రాజ్యాంగంలోని 172వ అధికరణ ప్రకారం ఎన్నికైన శాసనసభ మొదటిసారి సమావేశమైన తేదీ నుంచి ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. ఆ ప్రకారం.. శాసనసభ గడువు ముగియటానికి 2019 జూన్ 8వ తేదీ వరకూ సమయముంది.
శాసనసభలో పూర్తి మెజారిటీ ఉన్న రాష్ట్ర మంత్రివర్గం సిఫారసులను పాటించాల్సిన విధి గవర్నర్కు ఉంటుందని 163వ అధికరణ నిర్దేశిస్తోంది. రాజ్యాంగంలోని 174 (2) అధికరణ కింద రాష్ట్ర శాసనసభను రద్దు చేసే అధికారం గవర్నర్కు ఉంది. ఈ నేపథ్యంలో శాసనసభను రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసినపుడు దానిని గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది.
సభలో మెజారిటీ ఉన్న ప్రభుత్వమే సిఫారసు చేసినందున.. శాసనసభను రద్దు చేసిన తర్వాత రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే వీలుండదు. అయితే.. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని, దానితో పాటు తన నివేదికను రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. శాసనసభను రద్దు చేసి ప్రస్తుత ముఖ్యమంత్రినే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరుతారు.
శాసనసభ రద్దయిన తర్వాత ఆరు నెలలలోగా కొత్త శాసనసభ కొలువుదీరాల్సి ఉంటుంది. అలా జరిగేలా చూసే బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానిది. అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల్లోగా కొత్త శాసనసభ ఎన్నికల ప్రక్రియను ఈసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







