హైదరాబాద్ లో ఎడతెరిపి లేని వర్షం.. దెబ్బకు రహదారులన్నీ..

- September 11, 2018 , by Maagulf
హైదరాబాద్ లో ఎడతెరిపి లేని వర్షం.. దెబ్బకు రహదారులన్నీ..

భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది.. తెల్లవారు జాము నుంచి దాదాపు గంట పాటు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. నిన్ని సాయంత్రం కూడా అర గంట నుంచి గంటపాటు కురిసిన వానకు రహదారులన్నీ నీట మునిగాయి. అతి తక్కువ వ్యవధిలో ఐదారు సెంటీమీటర్ల కురిసిన వర్షం దెబ్బకు రహదారులన్నీ కాలువలను తలపిస్తున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. రాత్రి నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితి. ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పాతబస్తీ ప్రాంతాలపై వాన ప్రభావం అధికంగా కనిపిస్తోంది. చార్మినార్‌, అసిఫ్‌నగర్‌, సర్దార్‌ మహల్‌ ప్రాంతాల్లో 93.8 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి.. ఇవాళ రేపు కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.. ఉప్పల్‌లో ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. యూసుఫ్‌గూడలోని శ్రీకృష్ణనగర్‌, వెంకటగిరిల్లో మోకాళ్ల లోతు నీటితో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. మెహదీపట్నం, టోలీచౌక్‌, షేక్‌పేట్‌ ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి..

భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాలు, విపత్తు దళాలు అప్రమత్తమయ్యాయి. రహదారిపై నిలిచిన నీరు వెళ్లేలా చర్యలు చేపట్టాయి. అదే సమయంలో మళ్లీ వర్షం కురవడంతో.. GHMC సిబ్బందికి చుక్కలు కనిపిస్తున్నాయి. బుద్ధభవన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూంలోని సీసీ కెమెరాల ద్వారా ముంపు ప్రాంతాలను, నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలకు బృందాలను పంపిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా రాజేంగ్రనగర్‌ పరిధి గండిపేట్‌ మండల్‌లోని బండ్లగూడ, కిస్మత్‌పూర్‌, హైదరాషా కోట్‌, హిమాయత్‌ సాగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బండ్లగూడాలోని వినాయక నగర్‌ కాలనీలో ఇళ్లలోకి భారీగా వాన నీరు చేరింది. కాలనీలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com