ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్‌ వార్నింగ్

- November 08, 2025 , by Maagulf
ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్‌ వార్నింగ్

అమరావతి: అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఎర్ర చందనంపై స్పెషల్ ఫోకస్ పెట్టానని ఆంధ్రప్రదేశ్ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో పవన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరాలు తెలిపారు.

“ఎవ్వరూ చందనం చెట్లు నరికే వృత్తిలోకి వెళ్లకండి. తమిళనాడు వాళ్లకు కూడా ఇదే చెబుతున్నాను. ఇదే నా వార్నింగ్. స్మగ్లింగ్ జోలికి వెళితే తాట తీస్తాను. మహారాష్ట్ర నిర్వహించిన ఆపరేషన్ లాగా ఇక్కడ మరో ఆపరేషన్ చేపడతాం. ఎర్రచందనం జోలికి వెళితే తాట తీసి కూర్చోబెడతా. మర్యాదగా వేరే పని చేసుకోండి. ఎర్ర చందనం చెట్లు కొట్టాలంటే భయపడే స్థితికి తీసుకువస్తాము” అని పవన్ అన్నారు.

వైసీపీ అధికారంలో ఉన్న 2019-2024 మధ్య కాలంలో ఎర్ర చందనం భారీగా స్మగ్లింగ్ జరిగిందని పవన్ (Pawan Kalyan) చెప్పారు. ఐదు జిల్లాల ఎస్పీలతో ఇవాళ మీటింగ్ నిర్వహించానని తెలిపారు.

“ప్రస్తుతం మన గోడౌన్‌లో దొంగల నుంచి పట్టుబడ్డ 2.65 లక్షల దుంగలు ఉన్నాయి. అంటే లక్ష 30 వేల చందనం చెట్లను అడ్డగోలుగా నరికివేసినట్లు భావించాలి. వీటి విలువ 5 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. పట్టుబడకుండా స్మగ్లింగ్‌లో తరలిపోయింది ఇంకా చాలా ఉంది. ఒక అంచనా ప్రకారం ఆ ఐదేళ్ల కాలంలో 8 నుంచి 10 వేల కోట్ల రూపాయల ఎర్ర చందనం స్మగ్లింగ్ జరిగింది.

మన నుంచి తరలిపోయి కర్ణాటకలో ఎర్రచందనం పట్టుబడింది. వాటిని అమ్మి కర్ణాటక సర్కారు 140 కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంది. అప్పుడు ఉన్న మంత్రులు ఎవరూ బాధ్యతలు తీసుకోలేదు.ఎవరి ఊహకూ అందనంత సొత్తు ఎర్ర చందనం ద్వారా దోచుకున్నారు. శేషాచల అడవిలో ఇప్పుడు పెద్ద పెద్ద ఎర్రచందనం చెట్లు లేకుండా పోయింది.

ఎర్రచందనం విషయంలో మనకు, ఇతర రాష్ట్రాలకు మధ్య సమన్వయం కావాలి. నేపాల్‌లో మన ఎర్ర చందనం దొరుకుతోంది. అన్ని రాష్ట్రాల మధ్య ఏపీకి ఒప్పందం ఉండాలి. ఎక్కడ దొరికినా అది మనకు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఉమ్మడి కడప జిల్లా రెండు, మూడు జోనల్‌లలో స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నలుగురు కింగ్ పిన్‌లను గుర్తించాం. వారిని త్వరలో పట్టుకుంటాం” అని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com