విధ్వంసం సృష్టించిన హరికేన్ ఫ్లోరెన్స్, 5 మంది మృతి

- September 15, 2018 , by Maagulf
విధ్వంసం సృష్టించిన హరికేన్ ఫ్లోరెన్స్, 5 మంది మృతి

అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన హరికేన్ ఫ్లోరెన్స్ నార్త్ కరోలినా, సౌత్ కరోలినా రాష్ర్టాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కోస్తా తీరం వెంబడి గాలులు వేగంగా వీస్తుండటంతో భారీ వృక్షాలు, టవర్లు నేలకొరిగాయి. శుక్రవారం సాయంత్రం తీరాన్ని తాకగా.. కొన్ని క్షణాల్లోనే విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పలు ఘటనల్లో ఐదుగురు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. విల్మింగ్టన్‌లో ఒక చెట్టు ఇంటిపై కూలడంతో అందులో నివసిస్తున్న తల్లి, బిడ్డ మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో గాయపడిన పాప తండ్రిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరో మహిళ గుండెపోటుతో చనిపోయింది. వైద్య సిబ్బంది ఆమె దగ్గరకు చేరుకొని చికిత్స అందించేందుకు ప్రయత్నించగా.. శిథిలాలు రోడ్డుకు అడ్డంగా పడటంతో దారి మధ్యలోనే చిక్కుకున్నారు. మరికొద్ది రోజుల్లో చాలా ప్రాంతాలు నీటమునిగే అవకాశం ఉన్నట్లు స్థానిక వాతావరణశాఖ అధికారులు తెలిపారు. చాలా చోట్ల సురక్షిత మంచి నీరు, నిత్యవసరాల కోసం ప్రజలు బారులు తీరారు.

అమెరికా తూర్పు తీర ప్రాంతాల్లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను వల్ల భారీగా ఫ్రాణనష్టం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శనివారం వరకు తీర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. హరికేన్ ప్రభావం చూపే నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ర్టాల్లో అమెరికా అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com