ఉత్తమ్‌, విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి లకు ప్రమోషన్

- February 01, 2019 , by Maagulf
ఉత్తమ్‌, విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి లకు ప్రమోషన్

తెలంగాణ:లైఫ్ అండ్‌ డెత్‌ సమస్యగా మారిన లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలంగాణ పై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న శ్రేణుల్లో జవసత్వాలు నింపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికలకు వారిని సమాయత్తం చేసేలా వివిధ కమిటీలను నియమించారు. సీనియర్లకు పెద్ద బాధ్యతలు అప్పగించారు.

లోక్‌సభ ఎన్నికల కోసం మొత్తం ఐదు కమిటీలను నియమించారు రాహుల్. కీలక మైన ఎలక్షన్‌ కమిటీని 24 మందితో ఏర్పాటు చేశారు. ఇందులో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కుసుమ కుమార్ పాటు జానారెడ్డి, వీ హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి వంటి సీనియర్లకు స్థానం కల్పించారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతికి ప్రచార బాధ్యతలు అప్పగించారు రాహుల్‌. 20 మందితో ఏర్పాటు చేసిన క్యాంపెయిన్ కమిటీకి ఆమెను అధ్యక్షురాలిగా నియమించారు.

మాజీ మంత్రి డీకే అరుణను కమిటీకి కో చైర్మన్ చేశారు. ఇక క్యాంపెయిన్ కమిటీలో వీరితో పాటు జగ్గారెడ్డి, బెల్లయ్య నాయక్, కార్తీక్ రెడ్డితో పలువురు సీనియర్లు ఉంటారు. పబ్లిసిటీ కమిటీకి చైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, కో చైర్మన్ గా గంగారామ్‌, కన్వీనర్ గా మల్లు రవిని నియమించారు. ఇందులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు స్థానం కల్పించారు. మీడియా కో ఆర్డినేషన్ బాధ్యతను మాజీ ఎంపీ మధుయాష్కీకి కట్టబెట్టారు రాహుల్‌. దాసోజ్ శ్రవణ్ కుమార్ మీడియా కో ఆర్డినేషన్ కమిటీకి కన్వీనర్‌గా ఉంటారు. మల్లు రవి, సురేశ్‌ కుమార్, ఇందిరా శోభన్ లను ఇందులో సభ్యులుగా నియమించారు.

కీలకమైన పార్టీ కో ఆర్డినేషన్ కమిటీని 37 మందితో ఏర్పాటు చేశారు రాహుల్‌ గాంధీ. ఈ కమిటీకి కుంతియా చైర్మన్ గా ఉంటారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఈ కమిటీకి కన్వీనర్ వ్యవహరిస్తారు. జానారెడ్డి, హనుమంతరావు, నంది ఎల్లయ్య, జీవన్ రెడ్డి వంటి సీనియర్లను ఇందులో సభ్యులుగా నియమించారు. సీనియర్లు విభేదాలు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు రాహుల్. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com