అమెరికన్‌ కాంగ్రెస్‌ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ట్రంప్ ప్రసంగం

- February 07, 2019 , by Maagulf
అమెరికన్‌ కాంగ్రెస్‌ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ట్రంప్ ప్రసంగం

వాషింగ్టన్‌: మధ్య అమెరికా నుంచి ఉత్తర అమెరికాకు వస్తున్న వలసలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శివమెత్తారు. అమెరికా ఎదుర్కొంటున్న సకల సమస్యలకు అక్రమ వలసలే కారణమని ఆడిపోసుకున్నారు. . క్యాలెండర్‌ సంవత్సర ప్రారంభంలో జరిగే అమెరికన్‌ కాంగ్రెస్‌ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ట్రంప్‌ వార్షిక ప్రసంగం చేస్తూ వలసలపై విషం కక్కారు. వలసలు పెరిగిపోవడానికి లాటిన్‌ అమెరికాలో ఆకలి, దారిద్య్రం, హింస తాండవించడమే కారణమన్నారు. అస్తవ్యస్థ పరిస్థితి నెలకొన్న ఈ దేశాల నుంచి అమెరికాకు వలసలు పెరిగిపోయాయని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదానికి వలసవాసులే కారణమని ఆయన నిందించారు. దక్షిణ అమెరికా నుంచి వలసలను అరికట్టేందుకే సరిహద్దు గోడ అని ట్రంప్‌ చెప్పారు. ఈ గోడ నిర్మాణానికి డెమొక్రాట్లు అడ్డుపడుతున్నారంటూ ఆయన చిర్రుబుర్రులాడారు. ఆ వెంటనే సోషలిస్టు విధానాలపై ఆయన విరుచుకుపడ్డారు. మదురో ప్రభుత్వం కాలం చెల్లిన ఈ సోషలిస్టు విధానాలను అనుసరించడం వల్లే వెనిజులా పేదరికం, నిరాశా నిస్పృహల్లోకి జారిందన్నారు. అమెరికాలో సోషలిజం గురించి మాట్లాడే సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌, అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్‌ లాంటివారికి వెనిజులా ఒక గుణపాఠం అన్నారు. 

ఇరాన్‌పై ఆంక్షలకు సమర్థన 
ఇరాన్‌పై ఆంక్షలను ట్రంప్‌ నిస్సిగ్గుగా సమర్థించుకున్నారు. ఇరాన్‌ను ఉగ్రవాద దేశంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో ఇరాన్‌ ముందుంటుందని ట్రంప్‌ ఆరోపించారు. అక్కడ అవినీతికర, నిరంకుశ ప్రభుత్వం రాజ్యమేలుతోందని, అణ్వాయుధాలను ఎన్నడూ సమకూర్చుకోకుండా చూసేందుకే వినాశకర ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి తప్పుకుని, ఆ దేశంపై కఠినమై ఆంక్షలు విధించామని ఆయన చెప్పారు.. ట్రంప్‌ చేసిన ఆరోపణలను ఇరాన్‌ తోసిపుచ్చింది. 'నియంతలకు, ఉగ్రవాదులకు మద్దతునిచ్చే అమెరికా మమ్మల్ని ఉగ్ర రాజ్యమని నిందించడంలో అర్థం లేదని' ఇరాన్‌ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. 2015లో ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి 2018 మేలో ట్రంప్‌ ప్రభుత్వం వైదొలగిన సంగతి తెలిసిందే. ఈ బహుళపక్ష ఒప్పందంపై జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌,రష్యా, చైనా కూడా సంతకాలు చేశాయి. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని కట్టడి చేయడం, దీనికి ప్రతిగా ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను అమెరికా ఎత్తివేయాలని ఈ ఒప్పందం పేర్కొంటోంది. ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా తప్పుకున్న అగ్రరాజ్యం ఇరాన్‌ ఆటోమోటివ్‌, వాణిజ్యం, పారిశ్రామిక సంస్థలతో వ్యాపార సంబంధాలను నిషేధించింది. బంగారం, ఉక్కు, అల్యూమినియం ఇతర విలువైన ఖనిజాల్లో వ్యాపారంపై ఆంక్షలు విధించింది.

అమెరికాకు ఆ శక్తి గోడలతో రాలేదు వలసవాసులతోనే వచ్చింది - ట్రంప్‌కు దీటుగా బదులిచ్చిన డెమొక్రాట్లు 
మంగళవారం నాటి వార్షిక ప్రసంగంలో ట్రంప్‌ వలస వాసులను దేశానికి ఉపద్రవంగా చిత్రించ డంపై స్టాసీ అబ్రామ్స్‌, బెర్నీ శాండర్స్‌ వంటి డెమొ క్రాట్‌ సెనెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాను సంపన్న దేశంగా నిలిపింది గోడలు కాదు, వలసవాసులేనన్న విషయం గుర్తుంచుకుంటే మంచి దని ఆఫ్రొ అమెరికన్‌ మహిళా సెనెటర్‌ అబ్రామ్స్‌ వ్యాఖ్యానించారు. ఆమె అబిప్రాయంతో ఏకీభవిస్తూ అత్యధిక అమెరికన్లు ట్వీట్‌ చేశారు. ట్రంప్‌ చెత్త వాగుడులో ప్రతిదానికి స్పందించి తాము సమయం వృధా చేసుకోదలచుకోలేదని అబ్రామ్స్‌, శాండర్స్‌ అన్నారు. 

ఆర్థిక వ్యవస్థ ఊపులో వుంటే ఈ కష్టాలెందుకు? 
అమెరికా ఆర్థిక వ్యవస్థ మంచి ఊపులో వుందని ట్రంప్‌ చెప్పడాన్ని పలువురు ఆర్థిక నిపుణులు తూర్పారబట్టారు. వారు ట్రంప్‌ ప్రభుత్వానికి సూటిగా నాలుగు ప్రశ్నలు వేశారు. ట్రంప్‌ చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థ అంత ఊపు మీద ఉంటే 78 శాతం మంది కార్మికులు వేతన చెక్కుల కోసం చకోర పక్షుల్లా ఎందుకు వేచి చూడాల్సి వస్తుంది? నెల చివరికి వచ్చేసరికి 50 శాతం మందికి పైగా అమెరికన్ల చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి ఎందుకు దాపురించింది? నాలుగింట ఒక వంతుమంది కార్మికులు నెల చివరికొచ్చేసరికి అప్పో సప్పో చేస్తే కానీ జీవనం గడవని స్థితి ఎందుకేర్పడింది? వీటికి ముందు ట్రంప్‌ సమాధానమివ్వాలని వారు డిమాండ్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com