ఏపీలో రాహుల్ పట్ల సానుకూలత.. పోటీ ఆ రెండు పార్టీల మధ్యే..
- February 24, 2019
అధికారంలోకి వస్తే ఏపీకి హోదా గ్యారెంటీగా ఇస్తామంటున్నారు రాహుల్. పదేపదే ప్రకటన చేసి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీకి మోడీ నమ్మకద్రోహం చేశారన్న వాదన అణువణువూ వ్యాపించింది. ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత బలంగా నాటుకుపోయింది. హామీ ఇచ్చి మోసం చేశారని ప్రజలు కూడా రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్తితులను అనుకూలంగా మలుచుకుని మళ్లీ వైభవం చాటుకోవాలని రాహుల్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మా వల్ల గాయమైంది నిజమే.. కానీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి హోదా ఇచ్చి మీ హక్కులను కాపాడతామని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మా తొలి ప్రాధాన్యత హోదా అంటూ రాష్ట్రంలో తిరుగుతున్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్తున్న భరోసాపట్ల ప్రజలు సానుకూలంగానే స్పందిస్తున్నారు.
సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆయన నమ్మకం కలిగిస్తున్నారు. దీంతో గతంలో ఉన్నంత వ్యతిరేకత కాంగ్రెస్ పట్ల ఇప్పుడు కనిపించడం లేదు. 50శాతం మంది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే హోదా వస్తుందని నమ్ముతున్నారు. అయితే ఇదంతా ఓటుగా మారే అవకాశం లేదు. హోదా అంశమే ఎన్నికల ఎజెండా అయినా.. పోటీ టీడీపీ – వైసీపీ మధ్యే ఉంటుంది. హోదా ఓ అంశం మాత్రమే… నాయకత్వం, అభివృధ్ధి, పాలన, సమర్ధత వంటివి కూడా ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇక్కడ రాహుల్ పట్ల సానుకూలత ఉంది. ఆయన ప్రధాని కావాలని లేదా ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ మద్దతున్న ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా.. ఏపీలో ఓటు మాత్రం పడదు.
వాస్తవానికి రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే హోదా వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్నారు. కానీ పొత్తుపెట్టుకునే పరిస్థితులు లేవు. విభజన పాపం మోస్తున్న హస్తంతో చేయి కలిపితే మొదటికే మోసం వస్తుందని తమ్ముళ్లు దూరం పెడుతున్నారు. జాతీయ స్థాయిలో మద్దతుకు పరిమితం అయ్యారు. అటు రాహుల్ కూడా హోదా ఇస్తామంటున్నారు.
కానీ టీడీపీకి వద్దు హోదా ఇస్తాం మాకే వేయండని చెప్పలేరు. చెప్పినా ఓటు పడే పరిస్థితి లేదు. ఇక వైసీపీ జాతీయ పార్టీలకు సమదూరం పాటిస్తోంది. ఎవరు హోదా ఇస్తే వారికే తమ మద్దతు అంటోంది. 25 సీట్లు ఇస్తే కేంద్రంలో శాసించి హోదా సాధిస్తామంటోంది. సరిగ్గా ఇదే సమయంలో రాహుల్ ప్రచారం చేస్తే వైసీపీ ఓట్లు చీలతాయని తమకే లాభమని టీడీపీ విశ్వసిస్తోంది. రాహుల్ ప్రభావం అసలు ఉండదని.. ఒకవేళ ఉన్నా మా ఓటుబ్యాంకు చెదరదని జగన్ అంటున్నారు.
వాస్తవానికి కాంగ్రెస్ ఏపీలో దారుణంగా దెబ్బతింది. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాలించింది. విభజనకు ముందు పదేళ్లు కూడా అధికారంలో ఉంది. 2014కు ముందు అతిపెద్ద పార్టీ… 2014 తర్వాత అడ్రస్ లేని పార్టీగా మారింది. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీకి 2.9శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి. మొత్తం ఓట్లు కూడా 8 లక్షల 22వేల 5వందలు మాత్రమే. ఒక్క చోట మాత్రమే రెండోస్థానంలో నిలిచింది. సుమారు 150 నియోజకవర్గాల్లో 5వేల ఓట్ల లోపుతో డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు. తర్వాత జరిగిన నంద్యాల ఎన్నికల్లో ఓటుశాతం మరింత దిగజారి 1.5శాతానికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో రాహుల్ ఎంత ప్రయత్నించినా ఓటుశాతం పెరిగే అవకాశం లేదు. పోటీ టీడీపీ-వైసీపీ మధ్యనే అన్నది విస్పష్టం. రాహుల్ పర్యటనలు, ప్రచారంవల్ల ఒకటి అర శాతం ఓట్లు పెరిగితే దీని వల్ల ఎవరికి లాభం, మరెవరికి నష్టం అన్న చర్చకు పరిమితం అవుతున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..