భారత మహిళల లక్ష్యం 2021 వరల్డ్ కప్

- February 27, 2019 , by Maagulf
భారత మహిళల లక్ష్యం 2021 వరల్డ్ కప్

భారత క్రికెట్ జట్లు ప్రపంచ కప్ విజయమే లక్ష్యంగా దూసుకెళుతున్నాయి. విరాట్ కోహ్లీ నేతృత్వంలో పురుషుల జట్టు 2019 లండన్ ప్రపంచ కప్ పై దృష్టి సారిస్తే, మిథాలీ రాజ్ నాయకత్వంలోని మహిళల జట్టు 2021లో న్యూజిలాండ్ లో జరగనున్న ఐసీసీ మహిళా ప్రపంచకప్ పై కన్నేసింది. భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్ల మధ్య పోలికలు చాలానే వున్నాయి. ప్రపంచ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగుల్లో విరాట్ కోహ్లీ నెంబర్ వన్,రోహిత్ శర్మ నెంబర్ 2 స్థానాల్లో వుంటే మహిళల ర్యాంకింగుల్లో భారత బ్యాటర్ స్మృతి మందాన అగ్రస్థానంలో, కెప్టెన్ మిథాలీ రాజ్ అయిదో ర్యాంక్ లో నిలిచారు. అలాగే భారత పురుషుల జట్టు మాదిరే మహిళల జట్టూ టీమ్ ర్యాంకింగులలో నెంబర్ 2 స్థానం కైవశం చేసుకుంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగులలో విరాట్ సేనలాగే పోటాపోటీగా మిథాలీ సేనా మహిళా విభాగంలో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. వన్డేలలో ఆల్ రౌండర్ విభాగంలో పురుషుల జట్టు నుంచి మొదటి పది ర్యాంకుల్లో ఒక్కరూ లేరు. కేదార్ జాదవ్ 16వ ర్యాంకు, హార్దిక్ పాండ్యా 17వ ర్యాంకులో వుంటే మహిళా జట్టు నుంచి దీప్తిశర్మ్ మూడో ర్యాంకు, జులన్ గోస్వామి 12వ ర్యాంకు సాధించారు. బౌలింగ్ లోనూ పురుషుల జట్టుతో ధీటుగా మొదటి పది స్థానాల్లో మహిళలూ చోటు సంపాయించారు. బుమ్రా, కుల్దీప్ యాదవ్, చహల్ మాదిరే జులన్ గోస్వామి, దీప్తిశర్మ, పూనమ్ యాదవ్, ఏక్తా బిస్త్ జట్టు బౌలింగ్ బాధ్యతలు మోస్తున్నారు.
 
భిన్న ఫార్మాట్లలో వరల్డ్ కప్ లు
పురుషుల వరల్డ్ కప్ ను రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో, మహిళల ప్రపంచ కప్ ను ఛాంపియన్ షిప్ లో ర్యాంకుల ఆధారంగా నిర్వహించనున్నారు. పురుషుల వన్డే వరల్డ్ కప్ పోటీలు వచ్చే మే 30 నుంచి ఇంగ్లండ్ అండ్ వేల్స్ లో జరుగుతాయి. రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్ల మధ్య సెమీస్, సెమీస్ విజేతల మధ్య ఫైనల్స్ నిర్వహిస్తారు. మొదటి-నాలుగవ స్థానాల్లోని జట్ల మధ్య జులై 9 వ తేదీన మొదటి సెమీస్, రెండు-మూడు స్థానాల్లో నిలిచే జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ 11న జరుగుతాయి. ఈ మ్యాచ్ ల విజేతలు జులై 14వ తేదీన లండన్ లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఫైనల్స్ లో తలపడతారు. భారత జట్టు 1983లో మొట్టమొదటి ప్రపంచ కప్ ను లార్డ్స్ మైదానంలో అలనాటి మేటి జట్టు వెస్టిండీస్ పై సాధించింది. అచ్చొచ్చిన అదే గ్రౌండ్లో జరగనున్న వరల్డ్ కప్ ఈసారీ మనకే సొంతం కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక మహిళల వరల్డ్ కప్ విషయానికొస్తే 2021లో జరిగే పోరుకు ప్రస్తుతం వివిధ దేశాలు, జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ మహిళల ఛాంపియన్ షిప్ మ్యాచ్ లను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 2017లో ఆరంభమైన ఈ ఛాంపియన్ షిప్ ద్వైపాక్షిక మ్యాచ్ ల్లో ఎనిమిది అగ్ర జట్లు మొదటి నాలుగు స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. ఆతిథ్య జట్టుగా న్యూజిలాండ్ ర్యాంకులతో పనిలేకుండా నేరుగా టోర్నీకి అర్హత సాధిస్తుంది. మిగిలిన ఏడు జట్లలో ర్యాంకింగులలో అగ్రస్థానంలో నిలిచే నాలుగు జట్లు అర్హత పొందుతాయి. నేరుగా అర్హత పొందలేని మిగిలిన మూడు జట్లు 2020లో జరిగే మహిళా వన్డే ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ లో ఇతర చిన్నచిన్న దేశాల జట్లతో పోటీ పడతాయి. బంగ్లాదేశ్, ఐర్లాండ్ లతో పాటు నాలుగు ఖండాల నుంచి క్వాలిఫై అయ్యే మరో నాలుగు జట్లతో ఈ మూడు జట్లు మళ్లీ తలపడవలసి వుంటుంది.

దీనిలో భాగంగానే ప్రస్తుతం ముంబైలోని వాంఖడే స్టేడియంలో వుమెన్ వరల్డ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల సిరీస్ ను భారత మహిళల జట్టు కైవశం చేసుకుంది. మొదటి రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన మిథాలీ సేన మరో మ్యాచ్ మిగిలి వుండగానే విజేతగా నిలిచింది. మూడో మ్యాచ్ సిరీస్ పరంగా నామమాత్రమే అయినప్పటికీ పాయింట్ల పరంగా కీలకమైనదే. ఈ సిరీస్ కు ముందు భారత జట్టు 122, ఇంగ్లండ్ 121 పాయింట్లతో నువ్వానేనా అన్నట్టు వున్నాయి. కేవలం ఒక్క పాయింట్ తేడాతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయి డీలాపడింది. ఈ విజయాలతో భారత మహిళా జట్టుకు ఇప్పటి దాకా కేవలం ఒక్క అదనపు పాయింట్ మాత్రమే దక్కింది. కానీ రెండు పాయింట్లు కోత పడడంతో ఇంగ్లండ్ టీమ్ 119 పాయింట్లకు పడిపోయింది. అందుకే మూడో వన్డేలోనూ ఆ జట్టును మట్టి కరిపించాలని, మరిన్ని పాయింట్లు సాధించాలనే పట్టుదలతో భారత మహిళలు ఎల్లుండి జరిగే మ్యాచ్ కు సన్నద్ధమౌతున్నారు. భారత జట్ల లక్ష్యం వరల్డ్ కప్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com