పాకిస్థాన్ ప్రభుత్వానికి మరో చిక్కు

- March 03, 2019 , by Maagulf
పాకిస్థాన్ ప్రభుత్వానికి మరో చిక్కు

పాకిస్థాన్ ప్రభుత్వానికి మరో చిక్కు వచ్చి పడింది. అది కూడా అగ్రరాజ్యం అమెరికా నుంచి. ఇప్పటికే ఉగ్రవాదులు, ఉగ్రసంస్థల విషయంలో కన్నెర్ర చేస్తున్న అమెరికా, తాజాగా ఎఫ్-16 యుద్ధ విమానాల విషయంలో గుర్రుగా ఉంది. పాకిస్థాన్ కు తాము అందించిన ఎఫ్-16 యుద్ధ విమానాలకు సంబంధించి పూర్తి వివరాలు అందచేయాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎఫ్-16 ఫైటర్ జెట్స్ ను ఏయే పనులకు ఉపయోగిస్తున్నారో సమాచారం అందించాలని కోరింది.

ఎఫ్-16 యుద్ధ విమానాలను అమెరికా తయారు చేసింది. ఆ ఫైటర్ జెట్స్ ను పాకిస్తాన్ కు అమ్మింది. ఐతే, ఉగ్రవాదంపై పోరాటం చేయడానికి మాత్రమే ఆ యుద్ధ విమానాలను ఉపయోగించాలని షరతు విధించింది. పాకిస్తాన్ కూడా టెర్రరిజంపై ఫైటింగుకే ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉపయోగిస్తామని అమెరికా ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఐతే, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, ఉగ్రవాదంపై పోరుకు ఉప యోగించాల్సిన యుద్ధ విమానాలు, ఇతర పనులకు ఉపయోగించారని బయటపడింది. స్వయంగా భారత ప్రభుత్వమే అందుకు సంబంధించిన వివరాలను బయటపెట్టడంతో పాకిస్థాన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ముజఫరబాద్, చకోటి, బాలాకోట్ లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసింది. ఆ దాడితో షాక్ తిన్న పాకిస్థాన్, తాను కూడా భారత్ పై యుద్ధ విమానాలను ప్రయోగించింది. పూంచ్, రాజౌరీ సెక్టార్లలోకి ప్రవేశించిన పాక్ ఫైటర్ జెట్స్, బాంబులు వేసేందుకు ప్రయత్నించాయి. ఐతే, భారత యుద్ధ విమానాలు ప్రతిదాడి చేయడంతో పాక్ యుద్ధ విమానాలు తోకముడిచాయి. ఐతే, పోతూ పోతూ ఆమ్రామ్ క్షిపణులను ప్రయోగించాయి. ఆ ఆమ్రామ్ క్షిపణి శకలాలను స్వాధీనం చేసుకున్న భారత సైన్యం, అవి ఏ యుద్ధ విమానానికి సంబంధించినవో బయటపెట్టింది.

ఆమ్రామ్ క్షిపణులను కేవలం ఎఫ్-16 యుద్ధ విమానాల్లోనే ఉపయోగిస్తారు. దాంతో భారత్ పై దాడి కోసం పాక్ సైన్యం ఎఫ్-16 ఫైటర్ జెట్స్ ఉపయోగించినట్లు బయటపడింది. పైగా, ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారతదేశం మిగ్-21 యుద్ధ విమానంతో కూల్చేసింది. ఈ రెండు వ్యవహారాలు అమెరికాకు ఆగ్రహం తెప్పించాయి. ఉగ్రవాద నిర్మూలన కోసం ఉపయోగించాల్సిన ఎఫ్-16 యుద్ధ విమానాలను భారత్ పై దాడికి ఉపయోగించడమే కాకుండా, మిగ్-21 ఫైటర్ జెట్ చేతిలో ఎఫ్-16 ఫైటర్ జెట్ కూలిపోవడం అగ్రరాజ్యానికి మంట పుట్టించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎఫ్-16 యుద్ధ విమానాలకు సంబంధించి పూర్తి వివరాలు అందచేయాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com