మరోసారి బరితెగించిన పాక్.. ధీటైన సమాధానం ఇచ్చిన భారత్

- March 05, 2019 , by Maagulf
మరోసారి బరితెగించిన పాక్.. ధీటైన సమాధానం ఇచ్చిన భారత్

భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్థాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను భద్రతా బలగాలు కూల్చివేశాయి. రాజస్థాన్‌లోని బికనేర్‌ నల్‌ సెక్టార్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను సుఖోయి 30ఎంకేఐ’ ద్వారా కూల్చేసినట్లు తెలిసింది. భారత గగనతల నిబంధనలను ఉల్లంఘిస్తూ పాక్‌ ఈ చర్యకు పాల్పడిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఆ సరిహద్దు ప్రాంతంలోకి పాక్‌కు చెందిన డ్రోన్‌ ప్రవేశించిన వెంటనే గుర్తించిన భారత్‌.. దాన్ని పేల్చేసిందని తెలిసింది. భారత వైమానిక దళ రాడార్ల ద్వారా భద్రతా సిబ్బంది దాన్ని గుర్తించి, వెంటనే ప్రతిస్పందించారు.
 
ఫిబ్రవరి 26న బాలాకోట్‌ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దళం దాడులు జరపడానికి ముందు బాలాకోట్‌లో 300 ఫోన్లు క్రియాశీలకంగా పనిచేశాయని భారత నిఘా వర్గాలు గుర్తించినట్లు సమాచారం. అలాగే ఆ స్థావరంలో ఉంటున్న వారి సంఖ్యపైన కచ్చితమైన లెక్కలు ఇచ్చినట్లు ఓ అధికారి వెల్లడించారు. దాడులు నిర్వహించడానికి ఐఏఎఫ్‌కు అనుమతి వచ్చిన వెంటనే నేషనల్ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ ఆ స్థావరంపై నిఘా వేసింది. ఆ సంస్థ అందించిన సమాచారం ఆధారంగా ఫిబ్రవరి 26న 12 మిరాజ్ 2000 యుద్ధవిమానాలు పాకిస్థానీ గగనతలంలోకి ప్రవేశించి, 1000 కిలోల బాంబులతో దాడిచేశాయి. ఎన్‌టీఆర్‌ఓ సమాచారం ప్రకారం దానిలో ఉగ్రవాదులు, కమాండర్లతో పాటు పలు ఆయుధాలు ఉన్నాయి. ‘టెక్నికల్ సర్వైలెన్స్ సమయంలో ఆ స్థావరంలో 300 ఫోన్లు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. దాన్ని ఐఏఎఫ్‌ ధ్వంసం చేసిందని ఓ అధికారి వెల్లడించారు.

ఓ వైపు శాంతి వచనాలు వల్లిస్తూనే మరోవైపు పాక్‌ తన విపరీత బుద్ధిని చాటుకుంటోంది. తాజాగా ప్రతి సోమవారం ఇరు దేశాల మధ్య నడిచే బస్సును పూంచ్‌ సరిహద్దులో పాక్‌ అధికారులు అడ్డుకున్నారు. పాకిస్థాన్‌లోని రావల్‌కోట్‌, భారత్‌లోని పూంచ్‌ మధ్య నడిచే ఈ బస్సును ఆపడంతో ఇక్కడి ప్రయాణికులు వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో నియంత్రణా రేఖకు అవతల నివసిస్తున్న తమ బంధువుల్ని కలుసుకునే అవకాశం లేదని కశ్మీరీ ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. చేసేది లేక అక్కడి నుంచి వెనుదిరిగారు.

భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌ ఉగ్రవాద శిబిరంపై చేసిన దాడుల్లో జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్‌ గాయపడ్డాడని, అనంతరం మరణించాడని వార్తలు వచ్చాయి. అయితే మసూద్ సజీవంగానే ఉన్నాడని అతడి కుటుంబ సభ్యులు వెల్లడించినట్లు పాక్‌ మీడియా తెలిపింది. పాకిస్థాన్ ఆర్మీ అతడిని రావల్పిండిలోని మిలిటరీ ఆసుపత్రి నుంచి బహవల్పూర్‌ ప్రాంతంలోని గోత్ గన్నీలోని జైషే శిబిరానికి తరలించినట్లు మీడియాకు వెల్లడించినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే అతడ్ని తరలించిన వెంటనే ఇమ్రాన్‌ ఖాన్ ప్రభుత్వం మీద జైషే విమర్శలు చేసినట్లు సమాచారం. భారత్ నుంచి, అంతర్జాతీయంగా వస్తోన్న ఒత్తిడికి ఇమ్రాన్‌ తలొగ్గుతున్నారని తన ప్రకటనలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com