ఇరాన్:చమురు దిగుమతులపై మినహాయింపులిచ్చేది లేదు

- April 22, 2019 , by Maagulf
ఇరాన్:చమురు దిగుమతులపై మినహాయింపులిచ్చేది లేదు

అమెరికా ఆంక్షల సెగ తగలకుండ ఇరాన్ చమురు దిగుమతి చేసుకొనేందుకు ఎనిమిది దేశాలకు ఇచ్చిన అన్ని మినహాయింపులు తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ ఆయిల్ మార్కెట్ కి తగినంత చమురు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని శ్వేత సౌధం హామీ ఇచ్చింది. ఈ నిర్ణయంపై వివరణ ఇస్తూ అమెరికా స్టేట్ సెక్రటరీ మైక్ పోంపో సోమవారం ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. 'అమెరికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్..మా ఇతర మిత్రులు, భాగస్వాములు ప్రపంచ చమురు మార్కెట్లకు తగినంత సరఫరాలు ఉండేలా చూడటానికి కట్టుబడి ఉన్నామని' వైట్ హౌస్ తన ప్రకటనలో తెలిపింది.
మినహాయింపులు ముగుస్తాయని ఆదివారం వచ్చిన వార్తలతో చమురు ధరలు ఎగసిపడ్డాయి. అదే ఒరవడి సోమవారం కూడా కొనసాగింది. అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ 2.6 శాతం పెరిగి బ్యారెల్ ధర 73.87 డాలర్లకి చేరింది. అమెరికా క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 2.4 శాతం లాభపడి బ్యారెల్ ధర 65.52 డాలర్లు పలికింది. దాదాపు ఆర్నెల్ల తర్వాత ఇంత గరిష్ఠ స్థాయిని తాకడం ఇదే ప్రథమం.

2015లో ఇరాన్, ఆరు ప్రపంచ శక్తుల మధ్య కుదిరిన అణు ఒప్పందం నుంచి ట్రంప్ ఏకపక్షంగా వైదొలిగిన తర్వాత ఇరానియన్ చమురు ఎగుమతులపై నవంబర్ లో అమెరికా తిరిగి ఆంక్షలు విధించింది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని కుదించుకోవాలని, పశ్చిమాసియాలో ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం మానుకోవాలిని వాషింగ్టన్ తీవ్ర ఒత్తిడి తెస్తోంది.

ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూనే అమెరికా ఇరాన్ ఆయిల్ కొనుగోళ్లు తగ్గించుకొన్న ఎనిమిది ఆర్థిక వ్యవస్థలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఆయా దేశాలు మరో 6 నెలల పాటు ఎలాంటి ఆంక్షలు ఎదుర్కొనకుండా కొనుగోళ్లు జరపవచ్చని తెలిపింది. ఆ దేశాలు చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, టర్కీ, ఇటలీ, గ్రీస్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com