ఏపీ ఫలితాలపైనే అందరి దృష్టి..

ఏపీ ఫలితాలపైనే అందరి దృష్టి..

ఆంధ్రప్రదేశ్‌లో రేపు జరిగే ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఓట్ల లెక్కింపునపై సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చిన ఎన్నికల సంఘం.. నిన్న మరోసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలను సమీక్షించింది. ఓట్ల లెక్కింపు రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది.

ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ సీట్లతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు తొలి విడతలోనే ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరిగాయి. వీటి ఓట్ల లెక్కింపు కోసం 34 ప్రాంతాల్లో 55 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌లో 25వేల మంది సిబ్బంది పోల్గొననున్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపై సీఈవో ద్వివేది విజయవాడ క్యాంప్‌ కార్యాలయం నుంచి 13 జిల్లాల కలెక్టర్లతో పాటు కమిషనర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై ఆరా తీసి, ఓట్ల లెక్కింపునపై పలు సూచనలు చేశారాయన. ఫారం 17సి విషయంలో ఇప్పటికే జారీచేసిన ఉత్తర్వులు తప్పనిసరిగా అమలు చెయ్యాలన్నారు. పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు కోసం 500 ఓట్లకు ఒక కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈవీఎంలకు మూడు సీల్స్‌ ఉంటాయని , చీటింగ్‌కు అవకాశమే లేదన్నారు ద్వివేది. ఫలితాలు తొందరగా ఇవ్వడం కాదని, కరెక్ట్‌గా ఇవ్వడమే లక్ష్యమని చెప్పారు. మధ్యాహ్నం 2 కల్లా ఈవీఎంల కౌటింగ్‌ పూర్తవుతుందని తెలిపారు. టేబుళ్లు, ఓట్లను బట్టి ఫలితం వెలువడతాయని అన్నారు ద్వివేది

మరోవైపు ఏపీలో కౌంటింగ్‌ ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు వినోద్ జుటీషి. ఓట్ల లెక్కింపులో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పరిణితి తో వ్యహరించాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు తో బుధవారం జిల్లా ఎన్నికల అధికారులు ఒక సమావేశం నిర్వహించాలని సూచించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు తూచా తప్పకుండా అమలు చేయాలని జుటేషి స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రాల్లో కి సరిఅయిన గుర్తింపు కలిగి ఉన్నవారిని అనుమతించాలన్నారు.

మరో వైపు కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌. ప్రతి కౌటింగ్‌ కేంద్రం వద్ద నాలుగంచెల భద్రత ఉంటుందని చెప్పారాయన. మెుదటి దశలో సెంట్రల్ పార్లమెంటరీ ఫోర్స్, రెండోదశలో ఏపీఎస్పీ పోలీసులు, మూడో దశలో జిల్లా పోలీసులు, నాలుగో దశలో పెట్రోలింగ్ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇక జిల్లాల విషయానికి వస్తే, ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ఒంగోలులోని రైస్‌, పేస్ ఇంజనీరింగ్ కాలేజీల్లో నిర్వహించనున్నారు. ఒంగోలు పార్లమెంట్ నియోజవకవర్గ పరిధిలోని ఒంగోలు, కొండపి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండపాలెం, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలోని కందుకూరు నియోజకవర్గం మొత్తం 8 స్థానాల లెక్కింపు రైస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో, బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పేస్ ఇంజనీరింగ్‌ కాలేజీలో నిర్వహించనున్నారు.

గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్సిటీలో 2, లయోలా పబ్లిక్ స్కూల్‌ లో ఒక కేంద్రంలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. అనంతపురం లోక్‌సభస్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌటింగ్‌ JNTU లో, హిందూపురం పార్లమెంట్‌ నియోజక వర్గ పధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఎస్కే యూనివర్సిటీలో జరగనుంది.

కడప శివారులో కేఎల్‌ఎం ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని రెండు బ్లాక్ ల్లో కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 26 గదుల్లో 314 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కడప పార్లమెంట్‌కు సంబంధించి కమలాపురం, ప్రొద్దుటూరు మినహా మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే చోట కౌంటింగ్ జరగనుంది. రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మాత్రం కడపలో జరగనుంది. రాజంపేట ఎంపీ సీటు ఫలితాన్ని చిత్తూరులోనే ప్రకటిస్తారని చెప్పారు కలెక్టర్ హరికిరణ్.

విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ సీట్ల ఓట్ల లెక్కింపు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలోనే నిర్వహిస్తున్నారు. మొత్తం 33 గదుల్లో 14 టేబుల్ల పైనా కౌంటింగ్‌ చేస్తారు. అరకు ఎంపీ ఫలితం ఎక్కువ సమయం తీసుకునే అవకాశముందని చెప్పారు కలెక్టర్ భాస్కర్. : కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. విజయోత్సర ర్యాలీపై నిషేధం విధించారు.

Back to Top