ఇస్రో ఖాతాలో మరో విజయం

- May 22, 2019 , by Maagulf
ఇస్రో ఖాతాలో మరో విజయం

అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. చేపట్టిన ప్రతి ప్రయోగాన్ని దాదాపు విజయవంతం చేస్తున్న ఇస్రో, తాజాగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సతీష్ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన PSLV-C46 ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఈ ప్రయోగం జరిగింది. నిర్దేశిత కౌంట్‌డౌన్ పూర్తి కాగానే షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి PSLV-C46 నిప్పులు చిమ్ముకుంటూ నింగి లోకి దూసుకెళ్లింది. అన్ని దశలను సక్సెస్‌ఫుల్‌గా అధిగమించిన రాకెట్, రీశాట్-2B1 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశ పెట్టింది.

44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగ సమయంలో 290 టన్నుల బరువుతో ప్రయాణం ప్రారంభించింది. మొత్తం 15.29 నిమిషాల్లో ప్రయాణం పూర్తి చేసి 615 బరువు కలిగిన రిశాట్‌–2బీ‌1 ఉపగ్రహాన్ని భూమికి 557 కిలోమీటర్ల ఎత్తులో సూర్యానువర్తన కక్షలో ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.పీఎస్‌ఎల్వీ ద్వారా ఇప్పటి వరకు 353 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టామని ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు. చారిత్రక చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని జులై 9-16 మధ్య చేపట్టనున్నామని వెల్లడించారు.

రీశాట్‌-2B‌1.. అత్యంత ఆధునిక రాడార్‌ ఇమేజింగ్‌ భూపరిశీలన ఉపగ్రహం. ఇది రక్షణశాఖకు కీలకంగా మారనుంది. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఈజీగా గుర్తించడానికి ఈ శాటిలైట్ ఉపయోగపడనుంది. ముఖ్యంగా ఉగ్రవాదుల పాలిట రిశాట్-2B1 సింహ స్వప్నం కానుంది. ఉగ్రవాదుల ఆచూకీ, ఉగ్రస్థావరాలను గుర్తించి రక్షణశాఖకు అందించనుంది.
రిశాట్-2B1 ఐదేళ్ల పాటు అంతరిక్షంలో సేవలందించనుంది. రక్షణశాఖతో పాటు వ్యవసాయం, అటవీ రంగాలకు కీలక సమాచారం అందించనుంది. ఇస్రో మొదట 2009లో రీశాట్‌ను ప్రయోగించింది. 2012లో రీశాట్‌-1ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఇప్పుడు రిశాట్-2B1ను కూడా సక్సెస్‌ఫుల్‌గా అంతరిక్షంలో ప్రవేశపెట్టి తనకు తిరుగులేదని నిరూపించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com