లిబ్రా కరెన్సీ: ఫేస్బుక్, వాట్సాప్‌లో డబ్బు దాచుకోవచ్చు, చెల్లింపులు చేయొచ్చు
- June 19, 2019
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 2020లో 'లిబ్రా' పేరుతో సరికొత్త డిజిటల్ కరెన్సీని ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ దిశగా తన ప్రణాళికను విడుదల చేసింది. వాట్సాప్, ఇతర ఫేస్బుక్ అప్లికేషన్ల ద్వారా వినియోగదారులు నగదు చెల్లింపులు చేయవచ్చని తెలిపింది. భవిష్యత్తులో ఉబర్, వీసా సంస్థలు కూడా ఈ సరికొత్త లిబ్రా కరెన్సీని అంగీకరించవచ్చని ఫేస్బుక్ తెలిపింది. కానీ, వినియోగదారుల నగదు, వ్యక్తిగత సమాచారం ఏమేరకు సురక్షితం అన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అయితే, లిబ్రా డిజిటల్ కరెన్సీ.. స్వీయ నిర్వహణతోపాటు, స్థిరాస్తులను కూడా కలిగి ఉంటుందని ఫేస్బుక్ తెలిపింది. నగదు చెల్లింపుల రంగంలో గూగుల్ పే, ఆపిల్ పే, శాంసంగ్ పే ద్వారా ఇప్పటికే చెల్లింపులు జరుగుతున్నా, ఇవేవీ క్రిప్టో కరెన్సీ ఆధారిత సేవలు కావు.
ఫేస్బుక్ వినియోగదారులకు లాభం ఉంటుందా?
వచ్చే ఏడాది నుంచి ఫేస్బుక్ వేదికల ద్వారా లిబ్రాను కొనుగోలు చేసి, 'క్యాలిబ్రా' అనే డిజిటల్ వాలెట్లో నిల్వ చేసుకోవచ్చని, ఆ తర్వాత .. ఒక టెక్స్ట్ మెసేజ్ పంపేంత సులువుగా, వేగంగా ఇతరులకు లిబ్రా కరెన్సీని పంపవచ్చని ఫేస్బుక్ తెలిపింది. ఫేస్బుక్ వేదికల ద్వారా చేసే నగదు చెల్లింపులకు నామమాత్రంగా మాత్రమే కమీషన్ వసూలు చేస్తామని ఆ సంస్థ పేర్కొంది.
''ఫేస్బుక్ తలపెట్టిన ఈ గ్లోబల్ కరెన్సీ ప్రాజెక్ట్ చిన్నవిషయం కాదు. కొందరు దీన్ని ఓ మహత్కార్యం అని కూడా భావించొచ్చు. ఇదేదో ఫేస్బుక్ ప్రధాన కార్యాలయం 'మెన్లో పార్క్'లో ఒక చిన్న బృందం కూర్చుని, ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు కాస్త కసరత్తు చేస్తే పని జరిగిపోదు. ఫేస్బుక్ సంస్థ, కరెన్సీ రెండింటి భవిష్యత్తు ఈ ప్రాజెక్ట్! ఇప్పటికే ఈ రంగంలో పేపాల్-వీసా, ఉబర్-లిఫ్ట్ లాంటి దిగ్గజ భాగస్వామ్యాలు ఉన్నాయి. కానీ ఫేస్కాయిన్ లేదా లిబ్రా గురించి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి'' అని బీబీసీ సాంకేతికరంగ ప్రతినిధి రోరీ సెల్లన్-జోన్స్ అభిప్రాయపడుతున్నారు.
లిబ్రాను ఎవరు అంగీకరిస్తారు?
లిబ్రా నిర్వహణ బాధ్యతను కొన్ని కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి చూస్తాయి. వీటిలో ఫేస్బుక్ కూడా ఒకటి. ఈ సంస్థల సమూహాన్ని 'లిబ్రా అసోసియేషన్' అని పిలుస్తారు. ఇప్పటికే ఈ అసోసియేషన్‌లో భాగస్వాములైన ఈ కింది సంస్థలు లిబ్రా కరెన్సీని ఆమోదిస్తాయని ఫేస్బుక్ తెలిపింది.
మాస్టర్ కార్డ్, పేపాల్ లాంటి నగదు చెల్లింపు సంస్థలు ఇ-బే, స్పాటిఫై, ఉబర్ లాంటి డిజిటల్ వ్యాపారాలు వోడాఫోన్ లాంటి టెలికం సంస్థలు మైక్రోఫైనాన్స్, మహిళల ప్రపంచ బ్యాంకు లాంటి స్వచ్ఛంద సంస్థలు
ఫేస్బుక్ ఈ ప్రాజెక్టును ఎందుకు చేపట్టింది?
ప్రపంచవ్యాప్తంగా బ్యాంకు ఖాతాలు లేని 170 కోట్లమంది లక్ష్యంగా లిబ్రాను ప్రారంభిస్తున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. లిబ్రా అన్నది గ్లోబల్ కరెన్సీ అని, లిబ్రాను వాడే యాప్స్, సర్వీసులు మార్కెట్లోని నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని ఫేస్బుక్ చెబుతోంది. ఇప్పటికే అమెరికాలో లిబ్రాను ప్రారంభించడానికి అనుమతి లభించింది కానీ, భారత్ విషయంలో ఇంకా స్పష్టత లేదు. అయితే, లిబ్రా ప్రారంభమయ్యే సమయానికి కేవలం 12 మార్కెట్లు మాత్రమే ఆ కరెన్సీని ఆమోదించడానికి సిద్ధంగా ఉంటాయని మే నెలలో కొన్ని నివేదికలు తెలిపాయి.
ఆందోళన కలిగిస్తున్న అంశాలు ఏవి?
'ఈ కరెన్సీ ఎలా పనిచేస్తుంది, వినియోగదారులు, వారి డేటా విషయంలో ఎలాంటి భద్రత అందిస్తారు' అని, అమెరికా రాజకీయనాయకులు ఫేస్‌బుక్‌ను ప్రశ్నించారు. బిట్‌కాయిన్ లాంటి వర్చువల్ కరెన్సీ ధరల విషయంలో భారీగా ఒడిదొడుకులు ఎదుర్కొంది. బిట్‌కాయిన్ ద్వారా అక్రమ మార్గాల్లో డబ్బును తరలించారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచడంలో విఫలమైనందుకు ఫేస్‌బుక్‌పై పలు విమర్శలు కూడా ఉన్నాయి.
లిబ్రా ధర పతనమవ్వకుండా కాపాడేందుకు దీని ధరను పౌండ్, డాలర్, జపనీస్ కరెన్సీ యెన్, యూరో మారకవిలువల (బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్)తో ఫేస్బుక్ నిర్ణయించింది. క్యాలిబ్రా చెల్లింపు విధానానికి పటిష్టమైన భద్రత కల్పించామని, క్యాలిబ్రాలో డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా భద్రపరచుకోవచ్చని ఫేస్బుక్ తెలిపింది.
బ్యాంకులు, క్రెడిట్ కార్డులు వినియోగించే వెరిఫికేషన్, యాంటీ ఫ్రాడ్ విధానమే క్యాలిబ్రాలో కూడా వాడామని, ఒకవేళ ఎవరి డబ్బైనా దొంగతనానికి గురైతే ఆ సొమ్మును తిరిగి చెల్లిస్తామని ఫేస్బుక్ పేర్కొంది.
ఫేస్‌బుక్‌కు ఇది మొదటిసారి కాదు
డిజిటల్ కరెన్సీ రంగంలో అడుగుపెట్టడం ఫేస్‌బుక్‌కు ఇది మొదటిసారి కాదు. పదేళ్ల క్రితం 'ఫేస్బుక్ క్రెడిట్స్'ను రూపొందించింది. ఈ వర్చువల్ కరెన్సీ ద్వారా వినియోగదారులు వస్తువులు కొనేవారు. కానీ రెండేళ్లకే ఈ ప్రాజెక్టును నిలిపేసింది. అయితే, వినియోగదారులు ఫేస్‌బుక్‌ను నమ్మి, తమ డబ్బును లిబ్రా కరెన్సీ రూపంలోకి మార్చుకుంటారా అన్నది పెద్ద ప్రశ్న.
వినియోగదారుల్లో విశ్వాసం పెంపొందించడం కోసం ఫేస్బుక్.. వివిధ దేశాల ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు, అమెరికా ట్రెజరీ అధికారులు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌తో సంప్రదింపులు జరుపుతోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!