కుమారస్వామి సర్కారు బలపరీక్షకు గవర్నర్‌ డెడ్‌లైన్‌ !

కుమారస్వామి సర్కారు బలపరీక్షకు గవర్నర్‌ డెడ్‌లైన్‌ !

కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి బలపరీక్ష అనేక మలుపులు తిరుగుతోంది. సభలో స్పీకర్ అధికారలకే ప్రాధాన్యం ఉండటం, గవర్నర్ జోక్యం చేసుకోవడంతో సభలో వివాదం చెలరేగింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపణలు-ప్రత్యారోపణలతో చెలరేగిపోయారు. ఇరు పార్టీల విమర్శలతో స్పీకర్ కూడా అసహనానికి గురయ్యారు. గవర్నర్, అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య తాను నలిగిపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు స్పీకర్. అధికార, ప్రతిపక్షాలు స్పష్టత లేని అంశాలను ప్రస్తావించి అసెంబ్లీలో రగడ సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. మరోవైపు.. తాజా ఇష్యూపై.. అడ్వకేట్‌ జనరల్‌తోనూ చర్చలు జరిపారు స్పీకర్‌. మరోవైపు. కర్ణాటక సంక్షోభంలో గవర్నర్‌ పాత్ర కీలకంగా మారింది. బలపరీక్ష జరగకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని గ్రహించిన బీజేపీ నేతలు.. సీన్‌లోకి గవర్నర్‌ను ఎంటర్‌ చేయించింది. మాజీ సీఎం జగదీష్ షెట్టార్ నేతృ త్వంలో గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు.. అసెంబ్లీలో తాజా పరిణామాలను వివరించారు. బల పరీక్ష గురువారమే నిర్వహించేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరారు. స్పందించిన గవర్నర్, విశ్వాస పరీక్ష పూర్తి చేయాలని స్పీకర్ కు లేఖ రాశారు. ఈ లేఖను స్పీకర్ సభలో చదివి వినిపించారు. దీనిపై తీవ్రంగా స్పందించింది కాంగ్రెస్‌. స్పీకర్‌ను గవర్నర్ ఎలా డిక్టేట్ చేస్తారని ప్రశ్నించారు.

అయితే స్పీకర్‌ దీనిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో.. ఏకంగా ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు గవర్నర్‌. బలం నిరూపించుకోవాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించారు. శుక్రవారం మధ్యాహం ఒకటిన్నర లోపు శాసనసభలో బలం నిరూపించుకోవాలని ఆ లేఖలో స్పష్టం గా పేర్కొన్నారు. సీఎంకు గవర్నర్ లేఖ రాయడం కర్ణాటకలో తీవ్ర ప్రకంపనలు రేపింది. స్వయంగా గవర్నర్ ఆదేశించడంతో ముఖ్యమంత్రి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అటు సుప్రీం కోర్టులో ఉన్న ఈ ఇష్యూపై. ఇప్పటికీ క్లారిటీ లేదు. సుప్రీం తీర్పు ఆధారంగానే కుమారస్వామి సర్కారు భవితవ్యం ఆధారపడి ఉంది. విశ్వాసపరీక్షపై చర్చలో కొత్త వాదన తెరపైకి తెచ్చారు సిద్దరామయ్య. రెబల్ ఎమ్మెల్యేలు 15 మంది సభకు రావాల్సిందేనన్నారాయన. ఎమ్మెల్యేలకు తాను ఎందుకు విప్ జారీ చేయకూడదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు విప్ అంశంపై సుప్రీం కేసులో ఇంప్లీడ్ అవుతానన్నారు సిద్దరామయ్య. సుప్రీంలో కేసు తేలే వరకూ ఓటింగ్ వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు సిద్ధరామయ్య. ఇవాళ ఈ అంశం సుప్రీం కోర్టు చెంతకు వెళ్లనుంది. దీంతో కర్నాటకం మరింత రసకందాయంలో పడనుంది.

మరోవైపు గురువారం సభకు మొత్తం 205 మంది సభ్యులు హాజరయ్యారు. వీరిలో కాంగ్రెస్‌నుంచి 66 మంది జేడీఎస్ నుంచి 34 మంది ఉన్నారు. బీజేపీ సభ్యులు 105 మంది కూడా విశ్వాస పరీక్షపై చర్చలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌కి రాజీనామా చేసిన 15 మంది ఓటింగ్‌కి దూరంగానే ఉంటున్నారు. వీరిలో 12 మంది కాంగ్రెస్ వాళ్లు కాగా, ముగ్గురు జేడీఎస్‌కు ఎమ్మెల్యేలున్నారు. కేజేపీ ఎమ్మెల్యేతోపాటు స్వతంత్ర అభ్యర్థి సైతం ఓటింగ్‌కి దూరంగా ఉంటున్నారు. ఈ లెక్కన చూస్తే.. మొత్తం సభకు 20 మంది గైర్హాజరు అయినట్టు లెక్క. ఆంగ్లోఇండియన్‌తో కలిపి 225 మంది ఉండాల్సిన సభలో 20 మంది గైర్హాజరుతో నంబర్‌ 205కి తగ్గింది. అప్పుడు మ్యాజిక్‌ ఫిగర్ 103 దగ్గరే అగుతుంది. స్పీకర్ లేకుండా కాంగ్రెస్‌, జేడీఎస్‌ బలం ప్రస్తుతం 99గా ఉంది. బీజేపీ సభ్యుల బలం 105 ఉంది.

Back to Top