కువైట్ ప్రభుత్వం వలసదారులపై వివక్ష చూపబోం

- January 08, 2016 , by Maagulf
కువైట్ ప్రభుత్వం వలసదారులపై వివక్ష చూపబోం

ఇంధనం ధరలకు ఒకే విధానాన్ని అమలు చేస్తామని, కువైటీలు, వలసదారులు అనే తేడాలేమీ చూపబోమని కువైట్ ప్రభుత్వం స్పష్టం చేసింది. సబ్సిడీల విధానంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రకటించింది. కువైట్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఖలీఫా హమదా మాట్లాడుతూ అంతర్జాతీయ ఆర్థిక సలహాదారు ఎర్నస్ట్ అండ్ యంగ్ సబ్సిడీల విషయంలో చేసిన సిఫారసులను ఆర్థిక మంత్రిత్వ శాఖ, సబ్సిడీల కమిటీలు అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. అధ్యయనం చేసి సిఫారసులను కేబినెట్‌కు సమర్పించడాన్ని నిర్ణయం జరిగిపోయినట్లుగా భావించరాదన్నారు. జనవరి ప్రారంభంలో ఉన్న ధరల ఆధారంగా ఈ సిఫారసులు వచ్చాయన్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయం వేరుగా ఉండవచ్చునన్నారు. ఇంధనానికి మొత్తం సబ్సిడీల్లో 70 శాతం పోతోందని అధ్యయనంలో తేలినట్లు హమద్ చెప్పారు. పెట్రోలు, ఎలక్ట్రిసిటీ ధరలను ప్రధానంగా పరిశీలిస్తున్నామని, అయితే కేబినెట్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కువైట్‌లోని 85 శాతం వాహనాలు 95 ఆక్టేన్ స్పెషల్ పెట్రోలును వినియోగిస్తున్నాయన్నారు. స్థానికంగా ఉత్పత్తి అవుతున్న స్పెషల్ పెట్రోలు సరిపోకపోవడంతో ఎక్కువ ధర చెల్లించి దిగుమతి చేసుకుంటున్నట్లు వివరించారు. వీటి ధరల విషయంలో కువైటీలకు, వలసదారులకు మధ్య వివక్ష చూపుతూ ద్వంద్వ ధరల విధానాన్ని అమలు చేయబోతున్నట్లు వస్తున్న వదంతులను తోసిపుచ్చారు. అందరికీ ఒకే విధానం అమలు చేస్తామన్నారు. విద్యుత్తు వినియోగం ఆధారంగా ఛార్జీలు నిర్ణయిస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com