చైనా - అమెరికా వాణిజ్యపోరుపై ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

చైనా - అమెరికా వాణిజ్యపోరుపై ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: 'మాకింక చైనా అవసరం లేదు. నిజం చెప్పాలంటే వారి (చైనా) ప్రమేయం లేకుండానే మేం మెరుగైన ప్రగతి సాధించగలం చైనాకు ప్రత్యామ్నాయాన్ని అన్వేషించాలని మా దేశ కంపెనీలను ఆదేశించాం. ప్రత్యామ్నాయం లభించకపోతే వెనక్కి వచ్చి మన దేశం నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని సూచిస్తున్నాం...!' చైనాతో వాణిజ్య పోరు నానాటికీ ఉధృతమవుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో చేసిన తాజా వివాదాస్పద వ్యాఖ్యలివి. చైనాకు చెందిన హువై సంస్థతో కూడా తామెటువంటి వాణిజ్య కార్యకలా పాలూ కొనసాగించబోమని ఆయన మరో ట్వీట్‌లో స్పష్టం చేశారు. తమ దేశానికి చెందిన ఫెడెక్స్‌, అమెజాన్‌, యూపీఎస్‌, పోస్టాఫీస్‌ వంటి అన్ని సంస్థలనూ చైనా నుంచి వెనక్కి తిరిగి వచ్చేయాలని ఆదేశిస్తున్నా నని ట్రంప్‌ తన ట్వీట్‌లో వెల్లడించారు. గత రెండున్నరేండ్లుగా తమ ఆర్థిక వ్యవస్థ అద్భుత స్థాయిలో మెరుగుపడిందనీ, చైనా కన్నా మెరుగైన దశలో వుందని, ఇదే పరిస్థితిని తాము కొనసాగిస్తామని ఆయన తన ట్వీట్‌లో వివరించారు. చైనాతో ట్రంప్‌ కొనసాగిస్తున్న వాణిజ్య పోరు మరింత దిగజారే అవకాశాలున్న సూచనలు కన్పిస్తుండటంతో అమెరికా స్టాక్‌ మార్కెట్‌ ప్రధాన సూచీలు నాస్‌డాక్‌ (కంపోజిట్‌), డౌజోన్స్‌ ఇండిస్టియల్‌ (డీజేఐ) యావరేజ్‌, ఎస్‌అండ్‌పీ 500 సూచీలు శుక్రవారం కనిష్ట స్థాయిలో ట్రేడింగ్‌ను ముగించాయి.

Back to Top