25 జిల్లాలతో నవ్యాంధ్ర.!

- September 13, 2019 , by Maagulf
25 జిల్లాలతో నవ్యాంధ్ర.!

13 జిల్లాల నవ్యాంధ్ర 25 జిల్లాలతో రూపాంతరం చెందనుంది. 25 లోక్‌సభ స్థానాలే ప్రాతిపదికగా జిల్లాలను పునర్వ్య వస్థీకరించే దిశగా పెద్ద కసరత్తే జరుగుతోంది. ముందుగా రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్విభజించాక.. గ్రామాల హద్దులు కూడా ఖరారుచేస్తే.. జిల్లాల పునర్విభజన సులువవుతుందని రెవెన్యూ శాఖ భావిస్తోంది.
రెవెన్యూ శాఖ కసరత్తు వేగవంతం
డివిజన్లు, మండలాలూ పునర్విభజన!
గ్రామాలకు కూడా సహేతుక హద్దులు
ఉన్న13 జిల్లాలకు అదనంగా మరో 12
లోక్‌సభ స్థానాలే ప్రాతిపదికగా ఏర్పాటు
పరిశీలనలో ప్రత్యేక గిరిజన జిల్లా
తూర్పు, గుంటూరులో మూడేసి జిల్లాలు
మారనున్న విజయవాడ నగర స్వరూపం
నియోజకవర్గాల పునర్విభజనతో
ముడిపడిన విస్తృత కసరత్తు
అమరావతి : రాష్ట్రంలో జిల్లాల స్వరూపం సంపూర్ణంగా మారిపోనుంది. పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పుడున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని.. మొత్తం 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు లోక్‌సభ నియోజకవర్గాలే ప్రాతిపదిక అయినప్పటికీ.. అందుకు భారీగా కసరత్తు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇప్పుడున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించడం ఒక్కటే కాదు.. కొత్తగా డివిజన్లు, మండలాలను విభజించి.. తర్వాత గ్రామాల మధ్య సహేతుకమైన సరిహద్దులు ఖరారుచేయాల్సి ఉంది. అనంతరం కొత్తగా 12 జిల్లాలకు రూపురేఖలిచ్చే అవకాశముంది. ఇందులో ఒకటి గిరిజన జిల్లా కూడా ఉంటుందని అంటున్నారు. అయితే ఎస్టీ లోక్‌సభ స్థానమైన అరకునే గిరిజన జిల్లాగా ప్రకటిస్తారా..? లేక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఏజెన్సీలోని షెడ్యూల్డ్‌ ప్రాంతాలను కలిపి జిల్లాగా ప్రకటిస్తారా అన్న విషయమై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి లోక్‌సభ స్థానాన్ని ఓ జిల్లాగా ప్రకటిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన దరిమిలా.. ఇందుకు అవసరమైన కసరత్తును తాజాగా మళ్లీ చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే కొంత కసరత్తు జరిగినా.. తర్వాత దానిని ఆపారు. ఇప్పుడు మళ్లీ ఈ విషయంలో వేగం పెంచారు. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు కొత్త జిల్లాల ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి సమాచారమిచ్చారు.
పునర్వ్యవస్థీకరణ కసరత్తు పెద్దదే : జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రత్యేక చట్టం కూడా ఉంది. దీని పరిధిలో చేపట్టాలంటే ముందు మండలాలు, రెవెన్యూ డివిజన్‌లను పునర్‌వ్యవస్ధీకరించాలి. కొత్తగా రెవెన్యూ డివిజన్‌లను పునర్‌వ్యవస్ఖీకరించాలని అధికారులు ఇదివరకే ప్రతిపాదించి ఉన్నారు. దీంతో కొత్తగా మరో 8 డివిజన్‌లు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో భాగంగా గ్రామీణ, నగర మండలాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాల్సి ఉంది. ఫలితంగా కొత్తగా 20కి పైగా కొత్త మండలాలు వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పునర్విభజన పూర్తయ్యాక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో జిల్లాలను విభజిస్తారు. భౌగోళికంగా చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలు పెద్దవిగా ఉన్నాయి. ఇప్పుడున్న అంచనాల ప్రకారం లోక్‌సభ స్థానాలు కేంద్రంగా విభజన చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం పెద్ద జిల్లాగా ఉన్న తూర్పుగోదావరిని విభజించి మూడు జిల్లాలుగా చేయాల్సి ఉంటుంది. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి జిల్లాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. తూర్పుగోదావరి పేరిట జిల్లాను కొనసాగించాల్సి వస్తే దాని పరిపాలనా కేంద్రంగా ఉన్న కాకినాడపై విభజన ప్రభావం ఉండకపోవ చ్చు. అమలాపురం, రాజమండ్రిలను కొత్త జిల్లాలుగా ప్రకటించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిపాలన కేంద్రం ఏలూరు. ఈ జిల్లా నుంచి నరసాపురాన్ని వేరుచేసి కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. అంటే ఉభయ గోదావరి జిల్లాలను విభజించి కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేసే అవకాశమూ ఉంది. లోక్‌సభ స్థానంగా ఉన్న మచిలీపట్నం కృష్ణా జిల్లాకు పరిపాలనా కేంద్రంగా ఉంది. అయితే అధికారుల సేవలన్నీ విజయవాడ కేంద్రంగానే కొనసాగుతున్నాయి.  ఇప్పుడు విజయవాడ లోక్‌సభ పరిధిని కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా అనే పేరు కొనసాగుతుందా? దానిని ఏ లోక్‌సభ పరిధికి వర్తింపచేస్తారన్న చర్చ మొదలైంది. భౌగోళికంగా పెద్దగా ఉన్న గుంటూరు జిల్లాను విభజించి కొత్తగా మరో రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తారు. అందులో ఒకటి నరసరావుపేట. రెండోది బాపట్ల. అయితే బాపట్ల విషయంలో పాలనా కేంద్రం ఎక్కడ అన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలకు, పాలనా కేంద్రానికి మధ్య ప్రయాణదూరం చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి నంద్యాల, అనంతపురం నుంచి హిందూపురాన్ని విభజించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారు. కడప జిల్లాలో రాజంపేట ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. దీనికి చిత్తూరులోని కొన్ని ప్రాంతాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశముంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిని కూడా కొత్త జిల్లాగా మారుస్తారు. దీనివల్ల తిరుపతి పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ఊరట కలుగుతుందని అంటున్నారు. రేణిగుంట, శ్రీకాళహస్తితోపాటు పలు ప్రాంతాలు ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి.

మండలాలతో కొత్త చిక్కులు : ఒకే మండలం రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉంటే..? ఒకటే మండలం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వస్తే ఏం చేయాలి..? ఆ మండలాన్ని ఏ జిల్లాలో కలపాలి..? కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న రెవెన్యూ శాఖకు ఎదురవుతున్న ప్రశ్నలివి. దీనిపై స్పష్టత ఇవ్వాలని త్వరలో ప్రభుత్వాన్ని కోరనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు చట్టప్రకారం కొన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలి. రెవెన్యూ డివిజన్లు, మండలాలు.. వాటి భౌగోళిక విస్తీర్ణం, జనాభా ఆధారంగా ఏర్పాటు ప్రక్రియ కొనసాగాలి. దీనికి భిన్నంగా లోక్‌సభ నియోజకవర్గాన్నే ప్రామాణికంగా తీసుకుంటే కొత్త ఇబ్బందులు వెలుగుచూస్తున్నాయి. అవేంటంటే.. ఒకే మండలం రెండు లోక్‌సభ పరిధిలో ఉండడం, ఒకే మండలం రెండు, అంతకన్నా ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగుతుండడాన్ని అధికారులు గుర్తించారు. దీనిని సరిచేశాకే కొత్త జిల్లాల ఏర్పాటుపై ముందుకు సాగాలని భావిస్తున్నారు.

లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోకి వస్తున్న మండలాలు : 1. అనంతపురం మండలం. అనంతపురం రెవెన్యూ డివిజన్‌లో ఉంది. అనంతపురం అర్బన్‌, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిసి ఉంది. అదే సమయంలో అనంతపురం, హిందూపురం లోక్‌సభ స్థానాల్లోనూ విస్తరించి ఉంది. అనంతపురం లోక్‌సభ పరిధిలో ఐదు, హిందూపురం పరిధిలో 15 గ్రామాలున్నాయి. 2. తిరుపతి అర్బన్‌ మండలం: తిరుపతి, చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంది. లోక్‌సభ విషయానికి వస్తే తిరుపతిలో 5, చిత్తూరులో 2 గ్రామాలు ఉన్నాయి. 3. విజయవాడ గ్రామీణం: ఇది మైలవరం, గన్నవరం అసెంబ్లీ నియోజకవ ర్గాల పరిధిలోకి వస్తోంది. విజయవాడ లోక్‌సభ పరిధిలో 8, మచిలీపట్నం పరిధిలో 10 గ్రామాలున్నాయి. త్వరలో గ్రేటర్‌ విజయవాడ కార్యరూపం దాల్చనుంది. రామవరప్పాడును కూడా ఇందులో కలపనున్నారు. అయితే రామవరప్పాడు గన్నవరం అసెంబ్లీ పరిధిలో, మచిలీపట్నం లోక్‌సభ పరిధిలో ఉంది. జిల్లాల విభజనతో విజయవాడ నగరం రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంది. దీన్ని ఎలా విభజించాలన్న సమస్య ఎదురవుతోంది. డీలిమిటేషన్‌తో ముడిపడిన అంశం కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు.
4. పెదగంట్యాడ మండలం: విశాఖలో ని గాజువాక, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిసి ఉంది. విశాఖ లోక్‌సభ పరిధిలో 1, అనకాపల్లి లోక్‌సభ పరిధిలో 3 ఊళ్లున్నాయి. 5. జామి మండలం: విజయన గరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి వస్తుంది. గ జపతినగరం, శృంగవరపు కోట నియోజకవర్గాల్లో ఉంది. విజయనగరం లోక్‌సభ పరిధిలో 12, విశాఖపట్నం లోక్‌సభ పరిధిలో 16 గ్రామాలున్నాయి.

ప్రస్తుత జిల్లాలు : 1. శ్రీకాకుళం 2. విజయనగరం3. విశాఖపట్నం 4. తూర్పుగోదావరి 5. పశ్చిమగోదావరి 6. కృష్ణా7. గుంటూరు 8. ప్రకాశం; 9. నెల్లూరు 10. కడప 11. కర్నూలు 12. అనంతపురం 13. చిత్తూరు.

పరిశీలిస్తున్న కొత్త జిల్లాలు ఇవే : 1. అనకాపల్లి (విశాఖ); 2. అరకు (విశాఖ); 3. అమలాపురం (తూ.గో); 4. రాజమండ్రి (తూ.గో); 5 నరసాపురం (ప.గో); 6. విజయవాడ (కృష్ణా); 7. . నరసరావుపేట (గుంటూరు); 8. బాపట్ల (గుంటూరు); 9. నంద్యాల (కర్నూలు); 10. హిందూపురం (అనంతపురం); 11. రాజంపేట (కడప); 12. తిరుపతి (చిత్తూరు )

గిరిజన జిల్లా ఎక్కడ : ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటుపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. విశాఖ నుంచి విడదీసి అరకునే గిరిజన జిల్లాగా ప్రకటించాలా? లేక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మధ్య ఉన్న ఏజెన్సీని ప్రత్యేకంగా పార్వతీపురం కేంద్రంగా పరిశీలన చేయాలా అన్నదానిపై సమాలోచనలు జరుగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com