హైదరాబాద్:విజ‌య‌వంతంగా ముగిసిన గ‌ణేష్ నిమ‌జ్జ‌నం

- September 13, 2019 , by Maagulf
హైదరాబాద్:విజ‌య‌వంతంగా ముగిసిన గ‌ణేష్ నిమ‌జ్జ‌నం

హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌ణేష్ నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా ఏవిధ‌మైన అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు లేకుండా నిర్వ‌హించ‌డంలో స‌హ‌క‌రించిన భాగ్య‌న‌గ‌ర్ ఉత్స‌వ సమితి నిర్వాహ‌కులు, వివిధ శాఖ‌ల అధికారుల‌కు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, అడిషనల్ సిపి తరుణ్ జోషి, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మేయ‌ర్ రామ్మోహ‌న్ ఈ క్రింది విష‌యాల‌ను వెల్ల‌డించారు.

 

·        వివిధ విభాగాల స‌మ‌న్వ‌య కృషితో గ‌ణేష్ నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం సాఫీగా విజ‌య‌వంతంగా ముగిసింది.

·        నేడు సాయంత్రం వరకు 55వేల గణేష్ విగ్రహాల నిమజ్జనం విజయవంతంగా కొనసాగింది.

·        హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 32,800, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 12,000, సైబారాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10,116 విగ్రహాల నిమజ్జనం అయ్యాయి.

·        గత సంవత్సరం కన్నా 10వేల విగ్రహాలు పెరిగాయి.

·        ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం నిర్వహించడం ద్వారా మరోసారి హైదరాబాద్ ఘనతను దేశానికి చాటిచెప్పాము.

·        విజ‌య‌వంతంగా నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం ముగియ‌డానికి స‌హ‌క‌రించిన భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులంద‌రికీ ధ‌న్య‌వాదాలు.

·        ఈ సారి కూడా ఖైర‌తాబాద్ భారీ వినాయ‌కుడిని మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌లోపు నిమ‌జ్జ‌నం చేప‌ట్టినందున మొత్తం నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం సాఫీగా జ‌రిగింది. 

·        హైద‌రాబాద్ బాలాపూర్ గ‌ణేష్‌ను రాత్రి 8గంటలలోపే నిమ‌జ్జ‌నం చేయ‌డం విశేషం. 

·        ట్యాంక్‌బండ్‌తో పాటు న‌గ‌రంలోని 23 చెరువుల వ‌ద్ద నిమ‌జ్జ‌నాల‌కు విస్తృత ఏర్పాట్లు చేపట్టాం. 

·        బెంగ‌ళూర్ అనంత‌రం హైద‌రాబాద్ న‌గ‌రంలో నిర్మించిన నిమ‌జ్జ‌న కొల‌నులలో పెద్ద ఎత్తున నిమ‌జ్జ‌నాల‌ను చేప‌ట్టారు. వ‌చ్చే సంవ‌త్స‌రానికి మ‌రికొన్ని కొల‌నుల‌ను నిర్మించ‌డం ద్వారా కాలుష్యాన్ని త‌గ్గిస్తాం.

·        మొత్తం 23 వినాయ‌క నిమ‌జ్జ‌న ప్ర‌త్యేక కొల‌నుల‌లో 30వేలకు పైగా విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం జ‌రిగింది.

·        ఈ ప్ర‌త్యేక నిమ‌జ్జ‌న కొల‌నుల‌ను దుర్గామాత‌, బ‌తుక‌మ్మ నిమ‌జ్జ‌నాల‌కు కూడా ఉప‌యోగిస్తాం. 

·        క్షేత్ర స్థాయిలో గ‌ణేష్ మండ‌పాల నిర్వాహ‌కుల‌తో పోలీసు, జీహెచ్ఎంసి త‌దిత‌ర విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో ఉంటూ త్వ‌రిత‌గ‌తిన శోభ‌యాత్ర‌లో పాల్గొనేలా ప్రోత్స‌హించ‌డంలో విజ‌య‌వంతమ‌య్యారు. 

·        గ‌తంలో ప్ర‌తి గ‌ణేష్ మండ‌పం వ‌ద్ద క‌నీసం ఒక పోలీసును నియ‌మించే ఆన‌వాయితి ఉంది. కానీ ఈ సారి పోలీసుల‌ను నియ‌మించుకుండా క‌మ్యునిటి పోలీసింగ్‌ను చేయ‌డం స‌త్ఫ‌లితాల‌ను ఇచ్చింది.

·        మ‌ట్టి విగ్ర‌హాల‌ను ప్రోత్స‌హించ‌డంలో జీహెచ్ఎంసి, ఇత‌ర శాఖ‌లు చేప‌ట్టిన ప్ర‌చారోద్య‌మం స‌త్ఫ‌లితాల‌ను ఇచ్చింది. ఈ సారి భారీ సంఖ్య‌లో మ‌ట్టి వినాయ‌కుల‌ను నిర్వాహ‌కులు ఏర్పాటు చేసుకున్నారు.

·        వ‌చ్చే సంవ‌త్స‌రం మ‌ట్టి వినాయ‌కుల‌ను అధిక సంఖ్య‌లో ఏర్పాటు చేసుకునే అవ‌కాశం ఉంది.

·        మ‌ట్టి వినాయ‌కుల త‌యారీదారుల‌ను ముందుగానే ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతుంది.

·        అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కమైన హైద‌రాబాద్ గ‌ణేష్ నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం ఏవిధ‌మైన అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు లేకుండా జ‌ర‌గ‌డం ప‌ట్ల హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌తిష్ట మ‌రోసారి పెరిగింది. 

·        గ‌ణేష్ నిమ‌జ్జ‌న శోభ‌యాత్ర సంద‌ర్భంగా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పాల‌న యంత్రాంగం చేసిన విజ్ఞ‌ప్తులకు న‌గ‌ర‌వాసులు స్పందించినందున ఏవిధ‌మైన ప్ర‌మాదాలు జ‌ర‌గ‌లేదు. 

·        ప్ర‌ధాన నిమ‌జ్జ‌న ప్రాంత‌మైన ఎన్టీఆర్ మార్గ్‌, ట్యాంక్‌బండ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో భ‌క్తుల‌కు క‌నీస సౌక‌ర్యాలైన మంచినీటి సౌక‌ర్యం, తాత్కాలిక టాయిలెట్ల ఏర్పాట్లు చేప‌ట్ట‌డం వ‌ల్ల ఏవిధ‌మైన ఇబ్బందులు ఎదుర‌వ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాం.

·        జీహెచ్ఎంసి, ఇత‌ర లైన్ డిపార్ట్‌మెంట్ల ఉన్న‌తాధికారుల మ‌ధ్య ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌న్వ‌య స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌, స‌ర్కిళ్ల స్థాయిలో స‌మ‌న్వ‌య స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌ల‌తో నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా జ‌రిగాయి. 

·        వ‌ర్షాల వ‌ల్ల రోడ్ల‌పై గుంత‌లు ఏర్ప‌డ్డ‌ప్ప‌టికీ జీహెచ్ఎంసి ఇంజ‌నీరింగ్ విభాగం రేయింప‌గ‌ళ్లు  కృషిచేసి గుంత‌ల‌ను పూడ్చివేయ‌డం వ‌ల్ల నిమ‌జ్జ‌న శోభ‌యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగింది. 

·        జీహెచ్ఎంసి శానిటేష‌న్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, అర్బ‌న్ బ‌యో డైవ‌ర్సిటీ, ఎంట‌మాల‌జి త‌దిత‌ర విభాగాలు ఉత్త‌మ సేవ‌ల‌ను అందించ‌డం జ‌రిగింది. 

·        డ‌య‌ల్ 100, జీహెచ్ఎంసి కాల్ సెంట‌ర్, మై జీహెచ్ఎంసి యాప్‌, ఎసెమ్మెస్‌, వాట్స‌ప్‌ల ద్వారా వ‌చ్చిన ఫిర్యాదులు, స‌మ‌స్య‌ల‌ను యుద్ద ప్రాతిప‌ధిక‌న ప‌రిష్క‌రించ‌డంతో న‌గ‌ర పాల‌నా యంత్రాంగంపై న‌గ‌ర‌వాసుల్లో సానుకూల దృక్ప‌థం ఏర్ప‌డింది. 

·        వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు, క్షేత్ర‌స్థాయి అధికారులు, కార్పొరేట‌ర్ల సెల్ నెంబ‌ర్లు, టెలీఫోన్ నెంబ‌ర్ల‌తో కూడిన బుక్‌లేట్ కూడా దోహ‌ద‌ప‌డింది.

·        హైద‌రాబాద్ న‌గ‌రం మ‌న‌ది...దీనిని ప‌రిశుభ్రంగా ఉంచుకుందాం అనే నినాదంతో చేప‌ట్టిన అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంతో ర‌హ‌దారుల‌ను ప‌రిశుభ్రంగా ఉంచ‌డంలో న‌గ‌ర‌వాసులు స‌హ‌క‌రించారు. 

·        నిమ‌జ్జ‌న మార్గంలో ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌లు కూడా సేవ‌లు అందించ‌డం ప‌ట్ల అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాం.

జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్

దేశంలోని అతిపెద్ద ఉత్సవమైన గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఏ చిన్న సంఘటనలు లేకుండా విజయవంతం చేశాం. రానున్న రోజుల్లోనూ వివిధ శాఖలతో సమన్వయం ద్వారా ఇదే స్ఫూర్తితో పనిచేస్తాం. సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖలు, జిహెచ్ఎంసి లోని శానిటేషన్ వర్కర్ల నుండి అధికారుల వరకు కృతజ్జతలు.

అంజనీ కుమార్ -  హైదరాబాద్ పోలీస్ కమిషనర్

తెలంగాణ ఆవిర్భావం అనంతరం హైదరాబాద్ నగరంలో గత ఐదేళ్లుగా గణేష్ నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా స్వల్ప సంఘటనలు లేకుండా నిర్వహించడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రభుత్వ శాఖలకు అందుతున్న పూర్తిస్థాయి సహకారమే.

రాచకొండ పోలీస్ కమిషనర్ - మహేష్ భగవత్

టీమ్ వర్క్ తోనే గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాం. ఈ సారి ఉత్సవాల నిర్వహణలో కమ్యునిటీ పోలీసింగ్ కూడా విజయవంతంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల నిర్వహణలో సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్జతలు ఈ సమావేశంలో జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ కెనడి, జోనల్ కమిషనర్లు ముషారఫ్ అలీ, శ్రీనివాస్ రెడ్డి, మమత, జలమండలి డైరెక్టర్ కృష్ణ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com