మొత్తం ప్రయాణికుల లగేజీని మరిచి వార్తల్లో నిలిచిన ఇండిగో ఎయిర్లైన్స్

- September 17, 2019 , by Maagulf
మొత్తం ప్రయాణికుల లగేజీని మరిచి వార్తల్లో నిలిచిన ఇండిగో ఎయిర్లైన్స్

ఢిల్లీ: ఈ మధ్యకాలంలో ప్రముఖ దేశీయ విమాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. కొన్నిసార్లు సాంకేతిక లోపంతో విమానాలు బ్రేక్‌డౌన్ అవుతుండగా మరికొన్ని విమానాలు ఇతర కారణాలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నాయి. తాజాగా జరిగిన మరోఘటనతో ఇండిగో ఎయిర్‌లైన్స్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్ బయలుదేరిన ఇండిగో విమానం ఓ ప్రయాణికుల లగేజ్‌ను ఢిల్లీలోనే మరిచింది. ఇస్తాంబుల్ చేరుకున్న తర్వాత తీరిగ్గా చూస్తే ఏ ఒక్క ప్రయాణికుడి లగేజీ లేకపోవడంతో అసలు సంగతి వెలుగు చూసింది.

ఇస్తాంబుల్‌లో ల్యాండ్ అవగానే ఏం జరిగిందంటే..?
ఇండిగో బాధ్యత మరిచి ఇలా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్మయ్ అనే ఓ ప్రయాణికుడు జరిగిన ఘటనలపై ప్రపంచానికి తెలిసేలా తన ట్విటర్‌లో షేర్ చేశాడు. తాము ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్‌కు ఇండిగో విమానం 6E 11లో వచ్చినట్లు తెలిపాడు. ఇక విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవగానే తామంతా దిగి లగజే బెల్ట్ దగ్గర వేచిచూస్తున్న సమయంలో ఇండిగో సిబ్బంది ఓ పేపర్ ముక్క చేతిలో పెట్టారని చెప్పాడు. లగేజీని విమానంలో లోడ్ చేయడం సిబ్బంది మరిచింది. ఒక్క ప్రయాణికుడి లగేజీ కూడా లోడ్ చేయకుండానే విమానం ఇస్తాంబుల్‌కు బయలు దేరిందని ట్విటర్‌లో షేర్ చేశాడు. అంతేకాదు ప్రయాణికులకు ఇచ్చిన పేపర్ ముక్కలో క్షమించాల్సిందిగా రాసి ఉందని చెబుతూ ఆ పేపర్ ముక్కను ఫోటో తీసి ట్విటర్‌లో పోస్టు చేశాడు. షేమ్‌ఆన్ఇండిగో అనే హ్యాష్ ట్యాగ్ ఇవ్వడంతో అది ట్రెండ్ అవుతోంది.

ఇండిగో బాధ్యతారాహిత్యంతో వ్యవహరించింది
ఒక అంతర్జాతీయ సర్వీసును నడిపే ఇండిగో సంస్థ ఇంత బాధ్యతారాహిత్యంతో ఎలా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు. ఒకరి లగేజీ మరిచిందంటే ఏదో పొరపాటు అనుకోవచ్చు.. కానీ విమానంలోని మొత్తం ప్రయాణికుల లగేజీని లోడ్ చేయడం మరిచిపోవడమంటే అది బాధ్యతారాహిత్యమే అని ఆగ్రహం వ్యక్తం చేశాడు చిన్మయ్. ఢిల్లీలోని ఇండిగో ఆపరేషన్స్ శాఖ ఏం చేస్తోందంటూ ప్రశ్నించాడు..? ఇక దీంతో చిన్మయ్ ఆపలేదు. ప్రయాణికులను ఎంతలా ఇబ్బంది పెట్టారో కూడా రాసుకొచ్చాడు. లగేజీలో తన తండ్రి తీసుకునే మెడిసిన్లు ఉన్నాయన్ని చెప్పారు. తాను ఒక డయాబెటిస్ పేషంట్ అని చెప్పిన చిన్మయ్ తన తండ్రి వేళకు మందులు వేసుకోవాలని చెప్పాడు. కొందరు ఇతర దేశాలకు కనెక్ట్ ఫ్లయిట్ ద్వారా వెళ్లాల్సి ఉందని వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు చిన్మయ్.

ప్రధాని మోడీకి సంఘటన గురించి తెలిపిన ప్రయాణికురాలు
ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ గ్రౌండ్ స్టాఫ్ మాత్రం బాగా సహకరించారని చెప్పాడు. ఓ అప్లికేషన్ ఇచ్చి వాటిని నింపడంలో పూర్తిగా సహకరించారని కొనియాడాడు. అందులో ఎవరి లగేజీ ఏంటి అన్నది ప్రయాణికులను రాయాల్సిందిగా తెలిపారు. దాని ద్వారా గుర్తుపట్టేందుకు సులభంగా ఉంటుందని చెప్పాడు. కానీ విమానంలో మొత్తం 130 మంది ప్రయాణికులతో డీల్ చేయడం అంత ఈజీ కాదని చిన్మయ్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఐశ్వర్య అనే మరో ప్రయాణికురాలు ప్రధాని మోడీకి ట్వీట్ చేసింది. తన సోదరుడు ఓ వ్యాధితో బాధపడుతున్నాడని అతని మెడిసిన్స్ లగేజీలో ఉండిపోయాయని చెప్పింది. వేళకు మందులు ఇవ్వకుంటే తనకు సీజర్స్‌ వచ్చే అవకాశం ఉందని చనిపోయే ప్రమాదం కూడా ఉందని ట్వీట్ చేసింది. ఇండిగో యాజమాన్యం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని వెల్లడించింది.

ఇంధనం ఆదాకే లగేజీని మరిచింది
మరో వ్యక్తి అయితే తమ లగేజీ తొందరగా చేరేలా చూడాలంటూ ప్రాథేయపడ్డాడు. ఇంధనం ఆదాచేసేందుకే ఇండిగో యాజమాన్యం తమ లగేజీలను లోడ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ ఉదంతం ట్విటర్‌లో వైరల్ అయ్యింది. దీంతో చాలామంది ఇండిగో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలో తాము ఈ ఎయిర్‌లైన్స్ ద్వారా ఇబ్బంది పడిన ఘటనలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com