మద్దతుగా నిలిచిన దేశ ప్రజలకు ధన్యవాదాలు: ఇస్రో ట్వీట్

- September 18, 2019 , by Maagulf
మద్దతుగా నిలిచిన దేశ ప్రజలకు ధన్యవాదాలు: ఇస్రో ట్వీట్

బెంగళూరు: చంద్రుడిపైకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2తో చివరినిమిషంలో సంబంధాలు తెగిపోవడంతో శాస్త్రవేత్తలతో పాటు దేశ ప్రజలు కూడా కాస్త నిరాశకు గురయ్యారు. అయితే ఆ సమయంలో ఇస్రోకు దేశ ప్రజల మద్దతు సంపూర్ణంగా లభించింది. చివరినిమిషంలో విక్రమ్ ల్యాండర్ ట్రాక్ తప్పడం ఆ తర్వాత భూమిపై ఉన్న ఇస్రో స్టేషన్‌కు సంకేతాలు అందకపోవడంతో శాస్త్రవేత్తలు నిరాశకు లోనయ్యారు. ఇక ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు సమయం దగ్గరపడుతుండటంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా ఇస్రో ఓ ట్వీట్ చేసింది.

విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయన తర్వాత భారత ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు కూడా తమకు మద్దతుగా నిలిచి శాస్త్రవేత్తల్లో ధైర్యం నింపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇస్రో ట్వీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ప్రజల ఆకాంక్షలను, ఆశలను నిలిపేందుకు మరిన్ని ప్రయోగాలు చేపడుతూ ముందుకు కొనసాగుతామని ఇస్రో ట్వీట్ ద్వారా పేర్కొంది.

చంద్రుడి దక్షిణ ధృవంపై ఇప్పటి వరకు ఏ దేశము పంపని మిషన్‌ను భారత దేశం పంపి చరిత్ర సృష్టించాలని భావించింది. అయితే కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అది సాధ్యపడలేదు. చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో నీటి ఆనవాలను కనుగొనేందుకు, అక్కడి ఖనిజాలపై పరిశోధనలు చేసి భవిష్యత్తులో మానవుడిని చంద్రుడిపైకి పంపాలన్న ఉద్దేశంతో చంద్రయాన్-2 ప్రాజెక్టును ఇస్రో ప్రారంభించింది. జూలై 22న నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి టేకాఫ్ తీసుకున్న జీఎస్‌ఎల్‌వీ రాకెట్... 48 రోజుల పాటు ప్రయాణించి పలు సవాళ్లను అధిగమిస్తూ చంద్రుడి కక్ష్యలోకి చేరుకుంది. అయితే చంద్రుడి ఉపరితలంకు 2.1 కిలో మీటర్ల దూరంలో ఉన్న సమయంలో ల్యాండర్ గాడి తప్పడంతో సమస్య తలెత్తింది. అయితే చంద్రయాన్-2లోని ఆర్బిటార్ విక్రమ్ ల్యాండర్ జాడ కనుక్కుంది. అయితే ఇస్రో ట్రాకింగ్ సెంటర్‌కు ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడలేదు.

ఇంకా మూడురోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఇక ల్యాండర్‌తో కనెక్ట్ అయ్యేందుకు ఉన్న ఆశలన్నీ క్రమంగా వదులుకుంటోంది.ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామంటూ ఇస్రో సెప్టెంబర్ 10న వెల్లడించింది. అయితే ఈ విఫలం ఎలా తలెత్తింది అన్న అంశాన్ని పరిశీలించేందుకు ఓ అంతర్గత కమిటీని ఏర్పాటు చేసినట్లు ఇస్రో తెలిపింది. దీనికి గల కారణాలను మరో రెండురోజుల్లో వెల్లడిస్తామని పేర్కొంది. ఇప్పటికే ఆ కమిటీ రెండు సార్లు భేటీ అయిందని చెప్పిన ఇస్రో దాదాపు పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చేసిందని వెల్లడించింది. అధికారికంగా నివేదికను మరో రెండ్రోజుల్లో బహిరంగం చేయునున్నట్లు ఇస్రో చెబుతోంది.

దేశ అంతరిక్ష పరిశోధన చరిత్రలో కొన్ని ప్రయోగాలు విఫలమయ్యాయని చెప్పిన ఇస్రో అయినప్పటికీ తాము కృంగిపోలేదని రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి తిరిగి విజయాలను సొంతం చేసుకున్నామని తెలిపింది. ఇక ఇస్రో చేపట్టిన ఈ ప్రయత్నాన్ని ప్రపంచదేశాలు కొనియాడాయి. ఇస్రో వైఫల్యం చెందలేదని శాస్త్రవేత్తలు విజయం సాధించారని వెల్లడించాయి. ఇక ప్రయోగం నిరాశపర్చడంతో భావోద్వేగానికి గురైన ఇస్రో ఛైర్మెన్ డాక్టర్ శివన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఓదార్చడం ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఆ ఫోటోలు వీడియోలు సైతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com