ముంబై:భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

- September 20, 2019 , by Maagulf
ముంబై:భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

ముంబైను వరుణుడు వీడడం లేదు. వరుసగా భారీ వర్షాలు, వరదలతో దేశ ఆర్ధిక రాజధాని వణికిపోతోంది. 2రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు ముంబై మళ్లీ నీట మునిగింది. భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో కాలనీలన్నీ నదులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కన్పించడం లేదు. రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం తప్పడం లేదు. కొన్ని రైల్వే స్టేషన్లలో పట్టాలపైకి వరద నీరు వచ్చి చేరింది. వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలకు మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది.

మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముంబైతో పాటు రాయిగఢ్‌, రత్నగిరి, సతారా, సాంగ్లీ జిల్లాలో వర్షాల ప్రభావం ఉంది. దీంతో అధికారులు అలర్టయ్యారు. ఆయా ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. సముద్ర తీర ప్రాంతంలోనూ, నీళ్లు భారీగా నిలిచిన ప్రదేశాలకు ప్రజలు వెళ్లకూడని హెచ్చరికలు జారీ చేశారు. భారీవర్షాల వల్ల లోతట్టుప్రాంతాలు జలమయం అయిన నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com