'హొరైజాన్' అనే కొత్త వర్చువల్ రియాల్టీ (వీఆర్) ప్రపంచాన్ని ఆహ్వానించనున్న ఫేస్‌బుక్

- October 01, 2019 , by Maagulf
'హొరైజాన్' అనే కొత్త వర్చువల్ రియాల్టీ (వీఆర్) ప్రపంచాన్ని ఆహ్వానించనున్న ఫేస్‌బుక్

'హొరైజాన్' అనే కొత్త వర్చువల్ రియాల్టీ (వీఆర్) ప్రపంచాన్ని ఫేస్‌బుక్ సృష్టిస్తోంది. తమ వినియోగదారులు వీఆర్‌లో మరింత సమయం గడిపేలా చేసేందుకు ఆ సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఇందుకోసం ఓ వీఆర్ యాప్‌ను ఫేస్‌బుక్ తీసుకురాబోతోంది. వినియోగదారులు తమకంటూ ఓ కార్టూన్ అవతార్ (ప్రతిరూపం)ను సృష్టించుకొని ఈ వీఆర్ ప్రపంచంలో ఉండొచ్చు. అందులోని ప్రదేశాలను చుట్టేయొచ్చు. ఒకరితో మరొకరు సంభాషించుకోవచ్చు. గేమ్స్ ఆడుకోవచ్చు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ యాప్‌ను పరీక్షించబోతున్నారు. అయితే, మొదట్లో కొంతమంది ఫేస్‌బుక్ వినియోగదారులకు మాత్రమే దీన్ని అందుబాటులో ఉంచుతారు.

ఇటీవల ఫేస్‌బుక్ ఆక్యులస్ కనెక్ట్ 6 డెవలపర్ సదస్సు జరిగింది. ఇందులోనే హొరైజాన్ గురించి వివరాలు, వర్చువల్ ప్రపంచం ఫుటేజీని ఆ సంస్థ బయటపెట్టింది. హొరైజాన్‌ను వినియోగించే ఎవరైనా వీఆర్ ప్రపంచంలో భాగమయ్యేందుకు, దాని గురించి అవగాహన పెంచుకునేందుకు గైడ్స్ సాయం తీసుకోవచ్చని ఫేస్‌బుక్ తెలిపింది.

ఈ గైడ్స్ 'మోడరేటర్స్' (సంచాలకులు) కాదని, యూజర్స్ ఎలా ఉండాలన్నది వారేమీ నిర్దేశించరని ఫేస్‌బుక్ చెప్పింది. ఇతరులు తమను ఏవిధంగా సంప్రదించాలన్నది ఇష్టానుసారం మార్చుకునేలా యూజర్స్‌కు టూల్స్ అందిస్తామని వెల్లడించింది. ఈ వీఆర్ ప్రపంచాన్ని తమ అభిరుచికి తగ్గట్లుగా యూజర్స్ మార్చుకోవచ్చు. సొంత కార్టూన్ అవతార్‌ను కూడా ఇష్టప్రకారం డిజైన్ చేసుకోవచ్చు. హొరైజాన్ ప్రపంచమంతా కార్టూన్ తరహాలో ఉండబోతోంది. ఫేస్‌బుక్ ఆక్యులస్ క్వెస్ట్ వీఆర్ హెడ్‌సెట్‌తో వినియోగించే విధంగా దీన్ని ఆ విధంగా తీర్చిదిద్దుతున్నారు. మిగతా హైఎండ్ పీసీ వీఆర్ హెడ్‌సెట్‌ల తరహాలో హై రెజొల్యూషన్ గ్రాఫిక్స్‌ను ఆక్యులస్ క్వెస్ట్ సపోర్ట్ చేయదు.

ఫేస్‌బుక్ ఈ ప్రాజెక్టు కోసం చాలా శ్రమించిందని 'ఆర్స్ టెక్నికా' అనే న్యూస్ వెబ్‌సైట్ రిపోర్టర్ సామ్ మాష్కోవెచ్ చెప్పారు. ఆయన ఇప్పటికే హొరైజాన్‌ను ప్రయత్నించి చూశారు. ''కొన్నేళ్లుగా ఫేస్‌బుక్ తీసుకువస్తున్న యాప్స్, చాట్, అవతార్స్ సమాహారం ఇది. ఇదివరకూ ఇలాంటివి వచ్చాయి. యూజర్స్‌లో ఆసక్తి కలిగించే కాంబినేషన్ కోసం ఇంకా ఆ సంస్థ వెతుకుతోంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు. ''సోషల్ వీఆర్ యాప్‌ను తెచ్చి, కనీసం రెండేళ్లపాటైనా దాన్ని అలాగే అట్టిపెట్టుకుని ఫేస్‌బుక్ ఉంటుందా అన్నది వేచి చూడాలి'' అని అన్నారు.

ఫేస్‌బుక్ ఇదివరకు తెచ్చిన వీఆర్ వేదికలు ఫేస్‌బుక్ స్పేసెస్, ఆక్యులస్ రూమ్స్‌ సేవలు అక్టోబర్ 25తో నిలిచిపోనున్నాయి. పరీక్షల దశలోనే హొరైజాన్‌ను వినియోగించుకోవాలనుకునేవారు అందుకు ఎన్‌రోల్ చేసుకోవచ్చు.

శామ్‌సంగ్ సంస్థ వీఆర్ టెక్నాలజీకి సపోర్ట్ తగ్గించుకుంటున్న తరుణంలో ఫేస్‌బుక్ మాత్రం దీన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. ఇదివరకు అందిస్తూ వచ్చిన 'గేర్ వీఆర్' సదుపాయం లేకుండానే గెలాక్సీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్స్‌ను శామ్‌సంగ్ విడుదల చేసింది. ఫోన్‌లతో సంబంధం లేకుండా పనిచేసే ఆక్యులస్ క్వెస్ట్ లాంటి వీఆర్ హెడ్‌సెట్‌ల వాడకం పెరుగుతున్నందున శామ్‌సంగ్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com