విశాఖ చాలా బాగుంది: యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌

- October 14, 2019 , by Maagulf
విశాఖ చాలా బాగుంది: యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌

విశాఖపట్నం : భారత్‌తో మెరుగైన రక్షణపరమైన సంబంధాలకోసమే వచ్చే నెలలో సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు  యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రిఫ్మన్‌ తెలిపారు. భారత్‌తో అమెరికాకు మంచి దౌత్యపరమైన సంబంధాలు ఉన్నాయని, వివిధ రంగాలలో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలున్నాయన్నారు. విశాఖ పోర్టులో అమెరికా నౌక ఎమౌరీ ఎస్ ల్యాండ్‌కు యూఎస్‌ కాన్సుల్‌ జనరల్ జోయల్‌ రిఫ్మన్‌ స్వాగతం పలికారు. వచ్చే నెలలో విశాఖలో ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లతో యుఎస్ నేవీ సంయుక్త  విన్యాసాలు జరగనున్న నేపధ్యంలో యూఎస్‌ నేవీ అధికారులతో ఆయన మాట్లాడారు.  ఈ సందర్బంగా తొలిసారిగా విశాఖ వచ్చిన జోయల్‌ రిఫ్మన్‌ మీడియాతో మాట్లాడుతూ రేపు(మంగళవారం) ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవబోతున్నట్లు తెలిపారు‌. యూఎస్‌ కాన్సుల్‌ జనరల్ ద్వారా అమెరికన్ వీసా జారీపై విద్యార్ధులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నామన్నారు. అమెరికాలో రెండు లక్షల మంది భారతీయ విద్యార్ధులు ఉన్నారని, వారు నకిలీ విశ్వవిద్యాలయాల వల్ల మోసపోకుండా ఎడ్యు యుఎస్ ద్వారా ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. 
తొలిసారిగా విశాఖ వచ్చానని... విశాఖ నగరం చాలా బాగుందని ప్రశంసించారు‌. అమెరికా-భారత్‌ మధ్య మెరుగైన రక్షణపరమైన సంబంధాలకోసమే సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విశాఖ తీరానికి యుఎస్ షిప్ లు రావడం ఇది మూడోసారి అని అన్నారు. యుఎస్ షిప్ లో వంద మంది మహిళానేవీ అధికారులతో పాటు మొత్తంగా 500 మంది నేవీ అధికారులున్నారని... వీరంతా వచ్చే నెలలో భారత్‌ త్రివిధ దళాలతో జరిగే సంయుక్త విన్యాసాలలో పాల్గొంటారని తెలిపారు. భారత్‌-అమెరికా సంయుక్త భాగస్వామ్యంతో త్వరలో హైదరాబాద్ లో ఎఫ్ -16, ఎఫ్-21 విమానాల రెక్కల తయారీ జరగనున్నట్లు జోయల్‌ రిఫ్మన్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com