ఆర్టీసీతో చర్చలుండవు..తెగేసి చెప్పిన కేసీఆర్

- October 23, 2019 , by Maagulf
ఆర్టీసీతో చర్చలుండవు..తెగేసి చెప్పిన కేసీఆర్

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తెగేసి చెప్పారు. గడచిన 18 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తెగేసి చెప్పేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని స్పష్టం చేస్తునే చర్చలు కూడా జరపనంటూ తన చర్యలను కేసీఆర్ సమర్ధించుకున్నారు. ముఖ్యమంత్రి తాజా నిర్ణయంతో కార్మిక సంఘాలు ఏమి చేస్తాయి? మిగిలిన ఉద్యోగ సంఘాలు ఏమి చేస్తాయన్న విషయం ఆసక్తిగా మారింది.

కార్మికసంఘాలతో చర్చలు జరిపేది లేదన్న తాజా నిర్ణయంతో కోర్టు ఆదేశాలను కూడా కేసీఆర్ ధిక్కరిస్తున్నట్లే ఉంది. అసలే కేసీఆర్ నిర్ణయాలను ఇప్పటికే చాలా సందర్భాల్లో కోర్టులు కొట్టేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ తాజా నిర్ణయంతో సమ్మె మరింత ఉధృతమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సమ్మె విషయంలో చాలా ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకే మద్దతుగా నిలబడ్డాయి. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఇప్పటికే టిఏన్జీవో, ఎన్జీవో, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు, విద్యార్ధి సంఘాలు సమ్మెలో పాల్గొంటున్న విషయాన్ని అందరూ చూస్తున్నదే.

సమ్మె నేపధ్యంలోనే కోర్టు కూడా జోక్యం చేసుకున్నది. కేసీఆర్ లెక్క ప్రకారం అసలు కార్మికసంఘాలే ఉండకూడదు. కార్మికసంఘాలకు సమ్మె చేసే అవకాశమే లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ ఇదే కేసీఆర్ ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో ప్రతీ కార్మికసంఘాన్ని రోడ్డుమీదకు లాక్కొచ్చారు.

అంటే తనకు అవసరమైతే ఒకలాగ అవసరం తీరిపోతే మరోలాగ వ్యవహరిస్తారన్న విషయం మరోసారి రుజువైంది. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ వైఖరిని మిగిలిన ఉద్యోగసంఘాల నేతలు కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇపుడు సమస్య ఆర్టీసీ కార్మికులదైతే రేపటి రోజున తమదాకా కూడా రావచ్చన్న స్పృహ మిగిలిన ఉద్యోగుల్లో కూడా బలంగా ఏర్పడింది. కాబట్టి ఇప్పటి వరకూ మద్దతు పలకని మిగిలిన ఉద్యోగసంఘాలు కూడా ఆర్టీసి కార్మికులకు బహిరంగంగా మద్దతుపలికే అవకాశం ఉందన్నది తాజా కబురు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com