నవజోత్ సింగ్ సిద్దూకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆహ్వానం
- October 31, 2019
న్యూఢిల్లీ : పాకిస్థాన్ దేశంలోని కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ మన దేశానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దూను ఆహ్వానించారు. నవంబరు 9వతేదీన జరగనున్న కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభ కార్యక్రమానికి రావాలని కోరుతూ ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పక్షాన ఆహ్వానం పంపినట్లు ఆ పార్టీ ప్రకటించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూచన మేరకు నవంబరు 9న కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కోరుతూ తాను సిద్దూతో ఫోన్ లో మాట్లాడానని పీటీఐకు చెందిన సెనేటర్ ఫైజల్ జావేద్ ఖాన్ చెప్పారు. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి వచ్చేందుకు సిద్ధూ అంగీకరించారని జావేద్ ఖాన్ వివరించారు.
కాగా కర్తార్ పూర్ వెళ్లనున్న కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందంలో సిద్ధూ పేరు లేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందాన్ని కర్తార్ పూర్ సాహిబ్ వెళ్లేందుకు సోనియాగాంధీ నియమించింది. సోనియా ఏర్పాటు చేసిన బృందంలో మన్మోహన్ తోపాటు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జ్యోతిరాదిత్య సింధియా, ఆర్పీఎన్ సింగ్, రణదీప్ సూర్జేవాలా, దీపెందర్ హుడా, జితిన్ ప్రసాద్ లు పాక్ వెళ్లనున్న బృందంలో ఉన్నారు.
నవజోత్ సింగ్ సిద్ధూ గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లి, ఆ దేశ సైనికాధికారి బజ్వాను ఆలింగనం చేసుకోవడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సిద్దూ కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి హాజరవుతారా లేదా అనేది సందేహాస్పదంగా మారింది. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ పుట్టిన, మరణించిన స్థలాలు రెండు పాకిస్థాన్‌లోనే ఉన్నాయి. ఆయన జన్మస్థలం లాహోర్‌కు దగ్గర్లోని నాన్ కనాసాహిబ్‌లో ఉంది. గురునానక్ దేవ్ చివరిరోజులను కర్తార్‌పూర్‌లోని రావి నది ఒడ్డున గడిపి, అక్కడే పరమపదించారు. దీంతో దాన్ని పవిత్ర స్థలంగా సిక్కులు భావిస్తారు.ఈ కారిడార్ పనులను పాకిస్తాన్ ,భారత ప్రభుత్వాలు సంయుక్తంగా గత సంవత్సరం ప్రారంభించాయి.నవంబర్ 9న పాకిస్తాన్ భూభాగంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. కాగా నవంబర్ 8న భారత భూభాగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!







