టీటీడీ దేవస్థానంలో లోకల్ రిజర్వేషన్ : చిత్తూరు వాసులకే 75 శాతం ఉద్యోగాలు..!

- November 12, 2019 , by Maagulf
టీటీడీ దేవస్థానంలో లోకల్ రిజర్వేషన్ : చిత్తూరు వాసులకే 75 శాతం ఉద్యోగాలు..!

ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ లోకల్ రిజర్వేషన్ బిల్లు శాసనసభలో ప్రవేశ పెట్టారు. దీనిని ఆమోదించారు. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే, ఇప్పుడు ఈ నిర్ణయాన్ని తొలుత ప్రఖ్యాత పుణ్యక్షేత్రం టీటీడీలో అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. టీటీడీలో భర్తీ చేసే ఉద్యోగాల్లో జూనియర్ అసిస్టెంట్ వరకు ఈ విధానం అమలు చేయాలని బోర్డు భావిస్తోంది.

దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఆమోదించి..ప్రభుత్వం పరిశీలనకు పంపింది. ప్రభుత్వం సైతం దీనికి ఆమోద ముద్ర వేస్తే ఇక, తిరుమల తిరుపతి దేవస్థానంలో సైతం ఈ విధానం అమలు కానుంది. అయితే, ఇది టీటీడీలో అమలు పైన రాజకీయ పార్టీలు ఏ రకంగా స్పందిస్తాయనేదీ ఆసక్తి కరంగా మారుతోంది.
టీటీడీలో చిత్తూరు వాసులకు 75 శాతం..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల దేవస్థానంలో.. చిత్తూరు జిల్లా వాసులుకు వరం ప్రకటించాలని నిర్ణయించింది. టీటీడీలోని జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగాల భర్తిలో జిల్లా వాసులుకు 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని సంకల్పించింది. ఈ మేరకు టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులు భూమాన్ కరుణాకర్ రెడ్డి మంగళవారం బోర్డు సమావేశంలో ఈ కీలక ప్రతిపాదన చేశారు.

తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన టీటీడీ పాలనమండలి.. ప్రభుత్వ అనుమతులకు పంపింది. దీనిని ప్రభుత్వం ఆమోదిస్తే.. ఇప్పటి నుంచి వెలువడే ఉద్యోగాల భర్తీలో అధిక భాగం జిల్లా వాసులకు దక్కే అవకాశం ఉంది. తాజా నిర్ణయంపై చిత్తూరు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే, ఇది దేవస్థానం లో పని చేసే జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు అమలు కానుంది.

తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యులు దాదాపు నాలుగు రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ సారి నియమించిన బోర్డులో ఏపీ వాసులకు తక్కవ ప్రాధాన్యత ఇచ్చారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో 50 శాతం ఎస్సీ..ఎస్టీ..బీసీ..మైనార్టీలకు అవకాశం ఇచ్చే ప్రభుత్వం చట్టం తెచ్చింది. అయితే, టీటీడీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో అన్యమతస్థులకు అవకాశం దక్కదు. దీంతో.. టీటీడీలో ఈ నిర్ణయం వర్తించందని బోర్డు స్పష్టం చేసింది.

ఇక, బోర్డులో ఇతర రాష్ట్ర ప్రతినిధులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వగా..ఇప్పుడు బోర్డు దేవస్థానంలో ఉద్యోగాలను చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం అమలు చేయాలని సిఫార్సు చేసింది. టీటీడీ లాంటి ప్రతిష్ఠాత్మక దేవస్థానంలో ఈ నిర్ణయానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారింది. అయితే, ఈ నిర్ణయం అమలు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని.. స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు మేలు జరుగుతుందని అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com