చంద్రయాన్-2: చంద్రయాన్ ఖర్చు, ప్రయోగంపై సభకు వివరించిన ప్రభుత్వం

- November 21, 2019 , by Maagulf
చంద్రయాన్-2: చంద్రయాన్ ఖర్చు, ప్రయోగంపై సభకు వివరించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో గతి తప్పడంతో ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే. దీనిపై పార్లమెంటులో కేంద్రమంత్రి జితేందర్ సింగ్ సమాధానం ఇచ్చారు. చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ వేగంను ముందుగా నిర్దేశించిన వేగంకు తగ్గించడంలో విఫలమైనందునే మరో 500 మీటర్లు ఉందనగా ల్యాండర్ గతి తప్పిందని సమాధానం ఇచ్చారు. తొలి దశలో 30 కిలోమీటర్ల వేగం నుంచి 7.4 కిలోమీటర్ల వేగంకు తగ్గించగా.. సెకనుకు 1683 మీటర్లుగా ఉన్న వెలాసిటీని కూడా 146కు తగ్గించినట్లు చెప్పారు.

ఇక రెండో దశలో ముందుగా నిర్దేశించిన వెలాసిటీ కంటే ఎక్కువ వెలాసిటీతో విక్రమ్ ల్యాండర్ పయనించిందని జితేందర్ సింగ్ సభకు చెప్పారు. ఇక్కడే విక్రమ్ ల్యాండర్ గతి తప్పిందని చెప్పారు. దీంతో విక్రమ్ ల్యాండర్ నిర్దేశించిన ల్యాండింగ్ సైట్‌ నుంచి 500 మీటర్ల దూరంలో హార్డ్ ల్యాండింగ్ అయినట్లు కేంద్రమంత్రి సభలో చెప్పారు.

అయితే ప్రయోగం సందర్భంగా చాలా కాంపొనెంట్స్‌ విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. అయితే అన్ని కాంపోనెంట్స్ సైంటిఫిక్ డేటా ప్రకారం పనిచేస్తున్నందున చంద్రయాన్ 2 జీవితకాలంను మరో ఏడేళ్లు పొడిగించినట్లు మంత్రి వెల్లడించారు. ఆర్బిటార్ నుంచి వస్తున్న సమాచారంను శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వెల్లడించారు.

చంద్రయాన్-2కు అయిన మొత్తం ఖర్చును కూడా మంత్రి సభకు వివరించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన చంద్రయాన్-2లో ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌లు ఉన్నాయని చెప్పారు. జీఎస్‌ఎల్‌వీ ఎంకే -3 ద్వారా చంద్రయాన్ 2 ను జూలై 22న ప్రయోగించారని వెల్లడించింది. చంద్రయాన్ -2 మిషన్‌కు రూ.603 కోట్లు ఖర్చుకాగా.. ఇక లాంచింగ్‌కు అయిన ఖర్చు రూ.367 కోట్లు అని జితేందర్ సింగ్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com