రేపటి నుండి భారత్ తన తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్...మరి పింక్ బాల కధ ఏంటో చూడండి

- November 21, 2019 , by Maagulf
రేపటి నుండి భారత్ తన తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్...మరి పింక్ బాల కధ ఏంటో చూడండి

భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో మరో మైలురాయిని అందుకోబోతుంది. ఐదు రోజుల ఆటలో టీమ్‌ ఇండియా తొలిసారి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో  పింక్ బాల్ టెస్టు సమరానికి సిద్ధమవుతోంది. శుక్రవారం నుంచి ఆరంభం కానున్న గులాబీ టెస్టు భారత్‌, బంగ్లాదేశ్‌లకు తొలి డే నైట్‌ మ్యాచ్‌ కావటం విశేషం. 

మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే వ్యక్తిగత చొరవ చూపిన అంశం డే నైట్‌ టెస్టు. దాదా ఆలోచనకు కెప్టెన్‌ కోహ్లి అంగీకారం వెంటనే లభించింది. ఆదరణ కోల్పోతున్న టెస్టు క్రికెట్‌కు సరికొత్త జీవం తీసుకొచ్చేందుకు డే నైట్‌ గులాబీ టెస్టు చక్కటి మార్గమని గంగూలీ గట్టిగా నమ్ముతున్నాడు. ప్రపంచ క్రికెట్‌కు డే నైట్‌ టెస్టు కొత్త కాదు, కానీ భారత అభిమానులకు గులాబీ పోరు న్యూ ఫార్మాట్‌!. 

అభిమానులను మైదానంలోకి రప్పించేందుకు గులాబీ టెస్టు బ్రహ్మాస్త్రం అని చాలామంది క్రికెట్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. డే నైట్‌ టెస్టు సైతం కొన్ని సవాళ్లు ఎదుర్కొంటుంది. భారత్‌, బంగ్లాదేశ్‌ డే నైట్‌ గులాబీ టెస్టు నేపథ్యంలో ఈ ఫార్మాట్‌ను ప్రభావితం చేయగల కొన్ని అంశాలను చూద్దాం. 

మ్యాచ్ టైమింగ్స్ 
సాధారణంగా డే నైట్‌ టెస్టు మధ్యాహ్నాం 3 గంటలకు ఆరంభం అవుతుంది. కానీ నవంబర్‌ నెలలో కోల్‌కతలో మంచు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఈడెన్‌ గార్డెన్స్‌ డే నైట్‌ టెస్టు మ్యాచ్‌ వేళల్లో కీలక మార్పు చేయటం జరిగింది. మధ్యాహ్నాం 12.30 గంటలకు టాస్‌ వేయనుండగా.. తొలి సెషన్‌ 1 నుంచి 3 వరకు జరుగుతుంది. 40 నిమిషాల లంచ్‌ విరామం తర్వాత 3.40 నుంచి 5.40 వరకు రెండో సెషన్‌ ఉంటుంది. 20 నిమిషాల టీ విరామం అనంతరం చివరి సెషన్‌ ఆరంభం అవుతుంది. సాయంత్రం 6 నుంచి 8 వరకు మూడో సెషన్‌ జరుగుతుంది. 

పిచ్ లో ఏమైనా మార్పులు ఉంటాయా...?
టెస్టు క్రికెట్‌లో పిచ్‌ ఎప్పుడూ క్రీయాశీలక పాత్ర వహిస్తుంది. గులాబీ బంతితో ఆడినప్పుడు పిచ్‌ ప్రభావం మరింత అధికం. డే నైట్‌ టెస్టుల్లో బంతి కనిపించటం అతి పెద్ద సవాల్‌. అందుకోసం మైదాన సిబ్బంది గులాబీ బంతి త్వరగా మెత్తపడకుండా, బురదగా కాకుండా చూస్తారు. బంతి మెత్తపడితే, పాతబడితే బ్యాట్స్‌మెన్‌తో పాటు ఫీల్డింగ్‌ జట్టుకూ ఇబ్బందులు తప్పవు. అందుకే ఈడెన్‌ గార్డెన్స్‌లో పచ్చికను బాగా ఉంచారు. 

సాధారణంగా మైదానంలో 4 మిల్లీ మీటర్ల పచ్చిక ఉంచుతామని ఈడెన్‌ గార్డెన్స్‌ క్యూరేటర్‌ సుజన్‌ ముఖర్జీ వెల్లడించారు. కానీ ఈడెన్‌లో ఇప్పుడు 6 మిల్లీ మీటర్ల లోపు పచ్చిక కనిపిస్తోంది. మైదానంలో పచ్చిక బంతి నాణ్యతనుత కాపాడేందుకు ఉపయోగపడుతుంది. 2015 ఆడిలైడ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ డే నైట్‌ టెస్టు ఆడినప్పుడు మైదానంలో 11 మిల్లీ మీటర్ల ఎత్తున పచ్చికను ఉంచారు. 

పిచ్‌పై కూడా కొద్దిగా పచ్చిక ఉంటుంది. తద్వారా ఫాస్ట్ బౌలర్లకు పిచ్ ఉపకరిస్తుంది. గత పింక్ బాల్ రికార్డులన్నీ పరిశీలించినా కూడా ఇదే విషయం ధృవీకృతమవుతుంది. ఇప్పటివరకు ఆడిన అన్ని పింక్ బాల్ టెస్టుల్లో స్పిన్నర్లు కేవలం 26 శాతం వికెట్లు మాత్రమే పడగొట్టారంటేనే పిచ్ ఫాస్ట్ బౌలర్లకు ఎంత ఉపకరిస్తుందో మనకు అర్థమవుతుంది.  

మైదానంలో కూడా పచ్చిక ఉండటంతో బౌలర్లకు 'కార్పెట్‌ తరహా' అనుభూతి కలుగుతుంది. బంతి నాణ్యతను ఇది మరింత ప్రభావవంతంగా కాపాడుతుంది. మెరుగైన అవుట్‌ ఫీల్డ్‌ డే నైట్‌ టెస్టుకు అత్యంత కీలకం. సహజంగానే ఈడెన్‌ గార్డెన్స్‌ సీమర్లకు అనుకూలం. మైదానంలోనే కాదు పిచ్‌పైనా కాస్త పచ్చిక ఉంచడంతో, గులాబీ బంతితో సీమర్లకు అదనపు ప్రయోజనం ఉండనే ఉంటుంది. దీంతో ఈడెన్‌ గార్డెన్స్‌లో సీమర్లకు వికెట్ల పండుగ అని చెప్పవచ్చు.

మంచు ప్రభావం...  
డే నైట్‌ మ్యాచుల్లో మంచు అతి పెద్ద పాత్ర పోషిస్తుంది. మంచు ప్రభావం ఉన్నప్పటికీ, అది ఏ స్థాయిలో ఉంటుందనేది ఎవరూ చెప్పలేరు. కోల్‌కతలో సూర్యాస్తమయం సాయంత్రం 4 గంటలకే అవుతుంది. చివరి సెషన్‌ ఆరంభానికి ముందు మంచు ప్రభావం కనిపించే అవకాశం ఉంది. మంచుతో బౌలర్లకు బంతిపై పట్టు చిక్కదు. అవుట్‌ ఫీల్డ్‌లో తక్కువ పచ్చికతో మంచు ప్రభావాన్ని కాస్త తగ్గించవచ్చు. ఇప్పటికే ఈడెన్‌ గార్డెన్స్‌లో రోలింగ్‌, వాటరింగ్‌ నిలిపివేశారు. మంచు ప్రభావాన్ని ఇవి తగ్గిస్తాయి. మంచును దృష్టిలో ఉంచుకునే మ్యాచ్‌ వేళల్లోనూ మార్పులు చేశారు. కాబట్టి కోల్‌కత టెస్టుకు మంచు పెద్ద ఆటంకం కాకపోవచ్చు. ఓ 30 ఓవర్ల ఆట మాత్రమే రాత్రి వేళల్లో జరుగుతుంది, కాబట్టి మంచు బారి నుంచి సులభంగానే బయటపడవచ్చు.

బంతిలో ఏమేమి మార్పులు ఉండబోతున్నాయి...? 
ఈడెన్‌ గార్డెన్స్‌ డే నైట్‌ టెస్టు భారత్‌, బంగ్లాదేశ్‌లకు మాత్రమే అరంగ్రేట గులాబీ సమరం కాదు, బంతి తయారుదారు ఎస్‌జీకి సైతం ఇదే తొలి గులాబీ పరీక్ష. సంప్రదాయ ఎర్ర బంతిలో కుట్లను తెలుపు దారంతో వేస్తారు, గులాబీ బంతికి నలుపు దారంతో కుట్లు వేస్తారు. ఎస్‌జీ బంతులను చేతితో తయారు చేయటం కారణంగా, సీమ్‌ కాస్త ఎక్కువగా కనిపిస్తుంది.

బంతి పాతబడితే?...
బంతి తయారు దారు ఎస్‌జీకి ఇదే తొలి గులాబీ పోరు. సాధారణంగా మ్యాచ్‌ సమయంలో బంతి రూపు మారితే, మెత్తబడితే ఇతర కారణాలతో అంపైర్లు అన్నే ఓవర్ల పాటు వినియోగించిన మరో బంతిని అందిస్తారు. కానీ, ఇరు జట్లతోపాటు బంతి తయారీదారుడి కి కూడా తొలి మ్యాచే కావడంతో అంపైర్లు ఒక ఫార్ములాను వినియోగించనున్నారు. కేవలం రెండు వారాలకు ముందు మాత్రమే, ఎస్‌జీ కంపెనీ భారత్‌, బంగ్లాదేశ్‌ జట్లకు రెండు డజన్ల చొప్పున గులాబీ బంతులను అందించింది. అంపైర్ల సమక్షంలో గులాబీ బంతులతోనే ప్రాక్టీస్‌ సెషన్‌ జరిగింది. ఈడెన్‌ పోరుకు ఎస్‌జీ 80 బంతులను సిద్ధం చేసింది. మ్యాచ్‌లో బంతి మార్పు అనివార్యం అయితే, ప్రాక్టీస్‌ సెషన్లలో వినియోగించిన బంతుల నుంచి ఎంచుకుంటారు.

వాతావరణం అనుకూలించకపోతే...? 
సహజంగానే సంప్రదాయ టెస్టుల్లో వర్షంతో పాటు వెలుతురు లేమి సైతం ఆట అర్థాంతరంగా నిలిపివేసేందుకు కారణం అవుతుంది. ఇదే సమస్య డే నైట్‌ టెస్టులోనూ ఎదురైతే ఏం చేస్తారు? అనే ప్రశ్న ఉదయిస్తోంది. వెలుతురు లేమితో బంతి కనిపించటం లేదని బ్యాట్స్‌మన్‌ ఫిర్యాదు చేస్తే.. ఫ్లడ్‌ లైట్లు వేయటంపై అంపైర్లు నిర్ణయం తీసుకుంటారు. వెలుతురు లేమితో మ్యాచ్‌ను నిలిపివేయటం అరుదు అనే చెప్పాలి!. ఇది తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ కు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు. ఇరు జెట్లు కూడా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. భారతదేశ ఆటగాళ్లలో కొందరికైనా ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో పింక్ బాల్ తో ఆడిన అనుభవం ఉంది. కానీ బంగ్లాదేశ జట్టులోని ఏ సభ్యుడికి కూడా ఆ అనుభవం లేదు. మొత్తానికైతే ఈ మ్యాచ్ కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తుందనడానికి పూర్తిగా అమ్ముడైపోయిన టిక్కెట్లే నిదర్శనం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com