గల్ఫ్ అవగాహన కరపత్రాలను ఆవిష్కరించిన ధర్మపురి పోలీస్ ఎస్.ఐ శ్రీకాంత్

- November 24, 2019 , by Maagulf
గల్ఫ్ అవగాహన కరపత్రాలను ఆవిష్కరించిన ధర్మపురి పోలీస్ ఎస్.ఐ శ్రీకాంత్

తెలంగాణ:గల్ఫ్ వలసలపై అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆదివారం (24.11.2019) ధర్మపురి పోలీస్ ఎస్ ఐ శ్రీకాంత్, ప్రవాసి కార్మిక నాయకుడు గోలి శ్రీనివాస్ తో కలిసి ధర్మపురి పోలీస్ స్టేషన్ ఆవరణలో అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ఈ కరపత్రాలను ముద్రించారు. ఈ సందర్బంగా ఎస్ ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ, గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్లేవారు భారత ప్రభుత్వం జారీచేసిన లైసెన్సు కలిగిని ఏజెన్సీల ద్వారానే వెళ్లాలని, చట్టబద్దంగా, సురక్షితంగా వెళ్లాలని కోరారు. 

విజిట్ వీసాలతో వెళితే అక్రమ వలసదారులుగా మారి హక్కులు కోల్పోతారని, రూ. 10 లక్షల విలువైన ప్రవాసి భారతీయ బీమా పాలసీ లేకుండా ప్లయిట్ ఎక్కవద్దని ఎస్ ఐ సూచించారు. జైన కోసునూరుపల్లె గ్రామాలలో జరుగనున్న ఎన్నారై జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఎస్ ఐ శుభాకాంక్షలు తెలిపారు.  

గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లోని అబుదాబి, షార్జా, అజుమాన్, రాసల్ కైమా, ఫుజీరా, ఉమ్మల్ కోయిన్ అనే ఆరు ఎమిరేట్స్ (రాజ్యాలకు) ఇటీవలి కాలంలో పురుష కార్మికుల అక్రమరవాణా పెరిగిపోయిందని, గత ఆరునెలల కాలంలో ఈవిధంగా పదివేలకు పైగా తెలంగాణ యువకులు 'విజిట్ కం ఎంప్లాయిమెంటు' పద్ధతిలో అక్రమ మార్గంలో దేశందాటి వెళ్లిపోయారని ప్రవాసి కార్మిక నాయకుడు గోలి శ్రీనివాస్ అన్నారు. 

భారత ప్రభుత్వం ద్వారా లైసెన్సులు పొందిన రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్లే విజిట్ వీసాలతో మానవ అక్రమరవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) కు పాల్పడటం ఘోరమని ఆయన అన్నారు. ప్రవాసి ఇన్సూరెన్స్ పాలసీ కోసం గల్ఫ్ ఏజెంట్లను నిలదీయాలని, పాలసీ జారీచేయని పక్షంలో సమీప పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయాలని గోలి శ్రీనివాస్ కోరారు. 
  
ప్రవాసి బీమా ప్రయోజనాలు

రూ.10 లక్షల ప్రమాద బీమా విదేశాలతోపాటు, భారత్ లో కూడా వర్తిస్తుంది. రెండేళ్ల కోసం రూ.325, మూడేళ్ళ కోసం రూ.443 ప్రీమియం చెల్లించాలి. ఆన్ లైన్ లో రెనివల్ చేసుకునే వీలుంది. గాయాలు, అనారోగ్యం, జబ్బు, వ్యాధుల చిత్సకు రూ.ఒక లక్ష ఆరోగ్య బీమా వర్తింపు. భారత్ లో ఉన్న కుటుంబ సభ్యులు (భార్య, 21 సంవత్సరాలలోపు ఇద్దరు పిల్లలు) చికిత్సకు రూ.50 వేలు, మహిళా ప్రవాసి కార్మికుల ప్రసూతి సాయం రూ.35 వేలు, విదేశీ ఉద్యోగ సంబంధ న్యాయ సహాయం కోసం రూ.45 వేలు, మెడికల్ అన్ ఫిట్ గాని, ఒప్పందం కంటే ముందే ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో గాని విదేశం నుండి భారత్ కు రావడానికి విమాన ప్రయాణ టికెట్టు ఇస్తారు. ప్రమాదంలో చనిపోయినప్పుడు శవపేటికను తరలించడానికి, ప్రమాదం వలన శాశ్వత అంగవైకల్యం ఏర్పడినప్పుడు కూడా విమాన ప్రయాణ టికెట్టు ఇస్తారు. 

గల్ఫ్ హెల్ప్ లైన్ నెంబర్లు

గల్ఫ్ కార్మికులు సహాయం, సలహాల కోసం ఢిల్లీలోని భారత ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ *1800 11 3090* (తెలుగుతో సహా 11 బాషలలో జవాబు ఇస్తారు) కుగాని, హైదరాబాద్ నాంపల్లి పిఓఇ కార్యాలయంలోని క్షేత్రీయ ప్రవాసి సహాయతా కేంద్రం హెల్ప్ లైన్ నెంబర్ *+91 73067 63482* కు గాని ఫోన్ చేయవచ్చు. ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ హెల్ప్ లైన్ నెంబర్లు +91 75697 33255 లేదా +91 94400 88177 కు సంప్రదించవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com