భారత వలస చట్టాలు, గల్ఫ్ కార్మిక చట్టాలపై అవగాహన

- November 26, 2019 , by Maagulf
భారత వలస చట్టాలు, గల్ఫ్ కార్మిక చట్టాలపై అవగాహన

తెలంగాణ:గల్ఫ్ దేశాలకు చట్టబద్దంగా వెళితే సురక్షితంగా ఉంటారని, ఆయా దేశాలలోని స్థానిక చట్టాలను (లా ఆఫ్ ది లాండ్), ఆచార వ్యవహారాలను గౌరవించి పాటిస్తే ప్రవాస జీవితం సుఖంగా ఉంటుందని ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల అన్నారు.

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా మెటుపల్లి కోర్టు మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం (26.11.2019) మధ్యాహ్నం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో స్వదేశ్ పరికిపండ్ల గల్ఫ్ దేశాలకు వెళ్లేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. భారత పాస్ పోర్ట్ చట్టం, భారత ఎమిగ్రేషన్ చట్టం, అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టంతో పాటు గల్ఫ్ దేశాల కార్మిక చట్టాలు, సివిల్, క్రిమినల్ చట్టాల గురించి ఆయన వివరించారు. 

విజిట్ వీసాపై వెళ్ళవద్దు  

గల్ఫ్ దేశాలకు విజిట్ వీసాపై వెళితే అక్రమ వలసదారులుగా మారి హక్కులు కోల్పోతారని, ప్రభుత్వ గుర్తింపు పొందిన రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగ వీసాపై మాత్రమే వెళ్లాలని స్వదేశ్ సూచించారు. రూ.10 లక్షల విలువైన ప్రవాసి భారతీయ బీమా యోజన అనే ప్రమాద బీమా పాలసీ లేనిదే ప్లయిట్ ఎక్కకూడదని అన్నారు. ప్రవాసి ఇన్సూరెన్స్ పాలసీ కోసం గల్ఫ్ ఏజెంట్లను నిలదీయాలని, పాలసీ జారీచేయని పక్షంలో సమీప పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. 

కొత్త బంగారు లోకం కోసం

ప్రతి ఒక్కరూ రాజ్యాంగం చదవాలని, క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మెటుపల్లి మున్సిఫ్ మేజిస్ట్రేట్ అజయ్ కుమార్ జాదవ్ అన్నారు. రాజ్యాంగంలో అనేక అంశాలు ఉన్నాయని ఎవరి హక్కులు విధులు రాజ్యాంగంలో పొందుపర్చారని, పంచాయతీ నుండి రాష్ట్రపతి వరకు జవాబుదారీతనంతో వారి వారి విధుల బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తిoచాలని అన్నారు. కళాశాల విద్యార్థులు క్రమశిక్షణతో కొత్త బంగారు లోకాన్ని తీర్చిదిద్దుకోవాలని దిశ నిర్దేశం చేశారు. దేశంలోనే సివిల్ సర్వీస్ లో మొదటి స్థానంలో నిలిచిన మెటుపల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్ ను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. 

సురక్ష మహిళా సురక్షా చట్టాలు, రాజ్యాంగం, విధులు-బాధ్యతలు, ట్రాఫిక్ చట్టాలు తదితర అంశాలపై న్యాయవాది వెంకటస్వామి, మెటుపల్లి అదనపు మేజిస్ట్రేట్ దయ్య రాజారాం,  బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి వివరించారు. ప్రిన్సిపాల్ తుంగూర్ లక్ష్మి నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో  హై కోర్టు న్యాయవాది జెడి సుమన్, సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు బొక్కెనపెల్లి  నాగరాజు, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జయపాల్ నల్లాల,కళాశాల అధ్యాపకులు, పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com