రాజావారు రాణిగారు సినిమా రివ్యూ

రాజావారు రాణిగారు సినిమా రివ్యూ

కోట్ల బడ్జెట్ పెట్టి తీసే స్టార్ సినిమాలకే కాదు మంచి కంటెంట్ తో వచ్చే చిన్న బడ్జెట్ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నటీనటులు, దర్శకులు కొత్తవారైనా సరే వారి టాలెంట్ చూపించేస్తే మాత్రం సినిమా సక్సెస్ అయినట్టే. అలాంటి పంథాలో వస్తున్న మరో సినిమా రాజావారు రాణిగారు. రవికిరణ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ్, రహస్య హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

శ్రీరామపురం అనే గ్రామంలో రాజా (కిరణ్), రాణి (రహస్య) ఇద్దరు ఇంటర్ చదువుతుంటారు. రాజాకి రాణి అంటే ఇష్టం. ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ కు వేరే ఊరికి వెళ్తుంది రాణి. అయితే ఆమె కోసం ఎదురుచూస్తూ కొంత అసహనానికి గురవుతాడు రాజా. ఈక్రమంలోనే ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనే భావన మొదలవుతుంది. మూడేళ్ల తర్వాత కూడా రాణి ఊరికి రాకపోవడంతో రాజా స్నేహితులు నాయుడు, చౌదరిలు ఓ ప్లాన్ వేసి రాణిని ఊరు రప్పించేలా చేస్తారు. అయితే వారు అనుకున్నట్టుగానే రాణి వస్తుంది. అప్పటికైనా రాజా ప్రేమని రాణికి చెప్పాడా..? రాణి అతని ప్రేమని ఒప్పుకుందా..? వీరిద్దరి ప్రేమ ఎలాంటి టర్న్ తీసుకుంది అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

నూతన దర్శకుడు రవికిరణ్ రాజావారు రాణిగారు సినిమాను ప్రెజెంట్ చేసిన తీరు బాగుందని చెప్పొచ్చు. సినిమా అంతా పల్లెటూరి వాతావరణంలో తీయడంతో కన్నులకు ఇంపుగా అనిపిస్తుంది. అయితే హీరోయిన్ ను హీరో ప్రేమించడం ఆమె ప్రేమను తెలపకపోవడం.. ఆమెకి చెబితే అక్కడ తను రిజెక్ట్ చేస్తుందా అన్న ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఫీలింగ్ ఉండటం ఇదంతా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి.

తెలిసిన కథే అయినా దర్శకుడు మెప్పించేలా కథనం నడిపించాడు. సినిమా అంతా ఎంటర్టైనింగ్ గా సాగిందని చెప్పొచ్చు. అయితే కథ చాలా చిన్నది కావడం చేత అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అలరించగా సెకండ్ హాఫ్ కథనంలో వేగం తగ్గినట్టు అనిపిస్తుంది. కథ రొటీన్ గా అనిపించినా దాన్ని తెరకెక్కించిన తీరు అలరించింది. హీరో హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

ప్రేమకథలు ఎన్ని చూసినా బోర్ కొట్టవు.. రాజావారు రాణిగారు కూడా అంతా కొత్తవారితో న్యూ టాలెంట్ తో చేసినట్టు అనిపిస్తుంది. కమర్షియల్ అంశాలు.. భారీతనం ఆశిచే వారికి మాత్రం ఇది పెద్దగా నచ్చదు. మనసుకి హత్తుకునే మరో అందమైన ప్రేమ కథగా రాజావారు సినిమా యువత మెప్పు పొందుతుందని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే అవకాశం ఉంది.

నటీనటుల ప్రతిభ :

కిరణ్ అబ్బవరం లీడ్ రోల్ లో మెప్పించాడు. రాజాగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక రాణి పాత్రలో రహస్య గోరక్ మెప్పించింది. ఇద్దరు తమ పాత్రలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యారు. ఇక సినిమాలో నాయుడు పాత్రలో నటించిన యజుర్వేద్ గుర్రం.. చౌదరి పాత్ర చేసిన రాజ్ కుమార్ కూడా బాగా చేశారు. పల్లెటూరి కామెడీ ఎలా ఉంటుందో ఈ సినిమాలో బాగా చూపించారు. మిగతా నటీనటులంతా పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

జై క్రిష్ మ్యూజిక్ అలరించింది. సినిమాకు తగినట్టుగా పాటలు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. పల్లెటూరి అందాలను బాగా చూపించారు. రవికిరణ్ కథ, కథనాలు అలరించాయి. అయితే కథ రొటీన్ గా అనిపించినా కథనంతో మెప్పించాడు. మనోవికాష్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాకు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టారు.

ప్లస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే

కామెడీ

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ కొంతభాగం

రొటీన్ స్టోరీ

బాటం లైన్ :

రాజావారు రాణిగారు.. ఆకట్టుకునే ప్రయత్నం..!

రేటింగ్ : 2.5/5

Back to Top