సుందర్‌ పిచాయ్ కి మరో బాధ్యత!

- December 04, 2019 , by Maagulf
సుందర్‌ పిచాయ్ కి మరో బాధ్యత!

శాన్‌ఫ్రాన్సిస్కో: గూగుల్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సుందర్ పిచాయ్, మరో అత్యున్నత బాధ్యతను చేపట్టనున్నారు. గూగుల్‌ ఫౌండర్స్ లారీ పేజ్‌, సెర్జీ బ్రిన్‌ లు గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌ నుంచి వైదొలగిన నేపథ్యంలో ఆ సంస్థ సీఈఓగానూ సుందర్‌ పిచాయ్‌ నే నియమిస్తున్నట్టు ఓ ప్రకటన వెలువడింది. సుమారు రెండు దశాబ్దాల క్రితం ఆల్ఫాబెట్ ను లారీ పేజ్, సెర్జీ బ్రిన్ లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దానికి అనుబంధ సంస్థగా గూగుల్ పనిచేస్తోంది. ఇక సుదీర్ఘకాలం పాటు సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చిన ఇద్దరు వ్యవస్థాపకులూ ఒకేసారి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారు తమ బ్లాగ్ లో వెల్లడించారు. కీలక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నామని, ఇకపై తాము సలహా, సూచనలు మాత్రమే ఇస్తామని వారు స్పష్టం చేశారు.

గూగుల్ భవిష్యత్ ప్రాజెక్టులైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ సెర్చింగ్ తదితర కార్యకలాపాలను విజయవంతంగా సుందర్ పిచాయ్ ముందుకు తీసుకు వెళ్లగలరన్న నమ్మకం తమకుందని తెలిపారు. ఎదురయ్యే సవాళ్లను సుందర్ పిచాయ్ సమర్థవంతంగా ఎదుర్కొంటారని భావిస్తున్నట్టు పలువురు ఇన్వెస్టర్లు వ్యాఖ్యానించారు. ఇకపై లాభాలపై దృష్టిని సారించేందుకు ఆల్ఫాబెట్ ప్రయత్నిస్తుందని నమ్ముతున్నట్టు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com