తెలుగు భాషా వికసనం

- December 06, 2019 , by Maagulf
తెలుగు భాషా వికసనం

సాధారణం గా కాలగమనం లో ప్రతీ విషయానికీ పుట్టుక అంతం అంటూ ఉంటాయి . దీనికి చరిత్ర కూడా మినహాయింపు కాదు అనేలా అనేకానేక సంఘటనలు మరుగున పడిపోయిన సందర్భాలు మనకు విదితమే.
ఈ సందర్భములో తెలుగు పుట్టుక మరియు దాని వికసనం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం.

తెలుగు ఒక ప్రాచీన భాష . సంస్కృతం తరువాత ఆ స్థాయిలో శబ్ద పరిమాణాన్ని కలిగి స్వరనిబద్ధత గలిగిన భాష. మన దురదృష్టం ఇప్పుటి ప్రభుత్వాలు గుర్తించక పోయినా అదృష్టం కొద్దీ భారతదేశం లో మొత్తానికైతే తెలుగు అనే ఒక భాష 200 బి.సి ( క్రీస్తు పూర్వం ) అనగా 2 వ శతాబ్దం పూర్వం నుండి ప్రాచుర్యం లో ఉందని మాత్రం చరిత్ర చెబుతున్న నగ్న సత్యం. దక్షిణ ఆసియాలోని 24 ప్రముఖ భాషలలో తెలుగు కూడా ఒకటన్నది వాస్తవం. కాగా 2008 వ సంవత్సరం లో అక్టోబర్ 31 వ తేదీన తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

అచ్చులు , హల్లుల తో కూడిన 56 అక్షరాల తెలుగు భాష కు వ్యాకరణం మాత్రం ఒక మకుటం లా ఉంది అనడం లో ఎటువంటి సందేహం లేదు. నామవాచకం, సర్వనామం , క్రియ , విశేషణం , అవ్యయం తో కూడిన భాషా భాగములు తత్పురుష సమాసము తో మొదలిడి కర్మ ధారయ , ద్విగు, బహువ్రీహి, ద్వంద్వ, అవ్యయీభావ తో కూడినదై పదముల యొక్క అర్థమును మనకు అర్ధవంతముగా తెలుపుతుంది.

అంతే కాక అకార , ఇకార, ఉకార, యడగమ,ఆమ్రేడిత, త్రిక, గసడ వాదేశ , పుంపాద్వేశ ,రుగాగమ ,పడ్వాది, టుగాగమ ,ప్రాతాది , ఆమ్రేడిత , ధృత , ము వర్ణలోప , ద్విగు, బహువ్రీహి, అల్లోప,దుగాగమ , డు వర్ణ లోన అను సంధులు , దిత్వాక్షరాలు , సంయుక్త అక్షరాలు , సంశ్లేష అక్షరాలు , మహాప్రాణ అక్షరాలు , రెండక్షరాల పదాలు, మూడక్షరాల పదాలు , వాడుక పదాలు , విభక్తులు, లింగములు , ప్రకృతీ వికృతులు , ఏకవచనం బహు వచనం , కాలములు కలిగి లఘువులు, గురువులు, గణములు, వృత్తములతో కూడిన ఛందస్సు మరియు శబ్ద, అర్ధ అలంకారములు తో కూడి న అందమైన సొగసైన భాష నా తెలుగు.

ప్రభావాది షష్టి సంవత్సారాణం మధ్యే అని దిన సంకల్పము లో చెప్పుకునే సంవత్సరాలు ప్రభవ నుండి క్షయ వరకూ , చైత్రం నుండి ఫాల్గుణం అనబడే పన్నెండు మాసాలు , వసంతం నుండి శిశిరం వరకూ వచ్చే ఆరు రుతువులు , పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ, అలాగే పొర్ణమి నుండి అమావాస్య వరకూ శుక్ల, కృష్ణ అని పిలువబడే పక్షములు , తిథులు , అశ్విని నుండి రేవతి వరకూ ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలు , మేషం నుండి మీనం వరకూ ఉన్న పన్నెండు రాశులు, ఆదిత్యాది నవగ్రహాలు, ఆదివారం నుండి శనివారం వారం వరకూ ఉన్న ఏడూ రోజులూ కాలగమనానికి సూచిలైతే వీటికి సంభందించిన విజ్ఞానం మొత్తం మన తెలుగు భాషలో పొందుపరచబడటం మన అదృష్టం. సంస్కృతం తరువాత ఇంత విపులం గా విస్తార జ్ఞానాన్ని కలిగిన భాష తెలుగు ఒక్కటే.

ఇలా అనంతమైన తెలుగు భాషకు అజరామరమైన కీర్తి తెస్తూ కొన్ని వందల కావ్యాలను రచించిన మహనీయులెందరో , మరెందఱో.
భారతీయ ఇతిహాసము ల లో, సంస్కృత మూలమైన వాల్మీకి రామాయణాన్ని తెలుగు లోనికి యధాతధం గా తొలుత ఎవరు ఆంధ్రీకరించారో తెలియదు కానీ అటుపైన పెక్కు రామాయణములు తెలుగులోనికి అనువదించబడి కొన్ని కోట్ల సంవత్సరాల పూర్వమే రాముని నడవడి , సీతారాముల అన్యోన్య దాంపత్యం , అన్నదమ్ముల సంభంధం , సంశయం లేని స్నేహితుల మైత్రి , విచక్షణ తో కూడిన రాజనీతి , యుద్ధనీతి ఇత్యాది విషయాలను మనకు అందించబడ్డాయి . అవే ఈనాటికీ ప్రామాణికమై మనలని శాంతికాముకులు కావడానికి దిశా నిర్దేశం చేస్తున్నాయి .

ఆ తరువాత కాలం లో సుమారు 11-13 వ శతాబ్దాల మధ్యలో మరో ఇతిహాసమైన మహాభారతమును ఆంధ్రీకరించి కవిత్రయం నన్నయ్య, తిక్కన , ఎర్రాప్రగడ తెలుగు ప్రజలకు మహోపకారం చేశారు. అదే సమయం లో పాల్కురి సోమనాధుడు బసవ పురాణమును కూడా తెలుగులో అందించాడు.

14-15 వ శతాబ్దం మధ్యలోనే మరో మహాత్ముడి కలం నుండి జాలు వారిన కీర్తనలు నేటికీ మధుర స్వరాలు . ఆయనే తొలిపద కవితా పితామహుడు శ్రీ అన్నమయ్య. 32000కు పైగా సంకీర్తనలు రచించి అనంతరం శ్రీవేంకటేశ్వరుని లో లీనమైన మహోన్నతుడు . అదే సమయం లో కవి సార్వభౌముడిగా గా పేరుగాంచిన శ్రీనాథుడు శృంగార నైషధం అను రచన ద్వారా సమకాలీన జీవనం లో ని దంపతుల మధ్య ఉన్న ప్రణయ బంధాలను ఉటంకించాడు . మరో ప్రక్క ఆతుకూరి మొల్ల అనే మహనీయురాలు మొల్ల రామాయణం పేరిట రచించి తానూ తెలుగు భాషకు అక్షర నీరాజనం గావించింది.
ఇక ఇదే సమయం లో అనగా 14-15 వ శతాబ్దం ఆఖరు నాళ్ళలో ఏకశిలానగర వాస్తవ్యుడైన బమ్మెఱ పోతనామాత్యుడు ఆ శ్రీరాముని ఆనతిపై శ్రీమద్ మహాభాగవతమును తెలుగు లోనికి తర్జుమా చేసి ఆంధ్రమహాభాగవతమును ఆవిష్కరించాడు.

16 వ శతాబ్దం నాటికీ తెలుగు నాట విశేష సాహిత్య సేవలు అందించిన వాళ్లలో అగ్రగణ్యులు తెనాలి రామకృష్ణుడు , అల్లసాని పెద్దన , ధూర్జటి వంటి వారు వీరందరూ ఆనాటి విజయనగర సంస్థానాధీసుడైన శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానం లోని అష్ట దిగ్గజాలలో ప్రముఖులు . కళలకు కాణాచి అయిన ఆ సంస్థానం లో నే తన తెలుగు కావ్యమైన ఆముక్త మాల్యదను ఆవిష్కరించాడు శ్రీకృష్ణ దేవరాయలు .
16 వ శతాబ్దపు ఆఖరుకి కళా పూర్ణోదయం తో పింగళి సూరన తెలుగు భాషకు మరింత శోభను తీసుకు వచ్చాడు.

17 నుండి 18 వ శతాబ్దాల మధ్యకాలం లో అటు క్షేత్రయ్య, ఇటు త్యాగయ్య తమ కీర్తనలతో ఆబాల గోపాలాన్ని అలరించారు . వారితో సమకాలీనులైన శ్యామశాస్త్రి , ముత్తుస్వామి దీక్షితార్ కూడా తమ కీర్తనలతో, సంగీత సారస్వతాలతో తెలుగు తల్లికి స్వరాభిషేకం గావించారు. అదే సమయం లో వేమన ఆనాడే మూఢనమ్మకాలకు వ్యతిరేకం గా వాస్తవ దృక్పధం తో వైరాగ్య చింతుడై పలికిన వేమన శతకం నేటికీ మన తెలుగునాట చిరపరిచితమే.

17 వ శతాబ్దపు ఆఖరు నాళ్లలో తెలుగు భాష మనుగడ కొంత ఆపసోపాలు పడుతున్నవేళ చార్లెస్ సి.పి బ్రౌన్ తెలుగు నిఘంటువు ద్వారా తెలుగు ను గ్రంధస్తం చేసి తెలుగు భాష మనుగడకు కేంద్ర బిందువైయ్యాడు.

ఇక 18 వ శతాబ్దం నుండి తెలుగు బాష మరింత వడి వడిగా పరుగులు పెడుతూ బాలవ్యాకరణం , పంచ తంత్రం తో పరవస్తు చిన్నయసూరి , రాజశేఖర చరితం పేరిట కందుకూరి వీరేశలింగం పంతులు, కన్యాశుల్కము పేరిట గురజాడ అప్పారావు తెలుగు రచనా రంగం లోనే ఒక క్రొత్తవొరవడిని తీసుకువచ్చారు. ఆంధ్రావళి పేరిట రాయప్రోలు సుబ్బారావు , రామాయణ కల్పవృక్షం, వేయిపడగలు పేరిట విశ్వనాథ సత్యనారాయణ , చలం సాహిత్యం ,మహాప్రస్థానం పేరిట శ్రీ శ్రీ , కొడవగంటి సుబ్బారావు , ఇల్లిందల సరస్వతి దేవి , గుంటూరు శేషేంద్ర శర్మ రచనలు తెలుగు భాషను సమున్నత స్థాయికి తీసుకు వెళ్లాయి. సినారే , ఆత్రేయ వంటి వారి కలం నుండి వచ్చిన సాహిత్య పరిమళాలు సుమధురం. వీరితో పాటు తెలుగు భాషా మకరంద అమృత పానాన్ని గ్రోలి తమ సంగీతం తో సారస్వతాభిషేకం చేసిన మహనీయులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు , మంగళంపల్లి బాలమురళీ కృష్ణ  .

ఇలా చెప్పుకుంటూ పొతే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తెలుగు భాష తన నుడి కారాన్ని యాసను కాలానికి అనుగుణం గా మార్చుకుంటూ అనంత విశ్వం వైపు అడుగులు వేస్తున్న వేళ కొందరి దుశ్చర్యల ఫలితం గా నా తెలుగు నాట మా అమ్మ భాష సంకెళ్లు వేసుకుని మృతజీవిగా మారుతోంది.
ఈ దుశ్చర్యలు ఆగాలి. తెలుగు భాషపై ఏ మాత్రం అభిమానమున్నా ప్రభుత్వం తక్షణమే క్రొద్దిరోజుల క్రితం జారీచేసిన ఉత్తర్వులు నిలిపివేసి మాతృభాషలోనే బోధనను కొనసాగించాలి.
తెలుగు భాషా పరిరక్షణ కై నేను చేస్తున్న ఈ ప్రయత్నం సిద్దించి సత్ఫలితం ఇవ్వగలదని ఆశిస్తున్నాను.

--సుబ్రమణ్య శర్మ (షార్జా)


  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com