న్యూజీలాండ్లో పేలిన అగ్నిపర్వతం.. పర్యటకులు గల్లంతు
- December 09, 2019
న్యూజీలాండ్లో ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. సమీప ప్రాంతంలో ఉన్న సుమారు 50 మందిలో పలువురు గల్లంతైనట్లు భావిస్తున్నామని పోలీసులు చెప్పారు.
వైట్ ఐలండ్ క్రేటర్లోని ఈ అగ్నిపర్వతం పేలుడుకు కొద్దిసేపటి ముందు కొందరు పర్యటకులు దాని సమీపంలో నడుస్తూ కనిపించారు. అగ్నిపర్వతం సమీపం నుంచి రక్షించిన వారిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు.
వాకారి అని స్థానికంగా పిలిచే వైట్ ఐలండ్ న్యూజీలాండ్లోని నార్త్ ఐలండ్ తీరానికి దూరంగా ఉండే ఒక చిన్న దీవిగా ఉండే అగ్నిపర్వతం. దేశంలో అత్యంత క్రియాశీలంగా ఉండే అగ్నిపర్వతాల్లో ఇదొకటి. అయినప్పటికీ.. ఈ అగ్నిపర్వత దీవిని సందర్శించటానికి రోజూ పర్యటకులు వస్తుంటారు. పగటి పూట పర్యటనలతో పాటు విహంగ విహారాలు కూడా ఉంటాయి.
ఈ దీవి నుంచి వెనుదిరిగి వస్తున్న మైఖేల్ షేడ్ అనే పర్యటకుడు.. అగ్నిపర్వతం విస్ఫోటనాన్ని వీడియో తీశారు. ఈ వీడియోలో పర్వతం పైభాగాన దట్టమైన బూడిదతో నిండిన పొగ కనిపిస్తోంది. మరి కొందరు పర్యటకులు తమను రక్షించటం కోసం ఆ దీవిలో వేచి ఉండటం కూడా కనిపించింది.
''అగ్నిపర్వతం అత్యంత క్రియాశీలంగా ఉంది.. అయినా సురక్షితంగానే అనిపించింది. ఆ సమయంలో దీనిని సందర్శించే పర్యటకుల బృందాల్లో సభ్యుల సంఖ్యను తగ్గించటానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు'' అని చెప్పారు. ''మేం బోటులోకి ఎక్కి మధ్యాహ్న భోజనం చేస్తున్నాం. అందువల్ల బోటు నెమ్మదిగా ముందుకు వెళుతోంది. పది నిమిషాలు గడిచింది. అకస్మాత్తుగా ఎవరో అటువైపు చూపించారు. మేం చూశాం. నేను దిగ్భ్రాంతి చెందాను. బోటు వెను దిరిగి దీవి దగ్గరకు వెళ్లింది. అక్కడ వేచిచుస్తున్న కొంతమందిని బోటులో ఎక్కించుకుని తిరిగి బయలుదేరాం'' అని ఆయన వివరించారు.
అగ్నిపర్వతం పేలుడుకు ముందు క్రేటర్ లోపల కొంత మంది పర్యటకులు ఉండటం.. వారు ఉండగానే దట్టంగా బూడిద పొగ నల్లగా అలుముకోవటం ఒక వీడియో దృశ్యంలో కనిపించింది.
న్యూజీలాండ్ ప్రధానమంత్రి జెసిందా ఆర్డెన్.. న్యూజిలాండ్తో పాటు విదేశాలకు చెందిన పలువురు పర్యటకులు ఈ దీవి మీద, సమీపంలో ఉన్నారని పేర్కొన్నారు. ''అక్కడ గల్లంతైన వారి కోసం బంధుమిత్రులు చాలా ఆందోళన చెందుతుంటారని నాకు తెలుసు. వారిని రక్షించటానికి పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు'' అని ఆమె హామీ ఇచ్చారు. పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారని.. కానీ దట్టమైన బూడిద కురుస్తుండటం వల్ల వారు ఆ ప్రాంతానికి చేరుకోలేకపోతున్నారని చెప్పారు.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2:11 గంటలకు (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6:49 గంటలకు) విస్ఫోటనం మొదలైంది.
''పేలుడు సమయంలో ఆ దీవి మీద కానీ దీవి సమీపంలో కానీ సుమారు 100 మంది ఉన్నారని తొలుత భావించారు. అయితే ఆ సమయంలో 50 మంది కన్నా తక్కువ ఉండి ఉంటారని ఇప్పుడు అంచనా వేస్తున్నాం'' అని పోలీసులు పేర్కొన్నారు. ''వారిలో కొంత మందిని తీరానికి తరలించాం. అయినా ఇంకొంతమంది ఆచూకీ తెలియటం లేదని భావిస్తున్నాం'' అని చెప్పారు.
అగ్నిపర్వతం పేలుడు వల్ల సమీప ప్రాంతాల్లో బూడిద కురిసే అవకాశం ఉందని, స్థానికులు ఇళ్లలోనే ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వైట్ ఐలండ్ అగ్నిపర్వతం పేలుడు క్రియాశీలత సాధారణం కన్నా అధికంగా ఉండే దశలోకి ప్రవేశిస్తోందని.. భౌగోళిక విపత్తుల పర్యవేక్షణ వెబ్సైట్ జియోనెట్ డిసెంబర్ 3వ తేదీన హెచ్చరించింది. అయితే.. ప్రస్తుత క్రియాశీలత స్థాయి పర్యటకులకు నేరుగా ప్రమాదకరం కాదని కూడా పేర్కొంది. వైట్ ఐలండ్ అగ్నిపర్వతం పలుమార్లు బద్దలైంది. ప్రస్తుత పేలుడుకు ముందు చివరిసారి 2016లో విస్ఫోటనం సంభవించింది. ఆ సమయంలో ఎవరూ గాయపడలేదు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







