భారత వస్త్రధారణలో నోబెల్ పురస్కారం అందుకున్న అభిజీత్ దంపతులు

భారత వస్త్రధారణలో నోబెల్ పురస్కారం అందుకున్న అభిజీత్ దంపతులు

 

స్టాక్‌హోమ్: ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారం భారత సంతతి వ్యక్తి అభిజీత్ వినాయక్ బెనర్జీని వరించిన సంగతి తెలిసిందే. అభిజీత్‌తో పాటుగా ఆయన భార్య ఎస్తేర్ డఫ్లోకు కూడా ఆర్థికశాస్త్రంలో నోబెల్ వరించింది. ఇక నోబెల్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం స్టాక్‌హోంలో జరిగింది. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమానికి అభిజీత్ దంపతులు భారత వస్త్రధారణలో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. నల్లటి బంధ్‌గాలా ధరించి దానిపైకి తెల్లడి ధోవతి ధరించారు. ఇక అభిజీత్ భార్య ఎస్తేర్ డఫ్లో నీలం రంగు చీరలో కనిపించారు. మరో నోబెల్ పురస్కార విజేత మైఖేల్ క్రెమర్ నల్లటి సూట్ ధరించారు.

ఆర్థికశాస్త్రంలో ఈ త్రయం నోబెల్ పురస్కారం దక్కించుకుంది. ఇక స్టాక్‌హోంలో అత్యంత వైభంగా జరిగిన నోబెల్ పురస్కార ప్రధాన కార్యక్రమంలో అభిజీత్, ఎస్తేర్‌ మరియు మైఖేల్ క్రెమర్‌లు స్వీడన్ రాజు కార్ల్ గుస్తాఫ్‌ చేతులు మీదుగా బహుమతి అందుకున్నారు. ఆర్థికశాస్త్రంలో వీరు చేసిన అశేష కృషిని గుర్తిస్తూ ఈ త్రయానికి నోబెల్ పురస్కార సంస్థ నోబెల్ బహుమతిని ప్రకటించింది. ఇందులో భాగంగా ఒక మెడల్‌ను రాజు గుస్తాఫ్ ప్రదానం చేశారు. అంతేకాదు స్వీడిష్ కరెన్సీలో 9 మిలియన్ స్వీడిష్ క్రోనా అంటే భారత కరెన్సీలో రూ.6.7 కోట్లు బహుమతి కింద ఇవ్వడం జరిగింది.

భారత్‌లో జన్మించిన అభిజీత్ బెనర్జీ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని పొందిన రెండో భారత సంతతి వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. అంతకుముందు ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ ఈ ప్రతిష్టాత్మక బహుమతిని అందుకున్నారు. కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో వీరిద్దరూ విద్యనభ్యసించడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న దారిద్ర్యం లేదా పేదరిక నిర్మూలన కోసం అభిజీత్ త్రయం కనుగొన్న ఫార్ములా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావించిన జ్యూరీ వీరిని నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఇక అభిజీత్ ఆయన భార్య ఎస్తేర్ డఫ్లో మశాచుషెట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. మరోవైపు క్రీమర్ హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

ఇక వీరు కనుగొన్న ఫార్ములా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదరికంను నిర్మూలించడమే కాదు అభివృద్ధి చెందుతున్న ఆర్థికశాస్త్రంకు కొత్త జీవం ఇస్తుందని చాలామంది ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నోబెల్ పురస్కారం ప్రకటన జరిగిన తర్వాత భారత్‌లో పర్యటించిన అభిజీత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. దేశంలో నెలకొన్న కఠినమైన జాతీయవాదం దేశంలోని పేదరిక నిర్మూలన అంశాన్ని పక్కదారి పట్టిస్తోందని వ్యాఖ్యానించారు.

Back to Top