ఇండియన్ పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు

- December 13, 2019 , by Maagulf
ఇండియన్ పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు

ఢిల్లీ: రెండు రోజులుగా పాస్‌పోర్ట్‌ వ్యవహారం చర్చనీయాంశమమైంది. కేరళలోని కోజికోడ్‌లో పంపిణీకి సిద్ధంగా ఉన్న పాస్‌పోర్ట్‌ పుస్తకాల్లో కమలం చిహ్నం ముద్రించినట్లు ఆరోపణలు రావడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయమై లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యుడొకరు లేవనెత్తడంతో కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది. నకిలీ పాస్‌పోర్ట్‌లను గుర్తించడం, భద్రతా ప్రమాణాల పెంపుదలలో భాగంగానే కొత్త పాస్‌పోర్ట్‌ పుస్తకాలపై కమలం చిహ్నాన్ని ముద్రించామని తెలిపింది. ఒక్క చిహ్నాలే కాదు కొత్త పాస్‌పోర్ట్‌ల్లో మరిన్ని మార్పులు కూడా చోటు చేసుకున్నాయి.


 
గతంలో పాస్‌పోర్ట్‌ రెండో పేజీలో పాస్‌పోర్ట్‌ అధికారి సంతకం ఉండేది. ఇప్పుడు ఆ స్థానంలో కమలం గుర్తు ఉండనుంది. వంతులవారీగా ఇతర జాతీయ చిహ్నాలను ఆ స్థానంలో ముద్రించనున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్‌ తెలిపారు. పాత పాస్‌పోర్ట్‌లో వ్యక్తిపేరు, చిరునామా, ఇతర వివరాల కోసం వేర్వేరు కాలమ్‌లు ఉండేవి. కొత్త పాస్‌పోర్ట్‌లో వేర్వేరుగా కాలమ్స్‌ ఉండబోవు. పాస్‌పోర్ట్‌ కోడ్‌లలో కూడా మార్పులు చేశారు.

పాస్‌పోర్ట్‌ నాణ్యతనూ పెంచుతున్నారు. నాణ్యమైన కాగితాన్ని, మంచి ప్రింటింగ్‌ టెక్నాలజీని ముద్రణలో ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ముద్రణ ప్రక్రియ చేపడుతున్నారు. కొత్త ఫీచర్లతో వస్తున్న పాస్‌పోర్ట్‌లకు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) ఆమోద ముద్ర వేసింది. మరోవైపు మరిన్ని భద్రతా ప్రమాణాలతో ఈ-పాస్‌పోర్ట్‌లను కూడా తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ సన్నద్ధమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com