పౌరసత్వ ఉద్యమాల్లో పాల్గొంటే ఉద్యోగాలు ఊడిపోతాయ్

- December 19, 2019 , by Maagulf
పౌరసత్వ ఉద్యమాల్లో పాల్గొంటే ఉద్యోగాలు ఊడిపోతాయ్

ఢిల్లీ:పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని అట్టుడికిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పలు బహుళజాతి సంస్థలు తమ ఉద్యోగులకు హెచ్చరికలను జారీ చేశాయి. ఎట్టి పరిస్థితుల్లో గానీ, ఏ కారణంతోనైనా గానీ.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనల్లో పాల్గొంటే.. ఉద్యోగాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని వెల్లడించాయి. అవసరమైతే ఇంట్లో నుంచే పని చేసుకోవచ్చని వెసలుబాటును కల్పించాయి.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీలో కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు గురువారం నాటికి మరింత తీవ్రరూపం దాల్చాయి. రాజకీయ నాయకులు, కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ ఆందోళనలకు మద్దతు ఇవ్వడంతో పరిస్థితి అదుపు తప్పినట్టయింది. ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను చేపట్టడం వల్ల దేశ రాజధానిలో జనజీవనం దాదాపు స్తంభించి పోయింది. వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి.

ఈ పరిస్థితుల మధ్య ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, ఐటీ నిపుణులు సకాలంలో తమ కార్యాలయాలకు చేరలేని పరిస్థితి ఏర్పడింది. దీనితో ఆయా సంస్థల యాజమాన్యాలు ఉద్యోగులకు అప్పటికప్పుడు మెసేజీలను పంపించాయి. కార్యాలయాల వరకూ రావాల్సిన అవసరం లేదని, ఇంట్లో నుంచే పని చేసుకోవచ్చని సూచించాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వెసలుబాటు కల్పించామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నాయి.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు, నిరసన ప్రదర్శనల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదంటూ సూచించాయి. సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు, ఏ స్థాయిలో పని చేస్తోన్న ఉద్యోగులైనా సరే.. ఉద్యమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. ముందస్తు నోటీసులను జారీ చేయకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని పేర్కొన్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పరోక్షంగా కూడా తమ అభిప్రాయాలను తెలియజేయకూడదని, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై జరిగే డిబేట్లలో సైతం పాల్గొనవద్దని ఆదేశించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com