CAB ఎఫెక్ట్: భారత్‌కు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ప్రపంచదేశాలు

- December 20, 2019 , by Maagulf
CAB ఎఫెక్ట్: భారత్‌కు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ప్రపంచదేశాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఎటు చూసినా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే పలు ప్రపంచదేశాలు భారత్‌కు వెళ్లే తమ దేశస్తులను జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చిరించాయి. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లరాదని తమ పౌరులకు ఆయా దేశాలు సూచించాయి. అమెరికా, యూకే, ఇజ్రాయిల్, కెనడా, సింగపూర్ దేశాలు గతవారమే భారత్‌కు వెళ్లే తమ పౌరులకు కొన్ని జాగ్రత్తలు సూచనలు చేశాయి. ముఖ్యంగా భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే వారికి గట్టి హెచ్చరికతో కూడిన సూచనలు చేశాయి.

ఇదిలా ఉంటే గురువారం రష్యా విదేశాంగ శాఖ కార్యాలయం కూడా తమ పౌరులకు హెచ్చరికలతో కూడిన సూచనలు చేసింది. భారత్‌లో పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేసింది. ఇక నిరసనలు జరుగుతున్న ప్రాంతాల్లో తమ పౌరులు వెళ్లరాదని అక్కడేమైనా జరిగే అవకాశముందని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది.

ఇదే పద్ధతిలో బ్రిటన్ కూడా తమ పౌరులకు జాగ్రత్తలు సూచించింది. అంతేకాదు కొన్ని చోట్ల మొబైల్ ఇంటర్నెట్ సేవలు సస్పెండ్ చేయడం వల్ల తమ పౌరులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని అమెరికా ఎంబసీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

మరోవైపు భారత్‌లో పర్యటించే కెనడా పౌరులు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించింది కెనడా ప్రభుత్వం. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో పర్యటనలు ఉంటే రద్దు చేసుకోవాలని తమ పౌరులకు సూచించింది. ఇక అస్సాంలో అస్సలు అడుగు పెట్టరాదని తమ పౌరులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయిల్ ప్రభుత్వం. ఇక భారత్‌లో ఇతర రాష్ట్రాలకు కూడా నిరసనలు పాకడంతో వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఆతర్వాతే నిర్ణయం తీసుకోవాలంటూ ఇజ్రాయిల్ తమ దేశ పౌరులకు సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com