షార్జా లో సంక్రాంతి బొమ్మల కొలువు

షార్జా లో సంక్రాంతి బొమ్మల కొలువు

సంక్రాంతి అనగానే మనకందరికీ గుర్తుకు వచ్చేది ముందుగా గ్రామీణ వాతావరణం. కొత్తగా చేతికొచ్చిన పంట, ఆపైన ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులు ఆత్మీయ కలయిక, రంగవల్లులు,ఇలా సరదా సరదాగా సాగిపోయే అతిపెద్ద పండుగ. పెద్దవాళ్ళ సందడి ఎలావున్నా పిల్లల సందడే సందడి.

సంక్రాంతి సమయంలో పెట్టే బొమ్మలకొలువుల్లో ఉండే విశేషమే వేరు. ఇంటికి ఒక క్రొత్తదనాన్ని తీసుకు వస్తుంది. సంక్రాంతి శోభను అతి రమణీయంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాం.  
షార్జాలో ని మా  నివాసం లో ఏర్పాటు చేసిన బొమ్మలకొలువు లో తెలుగింటి మరీ ముఖ్యం గా గ్రామీణ వాతావరణాన్ని  అందునా చక్కని పంటపొలాలు, రైతన్న జీవనం, ఆహ్లదకరంగా ఉండే మన పల్లె వాతావరణం ఒక్కసారైనా మీరు చూడాల్సిందే .
అలాగే ఏ పండుగకైనా మాకొక తప్పని సరి దేవుడున్నాడండోయ్. ఆయనే మా జానకిరామయ్య,అనుజుడు లక్ష్మణుడు అర్ధాంగి జానకీ తో పాటు తన బహిప్రాణమైన ఆంజనేయుడితో అగ్రసింహాసనం పై కొలువుదీరాడు ఈ బొమ్మలకొలువులో,ఆపైన మా శివయ్య కూడా తన అర్ధభాగమైన హిమగిరిసుత తో కూడి తమ అంకపీఠాలపై ఒకవైపు సుబ్రహ్మణ్యుడు,మరోవైపు గణేశుడు వెరసి ఆహా ఏమి పరివారం అనిపించేలా మనలను ఆనంద  పరవశులను చేయక మానరు. వారితో పాటు శ్రీమన్నారాయణుని దశావతారములతో ఇక్కడ కొలువుదీరాడు కూడా సద్యోజాత, ఈశాన్య  ..... ముఖములతో కూడి మహేశ్వరుడు పశుపతినాధుడుగా మనకు దర్శనమిస్తాడు కూడా నందీశ్వర నమస్తుభ్యం ......... ధాతుమర్హసి అని ఆ నంది ని వేడుకుంటేనే మీకు మా దర్శనం అనేలా ఆయనను తమ ముందే ఉంచుకున్నారు ఆ ఆదిదంపతులు వీరితో పాటు అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ మా దుర్గమ్మ స్థానం అతి ముఖ్య స్థానం.  
గోపికా విహారి బృందావనం మనకు మోదకారకం.

అహింసో పరమధర్మ అని భోదించే బుద్ధుని కూడా మనం ఇక్కడ చూడవచ్చు .
ఇక జానపదాలలో కనిపించే పల్లె పడుచుల ముచ్చటైన రూపం ముగ్ద మనోహరం .
సత్యమేవజయతే  ఇదీ మన భారతీయ నినాదం . ఇది గుర్తుకుతెచ్చేలా అశోక స్థంభం దానిపైన నాలుగు సింహాలు . క్రింద భారత స్వాతంత్ర స్ఫూర్తి ప్రదాతలు మనలోని దేశభక్తిని తట్టిలేపుతారు .

భిన్నత్వం లో ఏకత్వం మన భారతీయుల జీవన విధానం అందుకనే శాంతా తాత ను కూడా ఆహ్వానించినట్లున్నారు . మంచుకొండలలో వెన్నెల గృహాలు అందర్నీ పలకరించే ఈ క్రిస్మస్ తాత మిమ్మల్ని కూడా పలకరిస్తాడు.

ఆఖరుగా ఈనాటి బాలలే రేపటి పౌరులు, శాస్త్ర సాంకేతిక , రక్షణ రంగాలలో సాటిలేని మేటి ధీరులు అందుకే ఈ సారి సరిలేరు మాకెవ్వరు అంటూ వివిధ రంగాలకు సంభందించిన అన్నింటినీ ఒక్కచోటే ప్రదర్శించిన తీరు కు శభాష్ అనకుండా ఉండలేము.మొత్తానికి ఈ సంక్రాంతి మా బొమ్మల కొలువు మీకు మహదానందం కలిగించిందనే  భావిస్తున్నాము.మళ్ళీ సంక్రాంతికి కలుద్దాం.అందాక సెలవు.  

--ఇట్లు కిరణ్ కుమార్,రాగమయూరి పిల్లలు : అనీష్ , హాసిని

Back to Top