ఎన్‌పీఆర్‌కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

- January 23, 2020 , by Maagulf
ఎన్‌పీఆర్‌కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

జాతీయ జనాభా పట్టిక-NPRకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. NPR విషయంలో ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలు తొలగించడానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జన గణన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జనగణన, NPRలపై వివిధ వర్గాల ప్రజల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్న ప్రభుత్వం, ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని సూచించింది.

NPR ప్రాసెస్‌లో జనగణన సిబ్బంది వ్యవహరించాల్సిన తీరు, సమాచారం సేకరించాల్సిన విధానాన్ని వివరించింది. NPR ప్రక్రియలో ప్రజలు ఎలాంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు ఇచ్చే వివరాలను మాత్రమే సిబ్బంది నమోదు చేస్తారని పేర్కొంది. అలాగే, ఎలాంటి డాక్యుమెంట్లు అడగొద్దనే విషయంపై జనగణన సిబ్బందికి కూడా సరైన ట్రైనింగ్ ఇచ్చామని తెలిపింది.

పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక, ఎన్‌ఆర్‌సీలపై దేశవ్యాప్తంగా రగడ కొనసాగుతోంది. సీఏఏకు వ్యతిరేకంగా కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు ఏకంగా తీర్మానం చేశాయి. మహారాష్ట్ర, బెంగాల్ ప్రభుత్వాలు కూడా తీర్మానం చేయడానికి సిద్ధమయ్యాయి. ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ విషయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. కేరళ సర్కారు ఎన్‌పీఆర్‌ ప్రాసెస్‌ను కూడా నిలిపివేసింది. ప్రతిపక్షాలు అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో, వైసీపీ సర్కారు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌పీఆర్ అమలుకు చర్యలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com