హైదరాబాద్‌ను హడలెత్తిస్తున్న కరోనా వైరస్
- January 28, 2020
కరోనా వైరస్ హైదరాబాద్‌ను వణికిస్తోంది. చైనాలో చిన్నగా ప్రారంభమైన కరోనా భయం.. ఇప్పుడు భారత్‌ను వెంటాడుతోంది. ముఖ్యంగా హైదరబాద్‌లో అనుమానాలు పెంచుతోంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో వచ్చి ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే నాలుగు అనుమానిత కేసులతో హైదరాబాద్ ఉలిక్కి పడింది. అయితే, ఆ నలుగురిలో ఇద్దరి రక్తనమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ ఊపిరి పీల్చుకుంది.
మరోవైపు ఈ ప్రమాదకరమైన కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో వ్యాధి గ్రస్తులను గుర్తించకపోయినా.. ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే.. వెంటనే చికిత్స చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. ముఖ్యంగా గాంధీ, చెస్ట్ ఆసుపత్రుల్లో ఒక్కోదాంట్లో 8 పడకల చొప్పున వెంటిలేటర్లు, ఇతర అధునాతన పరికరాలతో కూడిన ఐసీయూలను అందుబాటులో ఉంచారు.
కరోనా వైరస్ బాధితుల చికిత్స, నమూనాల సేకరణ, పుణెకు పంపించడం, ఫలితాలు ఎప్పటికప్పుడూ తెలుసుకోవడం, అవసరమైన ఇతర ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని కూడా వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వైద్య ఉన్నతాధికారులతో సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు అందించే చికిత్స ఏర్పాట్లను సమీక్షించేందుకు ఇప్పటికే కేంద్ర బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. ఆ బృందం మంగళవారం రాష్ట్ర వైద్యాధికారులతో భేటీ కానుంది.
చైనా, హాంకాంగ్ తదితర దేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వారిలో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే.. కరోనా వైరస్ వచ్చిందనే భయంతో ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు. సాధారణ ఫ్లూ లక్షణాలుంటే.. వారిలో కరోనా పరీక్షలు చేయించాల్సిన అవసరం లేదని, ఈ వైరస్ లక్షణాలు కావచ్చేమోననే అనుమానిస్తే మాత్రం వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించాలని కేంద్ర అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?