దలైలామా వారసుడి ఎంపిక పై అమెరికా జోక్యం

- January 29, 2020 , by Maagulf
దలైలామా వారసుడి ఎంపిక పై అమెరికా జోక్యం

ప్రవాసంలో ఉన్న టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడి ఎంపికలో జోక్యం చేసుకునే చైనా అధికారులపై అమెరికా ఆంక్షలు విధించడానికి రంగం సిధ్ధమైంది. వారు తమ దేశానికి రాకుండా, ఎలాంటి ఆర్ధిక ప్రయోజనాలు పొందకుండా చూసేందుకు ఉద్దేశించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. వారిపై ఆంక్షలు విధించే అధికారాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు.

కాంగ్రెస్ సభ్యుడు జేమ్స్ పి. మెక్ గవర్న్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 392 మంది సభ్యులు ఓటు చేయగా.. కేవలం 22 మంది మాత్రమే వ్యతిరేకించారు. (చైనాపై గల హౌస్ రూల్స్ కమిటీకి, కాంగ్రెషనల్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ కు జేమ్స్ చైర్మన్ కూడా). సెనేట్ కూడా దీనిని ఆమోదించి అధ్యక్షుడు దీనిపై సంతకం చేసిన పక్షంలో.. చైనాకు మరిన్ని కష్టాలు తప్పవు. ఈ బిల్లు ప్రకారం.. టిబెట్ రాజధాని లాసాలో మా దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించేందుకు మీరు అనుమతించేవరకు.. మా దేశంలోనూ మీ కాన్సులేట్ ను ఓపెన్ చేసేందుకు అనుమతించే ప్రసక్తే లేదని అమెరికా స్పష్టం చేసింది.

టిబెట్ లో 15 వ దలైలామా ఎంపిక అన్నది పూర్తిగా మతపరమైనదని, దీన్ని కేవలం టిబెట్ బౌధ్ధులు మాత్రమే నిర్ణయించాల్సి ఉంటుందని ఈ బిల్లు పేర్కొంటోంది. దీని ప్రకారం దలైలామా వారసుడి ఎంపికలో చైనా అధికారులెవరైనా జోక్యం చేసుకున్న పక్షంలో.. అమెరికాలోకి వారిని అనుమతించబోరు. అలాగే వారి ఆస్తులను స్తంభింపజేస్తారు. ప్రతినిధుల సభను ఉద్దేశించి ప్రసంగించిన స్పీకర్ నాన్సీ పెలోసీ.. టిబెట్ లో మతపరమైన, సాంస్కృతికపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే అందుకు బీజింగే జవాబుదారీ వహించాల్సి ఉంటుందని ఈ బిల్లు ఆ దేశానికి క్లియర్ సిగ్నల్ ఇస్తోందని అన్నారు. ఏమైనా… దలైలామా వారసుడి ఎంపిక దాదాపు పరోక్షంగా మా నిర్ణయం ప్రకారమే జరగాలని అన్నట్టు ఈ బిల్లు ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com