సౌదీ అరేబియాలో H5N8 బర్డ్ ఫ్ల్యూ వైరస్..అత్యవసర చర్యలు చేపట్టిన అధికారులు

- February 05, 2020 , by Maagulf
సౌదీ అరేబియాలో H5N8 బర్డ్ ఫ్ల్యూ వైరస్..అత్యవసర చర్యలు చేపట్టిన అధికారులు

సౌదీ అరేబియా:ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దడపుట్టిస్తున్న వేళ...సౌదీ అరేబియాలో అనూహ్యంగా H5N8 బర్డ్ ఫ్ల్యూ వైరస్ వెలుగుచూసింది. సెంట్రల్ రియాద్ లోని సుదెయిర్ ప్రాంతంలోని ఓ పౌల్ట్రి ఫాంలో వైరస్ ను గుర్తించినట్లు మినిస్ట్రి ఆఫ్ ఎన్విరాన్మెంట్, వాటర్ అండ్ అగ్రికల్చర్ తెలిపింది. అయితే..వైరస్ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అత్యవసరంగా కట్టుదిట్టమైన నివారణ చర్యలు చేపట్టారు. సుదెయిర్ కు ఎమర్జెన్సీ టీమ్స్ ను పంపించారు. వైరస్ కారణంగా దాదాపు 22,700 కోళ్లు చనిపోయినట్లు వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ -OIE వర్గాలు తమ రిపోర్ట్ లో వెల్లడించాయి. దీంతో వైరస్ ఎపిక్ పాయింట్ గా ఉన్న పౌల్ట్రిలోని 3,85, 300 కోళ్లను చంపేసి పాతిపెట్టేశారు. 2018 జులై తర్వాత సౌదీలో మళ్లీ H5N8 బర్డ్ ఫ్ల్యూ వైరస్ వ్యాప్తిచెందటం ఇదే మొదటిసారి. అయితే..H5N8తో పక్షులకు మాత్రమే ప్రమాదమని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. వైరస్ వ్యాప్తి చెందకుండా పౌల్ట్రీ యజమానులు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. కొత్త బర్డ్స్ ను పౌల్ట్రి ఫాంలోకి ఇంపోర్ట్ చేసుకోవద్దని, అలాగే పక్షులను వేటాడటం లాంటివి చేయకూడదని కూడా చెబుతున్నారు. వైరస్ సోకినట్లు నిర్ధారణ కావటంతో మిగిలిన పౌల్ట్రి యజమానులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అనుమానం కలిగినా..8002470000 నెంబర్ కి ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com